Menu

Pandya-Rohit: ‘ది స్వీట్‌ కిస్‌..’ ముద్దుతో చిచ్చును ఆర్పేసిన రోహిత్‌!

Praja Dhwani Desk
rohit sharma kisses hardik pandya

కొంతమంది వయసు పెరిగే కొద్దీ మానసికంగా పరిణితి సాధిస్తారు.. మరికొంతమందికి బాధలు, అవమానాలే ఎలా నడవాలో, నలుగురితో ఎలా మెలగాలో నేర్పుతాయి. టీమిండియా క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా కెరీర్‌లో ఆటతో సమానంగానే ఇతర విషయాల్లోనూ వార్తల్లో నిలుస్తూ ఉండేవాడు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ ఎపిసోడ్‌లో పాండ్యా చేసిన సెక్సిస్ట్‌ కామెంట్స్‌ అయినా 2024 ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ప్లేయర్‌ తిలక్‌ వర్మ ఆటతీరును విమర్శిస్తూ పోస్ట్‌ మ్యాచ్‌ ప్రజెంటేషన్‌లో చేసిన వ్యాఖ్యలైనా పాండ్యాలోని ఇమెచ్యూరిటీని చూపిస్తాయి. ఆటగాడిగా ఎదుగుతున్నా అతని మైండ్‌సెట్‌లో క్రీడాకారులకుండే ఉన్నత లక్షణాలేవీ లేవని భావించేవారు చాలామందే ఉంటాయి. అయితే ఓ వ్యక్తిలో ఏ సమయంలో ఎలాంటి మార్పు వస్తుందో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా పాండ్యా విషయంలోనూ అదే జరిగింది. నిన్నమొన్నటివరకు పాండ్యాను తిట్టని రోహిత్‌ శర్మ అభిమానే లేడు. అయితే ఇప్పుడంతా మారిపోయింది. పాండ్యాపై అనవసరంగా నోరు పారేసుకున్నామని నాడు తిట్టుకున్న రోహిత్‌ ఫ్యాన్సే బాధపడుతున్నారు. పాండ్యా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడనో.. టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌ రావడంతో కీ రోల్‌ ప్లే చేశాడనో రోహిత్‌ ఫ్యాన్స్‌ పశ్చాతాప పడడంలేదు. అతని మెంటల్‌ మెచ్యూరిటీ ఎంతో ఉన్నతంగా మారిపోయిది కాబట్టే ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది..


ఆ ఒక్క నిర్ణయమే..:
ఐపీఎల్‌లో ముంబై, చెన్నై, బెంగళూరు అభిమానులకు ఎమోషన్స్‌ ఎక్కువ. వీరంతా తమ జట్లను తమ కుటుంబంగా భావిస్తారు. ముంబై ఇండియన్స్‌కు ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు అందించిన రోహిత్‌శర్మను అమితంగా ప్రేమిస్తారు. అయితే 2023లో అంబానీ ఫ్రాంచైజీ తీసుకున్న ఓ నిర్ణయం ముంబై కుటుంబంలో పెద్ద చిచ్చే పెట్టింది. 2022, 2023 ఐపీఎల్‌లో గుజరాత్‌కు కెప్టెన్సీ చేసిన హార్దిక్‌పాండ్యాను ముంబై జట్టులోకి ట్రేడ్ చేసుకుంది.


నిర్ణయంపై నిరసనలు:
నిజానికి పాండ్యా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.. ఎదిగింది.. ముందుగా గుర్తింపు పొందింది ముంబై ఇండియన్స్‌ నుంచే. అయితే 2022లో అతను ముంబై జట్టును వీడాడు. ఆ సమయంలో పలుసార్లు ముంబైకి చురకలంటించే విధంగా కామెంట్స్‌ చేశాడు. ముంబై ఇండియన్స్‌ స్టార్స్‌ను కొనుగోలు చేస్తుందని.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్స్‌ను క్రియేట్ చేస్తుందని వ్యాఖ్యానించాడు. ఇది ముంబై అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఏకంగా నాడు కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ పాండ్యా వ్యాఖ్యలను తప్పుబట్టాడు. అందులో అసలు నిజమే లేదని బహిరంగంగా కౌంటర్‌ ఇచ్చాడు. ఇలా పాండ్యా అంటే ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌లో ఓ అవెర్షన్‌ ఉంది. అలాంటి పాండ్యాను గుజరాత్‌ను ట్రేడ్‌ చేసుకోవడమే కాకుండా రోహిత్‌ను పక్కన పెట్టి మరీ అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం పెను దుమారానికి కారణమైంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముంబై ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ముంబై ఇండియన్స్‌ జెర్సీలను తగలబెట్టారు.


లాస్ట్‌ ర్యాంక్‌తో ఫ్లాప్‌ షో:
ఓవైపు అభిమానుల ఆగ్రహావేశాలు కొనసాగుతుండగానే ఇంతలో ఐపీఎల్‌ రానే వచ్చింది. ఐపీఎల్‌ ప్రారంభమైన తర్వాత కూడా పాండ్యాపై ముంబై ఇండియన్స్‌ అభిమానుల్లో వ్యతిరేకత ఆగలేదు. పాండ్యా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో స్టేడియం నుంచి రోహిత్‌ ఫ్యాన్స్ ‘బూ ‘సౌండ్స్‌ చేసేవారు. అటు పలు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌ ఓటమికి పాండ్యా కూడా కారణమయ్యాడు. దీంతో ఫ్యాన్స్‌ కోపం రెట్టింపైంది. అటు జట్టు కూడా రెండుగా విడిపోయిందన్న ప్రచారం జరిగింది. మొత్తానికి 2024 ఐపీఎల్‌లో పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ లాస్ట్‌ స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో పాండ్యా ఎక్కడా కూడా రోహిత్‌ని కానీ.. అతన్ను తిడుతున్న ఫ్యాన్స్‌ను కానీ ఒక్క మాట కూడా అనలేదు.


ఎక్కడా నోరు జారని పాండ్యా:
సొంత జట్టు అభిమానుల నుంచే వ్యతిరేకత వస్తుంటే ఆ బాధనంతా దిగమింగుకున్నాడు పాండ్యా. ఎప్పటికైనా ఫ్యాన్స్‌ ఫ్రాంచైజీ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని సైలెంట్‌గా ఉండిపోయాడు. ఫ్యాన్స్‌ చేసే విమర్శలకైనా, క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చేసే నెగిటివ్‌ కామెంట్స్‌కైనా అతిగా రియాక్ట్‌ అయ్యే ప్లేయర్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. అసలు రియాక్ట్‌ అవ్వాల్సిన అవసరం లేని వాటికి కూడా మీడియా ముందు అతిగా స్పందిస్తుంటారు. ఏదో కౌంటర్ ఇచ్చాం అని వారి ఫీలింగ్‌ కావొచ్చు. అయితే పరిణితి చెందిన ఆటగాళ్లు ఎప్పుడూ ఈ రకంగా వ్యవహరించరు. తమ ఆటతోనే సమాధానం చెప్పాలనుకుంటారు. సందర్భాలే విమర్శకుల నోర్లు మూయిస్తాయని నమ్ముతారు. పాండ్యా కూడా అదే నమ్మాడు. ఒకప్పుడు బ్యాడ్‌ బాయ్‌ ఇమేజ్‌తో నిత్యం వివాదాల్లో నలిగిన పాండ్యా ఇప్పుడు చాలా సైలెంట్‌గా ఉంటున్నాడు. ఎవరేం అన్నా పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకుపోతున్నాడు. తక్కువ మాట్లాడడం, ఎక్కువ పనిచేయడం అతని లైఫ్‌స్టైల్‌లో భాగంగా మారిపోయింది. ఇదంతా కేవలం ఈ రెండు-మూడు నెలల్లోనే జరిగింది.


‘సారీ’ ‘సారీ’:
ఓవైపు పర్శనల్‌ లైఫ్‌లోనూ పాండ్యా ఇటివలీ అనేక ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి విషయాల్లోనూ పాండ్యా ఎక్కడా కూడా నోరుజారలేదు. గతంలో పాండ్యా మాటలు అహంకారంగా ఉండేవి.. తానేదో ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్‌ అన్నట్టు అతని తీరు కనిపించేది. అయితే ఇప్పుడు పాండ్యా వేరు.. అతని ఆలోచనా తీరే మారిపోయింది. ఓ ఆటగాడు ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు.. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడు.. సైలెన్స్‌నే ఆయుధంగా చేసుకోని పనిలో మాత్రం కసిగా చెలరేగుతున్నాడు. అతని ధ్యాసంతా ఆటపైనే కనిపిస్తోంది. అందుకే టీ20 వరల్డ్‌కప్‌లో మనసు పెట్టి ఆడాడు పాండ్యా. జట్టు గెలుపు కోసం చేయాల్సిందంతా చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఆఖరి ఓవర్‌లో సౌతాఫ్రికాను నిలువరించిన పాండ్యా మ్యాచ్‌ గెలిచిన వెంటనే ఏడ్చేశాడు. అందరూ ఆనందంతో మునిగిపోయిన సమయంలో పాండ్యా గ్రౌండ్‌పై కుర్చొని సైలెంట్‌గా ఉండిపోయి కన్నీరు కార్చాడు. ఆ సమయంలో పాండ్యా కంటి నుంచి జారిన ప్రతీ కన్నీటి చుక్క వెనుక అంతులేని వేదన ఉంది. గ్రౌండ్‌లో జరిగే ప్రతీ విషయాన్ని, ఆటగాళ్ల భావోద్వేగాన్ని అర్థం చేసుకునే అభిమానులు పాండ్యాలో వచ్చిన ఈ మార్పులను కూడా గమనించారు.. అందుకే తిట్టిన నోర్లతోనే పాండ్యాకు సారీ చెబుతున్నారు..

ముద్దుతో ఆరిపోయిన మంటలు
అటు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ ఎపిసోడ్‌లో రోహిత్‌ మొదటి నుంచి ఎక్కడా నోరు జారలేదు. ఎందుకంటే అలకలు, మనస్పర్ధలు సర్వసాధారణమేనని రోహిత్‌కు తెలుసు. ఆవేశంలో మాట్లాడకూడదనీ తెలుసు.. ఏ సమస్యకైనా సమయమే పరిష్కారం చూపుతుందనీ తెలుసు.. అందుకే మౌనమే ఆయుధంగా రోహిత్‌ నడుచుకున్నాడు. ఇటు ఇదే మౌనమే అస్త్రంగా పాండ్యా బాధలు భరించాడు. చివరకు ఇద్దరు తాము అనుకున్నది చేశారు. ట్రోఫి గెలిచిన తర్వాత ఎమోషనల్‌గా ఉన్న పాండ్యాకు రోహిత్‌ పెట్టిన ముద్దుతో అందరి అనుమానాలు పటాపంచాలయ్యాయి. క్రికెట్‌కు ఉన్న గొప్ప గుణమే ఇది. ఆటగాళ్లకుండే ఉన్నత లక్షణాలే ఇవి. ఇప్పుడు ఏ రోహిత్‌ అభిమాని కూడా పాండ్యాను పల్లెత్తు మాట అనలేడు.. తమ జట్టు(ముంబై ఇండియన్స్‌)లో అంతర్గతంగా రేగిన చిచ్చును రోహిత్‌ ఒక ముద్దుతో ఆర్పేశాడు..!

Also Read: ఓవైపు అగ్రరాజ్యాల దురహంకారం.. మరోవైపు మత ఛాందసం.. ఈ రెండిటి మధ్య అఫ్ఘాన్‌ క్రికెట్‌ ఎలా ఎదిగింది?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *