Menu

Imran Khan: థ్రిల్లింగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను తలపిస్తోన్న ఇమ్రాన్‌ లైఫ్‌.. వరల్డ్‌ కప్‌ నుంచి జైలు శిక్ష వరకు..

Praja Dhwani Desk 1 year ago
Pakistan’s former PM Imran Khan convicted again, sentenced for 14 years in jail

క్రికెట్‌ ఆడుతున్న రోజుల్లో బౌన్సర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించిన పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్(Imran Khan) రాజకీయంగా మాత్రం బంతులు విసిరేందుకు కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు. అటు బ్యాటింగ్‌లోనైనా రాణించి జట్టును గెలిపిద్దామనుకుంటే ఇటు అంపైర్లు ఏమో ఆయన క్రీజులోకి రాగానే LBWగా పెవిలియన్‌కు పంపాలని చూస్తున్నారు. అయితే ఇది అప్పటి కాలం కాదు. క్రికెట్‌లో డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌-DRS ఉన్నట్టే ఇమ్రాన్‌ఖాన్‌కు తనకు విధించిన శిక్షల తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూను కోరే అవకాశం ఉంది. ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన భార్య బుష్రా బీబిపై అల్-ఖాదిర్ ట్రస్ట్ ద్వారా భూమిని లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బుష్రా బీబి(Bushra Bibi)కి ఏడేళ్ల జైలు శిక్ష పడింది.

తగ్గని క్రేజ్.. మళ్లీ గెలుస్తారా?

ఇమ్రాన్‌ఖాన్‌పై ఇప్పటికే 100కు పైగా కేసులు ఉన్నాయి. దేశానికి వచ్చిన బహుమతులను ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ విక్రయించాడన్నది అందులో ప్రధానమైన కేసు. ఈ కేసులో ఆయనకు మూడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే తర్వాత రివ్యూకు వెళ్లగా.. ఆ తీర్పు సస్పెండ్ అయ్యింది. ఇప్పుడు అల్‌-ఖాదిర్‌ ట్రస్ట్‌ కేసులోనూ ఆయన రివ్యూకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నప్పటికీ, ఆయన ప్రభావం మాత్రం పాకిస్థాన్‌ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన పార్టీ, పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ -PTI ఇటీవల ఎన్నికల్లో ఎక్కువ సీట్లను కొల్లగొట్టింది. జైల్లోనే జీవితాన్ని గడుపుతున్నా ఆయన మద్దతుదారులు మాత్రం ఇంకా ఇమ్రాన్‌ వెనుకే ఉంటున్నారు. ఇమ్రాన్‌కు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని ఎన్నికల ఫలితాలతో పాటు PTI నిర్వహిస్తున్న నిరసనలకు తరలివస్తున్న ప్రజలను చూస్తే అర్థం చేసుకోవచ్చు.

గూస్‌బంప్స్‌ స్పీచ్‌

నిజానికి ఇమ్రాన్‌కు కష్టాలు, నష్టాలు,తప్పులు, తిప్పలు కొత్త కాదు. ఆయన జీవితమే ఓ వివాదాల పుట్ట! మద్యం, డ్రగ్స్‌తో పాటు కొందరి మహిళలతో శారీరక సంబంధాలు ఆయన జీవితంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. 1980దశకంలో లండన్‌ ఉన్న సమయంలో ఇమ్రాన్‌ డ్రగ్స్‌ వాడినట్టుగా అప్పట్లో బ్రిటిష్‌ పత్రికలు ప్రచురించిన కథనాలు సంచలనం రేపాయి. ఈ వార్తలు నిజమేనని ఇమ్రాన్‌ కూడా అంగీకరించారు. దీంతో అతడి క్రికెట్ కెరీర్‌ కూడా ప్రశ్నార్థకంగా మారిన రోజులు ఉండేవి. అయితే డ్ర*eగ్స్ అలవాటును వదిలి తిరిగి క్రికెట్‌పై పూర్తిగా ఫోకస్‌ చేసిన ఇమ్రాన్‌ తక్కువ కాలంలోనే సక్సెస్ సాధించాడు. 1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా కప్‌ తీసుకురావడం ఆయన కెరీర్‌లో చెరిగిపోని, క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మర్చిపోని జ్ఞాపకంగా చెప్పవచ్చు. నిజానికి ఆ వరల్డ్‌కప్‌ ఆరంభ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ జట్టు ఘోరంగా ఆడింది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా ఓడిపోయింది. ఇంగ్లండ్‌పై గ్రూప్‌ మ్యాచ్‌లో 74 పరుగులకే పాక్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. సాధారణంగా టోర్నీని ఇన్ని పరాజయాలతో ప్రారంభించిన జట్టు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. అయితే అక్కడ నుంచి సీన్‌ మొత్తం మారిపోయింది. కెప్టెన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ఇచ్చిన ‘కార్నర్‌ టైగర్‌ స్పీచ్‌’ తమ మైండ్‌ సెట్‌ను పూర్తిగా మార్చేసిందని చెబుతారు నాటి పాక్ ప్లేయర్లు. పులిలా గ్రౌండ్‌లో దూకాలని.. ఓడినా, గెలిచినా పులిలా పోరాడి, వేటాడితే నష్టమేమీ లేదని ఇమ్రాన్‌ తన ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఆ స్పీచ్‌ తర్వాత మ్యాచ్‌ నుంచి పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఎంతో దూకుడుగా గ్రౌండ్‌లో కనిపించారు. రెట్టించిన ఉత్సాహంతో రాణించారు. మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓటములను ఎదుర్కొన్న పాక్‌ జట్టు ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి తొలిసారిగా ట్రోఫీని ముద్దాడింది. ఇంగ్లండ్‌పై ఫైనల్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ 72 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

అభిమానులే కొండంత అండ

క్రికెట్‌లో ఇంత సక్సెస్‌ సాధించిన ఇమ్రాన్‌ ఇటు రాజకీయాల్లో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. 1996లో PTI పార్టీని స్థాపించిన ఇమ్రాన్‌ పొలిటికల్‌ జర్నీ జిడ్డు బ్యాటింగ్‌తో మొదలైందనే చెప్పాలి. టెస్టు బ్యాటర్‌ తరహాలో స్లో అండ్‌ స్టడీగా రాజకీయ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లిన ఇమ్రాన్‌ చివరకు 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. క్రికెట్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను క్లీన్‌ బౌల్డ్ చేసినట్టే రాజకీయ ప్రత్యర్థులను కూడా ఇంటికి సాగనంపారు. అయితే ఆర్మీ పాలనలో మగ్గే పాకిస్థాన్‌ను పాలించడం అంత సులభమేమీ కాదు. పిచ్‌పై పగుళ్లు ఎక్కువ ఉంటే బ్యాటర్లకు బంతులు ఎదుర్కొవడం ఎంత కష్టంగా ఉంటుందో ఇమ్రాన్‌కు పాక్‌ ప్రధానిగా విధులు నిర్వహించడం అంతేకష్టంగా ఉండేది. అవినీతి, పేదరిక నిర్మూలన.. పాకిస్తాన్‌ను ఆర్థికంగా స్థిరం చేస్తానని అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ మిలటరీతో విభేదాల కారణంగా కిందకు దిగజారుతూ వచ్చారు. అదే సమయంలో పాకిస్థాన్‌ను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభాలు ఆయన రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. చివరకు 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవిని కోల్పోయారు ఇమ్రాన్‌. అప్పటినుంచి ఇమ్రాన్‌ అనేక కేసులను ఎదుర్కొంటూ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఇదంతా గమనిస్తే ఇమ్రాన్ ఖాన్ జీవితం క్రికెట్ మ్యాచ్‌లానే అనిపించక మానదు. ఆయన కొన్ని సార్లు భారీ షాట్లు కొట్టారు, కొన్ని సార్లు బౌన్సర్లకు బోల్తా పడ్డారు. మొత్తానికి పాక్‌కు ప్రపంచకప్ గెలిపించిన హీరో, ఇప్పుడు రాజకీయ పిచ్‌పై చతికిలపడ్డారని చెప్పవచ్చు. అయినా ఇమ్రాన్‌ మద్దతుదారులు మాత్రం స్టేడియం గ్యాలరీ నుంచి ఇంకా ‘ఇమ్రాన్ ఇమ్రాన్‌’ అని నినాదాలు చేస్తూ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు.

ఇది కూడా చదవండి: వెన్నుపోటుకు తక్కువ కాదు.. కటప్పను మించిపోయిన ట్రంప్‌!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *