ఒక సాధారణ మహిళ..కుటుంబంతో చాలా సంతోషంగా ఉంది..ఒక రోజు ఆమె ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వెళ్లారు ..డాక్టర్ చెప్పిన విషయానికి ఆమె ప్రపంచాన్ని తలకింపజేస్తుంది.కుటుంబాన్ని విషాదాల్లో ముంచుతుంది. ఇది కేవలం ఆమె కథ కాదు ఇండియాలో ప్రతి రోజూ లక్షలాది మంది మహిళలు ఎదుర్కొంటున్న భయం. చిన్న ఆరోగ్య సమస్య అని వెళ్తే గుండె పగిలే విషయాలను వింటున్నాము..ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలీకుండా అయిపోయింది..మహిళలను భయపెట్టే మహమ్మారి ఏంటి? కానీ ఇది ఎందుకు జరుగుతుంది? దీన్ని ఎలా ఆపుకోవచ్చు? ఒక చిన్న టీకా మాత్రమే ఈ మహమ్మారిని ఆపేయగలదా? ఆ టీకా ఏంటి? ఇప్పుడు చూద్దాం.!
HPV అంటే?
హ్యూమన్ పాపిలోమా వైరస్(HPV) అనేది సాధారణ వైరస్ల కుటుంబం. ఇది చర్మంపై మొటిమలు కలిగించే వైరస్లలో ఒకటి. చాలా HPV రకాలు నిష్క్రియంగా ఉంటాయి కానీ కొన్ని అధిక ప్రమాదకరమైన రకాలు సమస్యలు సృష్టిస్తాయి. ఇవి సెర్వికల్, యానస్, పెనిస్, వల్వా, వాగినా, గొంతు క్యాన్సర్లకు కారణమవుతాయి. మరి కొన్ని అనోజెనిటల్ వార్ట్స్ను కలిగిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సెర్వికల్ క్యాన్సర్ మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రతి సంవత్సరం 3 లక్షలకు పైగా మరణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదాయం తక్కువగా, మధ్యస్థ దేశాల్లో.ఇండియాలో ఇది మహిళల్లో రెండో అత్యంత సాధారణ క్యాన్సర్. HPV 16, 18 రకాలు దాదాపు 77 శాతం సెర్వికల్ క్యాన్సర్లకు కారణం. ఇక్కడే HPV వ్యాక్సిన్ హీరోగా వస్తుంది. ఈ వ్యాక్సిన్ ఈ వైరస్‌లను ఆపి క్యాన్సర్‌ను ముందుగా నివారిస్తుంది.
వ్యాక్సిన్ పనిచేస్తుందా?
మరోవైపు యూకే ప్రభుత్వం మద్దతుగల NIHR ద్వారా రెండు పెద్ద కోక్రేన్ రివ్యూలు వచ్చాయి. మొదటి రివ్యూ 60 రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్‌ను పరిశీలించింది. ఇందులో 1.57 లక్షల మంది పాల్గొన్నారు. ఫలితాలు అన్ని HPV వ్యాక్సిన్లు క్యాన్సర్‌కు దారితీసే ఇన్ఫెక్షన్లను, ఇతర HPV సంబంధిత సమస్యలను నివారిస్తాయని తేలింది. సెర్వారిక్స్, గార్డాసిల్, గార్డాసిల్-9 వంటి వ్యాక్సిన్లు 15 నుంచి 25 సంవత్సరాల వయస్సులో ఉన్నవారిలో ప్రీ-క్యాన్సరస్ మార్పులను తగ్గించాయి. అనోజెనిటల్ వార్ట్స్ ప్రమాదాన్ని కూడా తగ్గించాయి. ట్రీట్మెంట్ అవసరాన్ని పెద్దగా తగ్గించాయి. భద్రత పరంగా, తీవ్రమైన సమస్యలు లేవు. ఇంజెక్షన్ స్థలంలో స్వల్ప బాధ, వాపు వంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో, తీసుకోని వారిలో ఇవి సమానంగా ఉన్నాయి. క్యాన్సర్ అభివృద్ధికి సంవత్సరాలు పడుతుంది కాబట్టి ట్రయల్స్ పూర్తి చిత్రం చూపలేవు. కానీ వైరస్ ఇన్ఫెక్షన్లను ఆపడంలో వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తుందని నిర్ధారణ.
రివ్యూలు ఏం చెబుతున్నాయ్?
ఇక రెండో రివ్యూ మరింత ఆసక్తికరం. 225 అధ్యయనాలు, 13.2 కోట్ల మంది పైగా పాల్గొన్నారు. వివిధ దేశాల్లో HPV వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ల తర్వాత సెర్వికల్ క్యాన్సర్, ప్రీ-క్యాన్సరస్ మార్పులు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా 16 సంవత్సరాల వయస్సులో లేదా అంతకు ముందు వ్యాక్సిన్ తీసుకున్న అమ్మాయిలు వ్యాక్సిన్ తీసుకోని వారి కంటే 80 శాతం తక్కువ ప్రమాదంలో ఉన్నారు. CIN2+, CIN3+ వంటి ప్రీ-క్యాన్సరస్ కండిషన్స్, అనోజెనిటల్ వార్ట్స్లో పెద్దగా పడిపోయాయి. తీవ్రమైన అడ్వర్స్ ఈవెంట్స్‌కు వ్యాక్సిన్‌తో ఎలాంటి లింక్ లేదు. సోషల్ మీడియాలో చర్చించే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌పై కూడా ఆధారాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ సెర్వికల్ క్యాన్సర్‌ను నివారిస్తుందని స్పష్టంగా తేలింది. ఇది మాత్రమే కాదు భవిష్యత్ క్యాన్సర్లపై కూడా ప్రభావం చూపుతుంది.
మరోవైపు ఇండియాలో ఈ వ్యాక్సిన్ మరింత ముఖ్యం. సెర్వికల్ క్యాన్సర్‌తో ప్రతి సంవత్సరం లక్షలాది మహిళలు పోరాడుతున్నారు. ప్రభుత్వం HPV వ్యాక్సినేషన్‌ను పెంచడానికి కృషి చేస్తోంది. మన దేశంలో తయారైన మొదటి HPV వ్యాక్సిన్ సెర్వావాక్. ఇది క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్, HPV 16, 18తో పాటు 6, 11 రకాలను కవర్ చేస్తుంది. ధర డోజ్‌కు 2 వేల నుండి 4 వేల రూపాయల మధ్య ఉంది. ఇది ముఖ్యంగా 9 నుండి 25 సంవత్సరాల వయస్సులో ఇవ్వాలి. అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది క్యాన్సర్‌ను మాత్రమే కాకుండా వార్ట్స్ వంటి సమస్యలను కూడా ఆపుతుంది. ఇండియాలో 90 శాతం HPV వ్యాక్సినేషన్ లక్ష్యంగా పెట్టుకుని క్యాన్సర్ మరణాలను 7 లక్షలకు పైగా తగ్గించవచ్చు.
ఇక ఈ పరిశోధనలు HPV వ్యాక్సిన్ సురక్షితమైనది అత్యంత ప్రభావవంతమైనదని నిర్ధారిస్తున్నాయి. త్వరగా 16 సంవత్సరాల ముందు వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ఆదాయం తక్కువ దేశాల్లో మరిన్ని అధ్యయనాలు అవసరం ఎందుకంటే అక్కడ క్యాన్సర్ ఎక్కువ. దీర్ఘకాలిక డేటా కూడా సహాయపడుతుంది.సెర్వికల్ క్యాన్సర్‌ను ఆపడం మన చేతుల్లో ఉంది. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా అర్హత కలిగినవారైతే డాక్టర్‌ను సంప్రదించండి. వ్యాక్సిన్ తీసుకోండి, జీవితాలు కాపాడండి.
ALSO READ: బంగాళాఖాతంలో మరో తుఫాను? ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు తప్పదా?

ICMR CANCER SHOCK: ప్రతి ఐదుగురులో ముగ్గురు.. ఇండియాను చంపేస్తున్న మహమ్మారి!
Alcohol-Cancer: మందుబాబులకు సైంటిస్టులు దిమ్మదిరిగే షాక్.. ఓ పెగ్గు మీ జీవితాన్ని చంపేస్తుంది!
Poonam Pandey: యావత్ దేశాన్ని ఫూల్ చేసిన పూనమ్‌కు ఆ సమస్య ఉందా? ఆమె ఎందుకిలా చేస్తుంది?