Menu

HCU Land Issue: సుప్రీం చేతిలో రేవంత్‌కు చివాట్లు! అసలు లొల్లి పర్యావరణం కోసమా? ఈ వివాదం వెనక పూర్తి చరిత్ర ఏంటి?

Sumanth Thummala 10 months ago
HCU vs revanth reddy

అర్ధరాత్రిల్లు బుల్లోజర్లు రావడం, అడవి జంతువులు ఉన్న ప్రదేశాలను చదును చేస్తుండగా నెమళ్ళు, ఇతర పక్షులు అరణ్య రోదనతో అరవటం.. అడ్డుకోవాలని ప్రయత్నించిన విద్యార్థులను లాఠీచార్జ్ చేయడం.. అరెస్టు చేయటం. ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిధిలోని ప్రాంతంలో జరిగిన సంఘటనలు. 

దీనిపై తెలంగాణ హైకోర్టు స్టే విధించగా తాజాగా అది సుప్రీం కోర్టు పరిధిలోకి వెళ్ళింది.

సుప్రీం కోర్ట్ గరం:

Image Credits: Live Law from instagram

కంచ గచ్చిబౌలి లోని హెచ్‌సీయూ సమీపంలో ఉన్న భూముల్లో 400ఎకరాల్లో జరుగుతున్న చెట్ల తొలగింపులపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. దేశవ్యాప్తంగా చర్చనీయంశమైన ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటో గా స్వీకరించి విచారణ చేపట్టింది. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో చెట్లు నరకడం, జంతువులను హింసిస్తూ పర్యావరణానికి నష్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది జస్టిస్ బీ.ఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం.

“చట్టాన్ని మీ చేతిలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అవసరమైతే సీఎస్ పై చర్యలు తీసుకుంటాం. అంతా అత్యవసరంగా చెట్లు ఎందుకు నరికారు? సిఎస్,జిహెచ్ఎంసి కమిషనర్ ఏం చేస్తున్నారు? “అని ప్రశ్నించింది. ఈనెల 16 కల్లా సీఈసీ (సెంట్రల్ ఎంపవరింగ్ కమిటీ) నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈలోపు ఆదేశాలు ఉల్లంఘిస్తే చీఫ్ సెక్రటరీ బాధ్యులు అవుతారని హెచ్చరించింది.

దీనిపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, విపక్ష పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ భూ వివాదం పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.‌ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కమిటీలో ఉంటారు. వీరు హెచ్‌సీయూ ఎక్సిక్యూటివ్ కమిటీ, జేఏసీ లు ప్రజాసంఘాలు, విద్యార్థులు ఇతరులతో చర్చించి, ఈ సమస్యకి పరిష్కారం చూపేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుందని సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.‌

 

అభివృద్ధా? ఆందోళనా? ఏది ముఖ్యం!

telangana industrial infrastructure corporation ltd.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ (TGIIC) ఆధ్వర్యంలో ఆ భూమిని వేలం వేసి ప్రభుత్వానికి ఆదాయం తో పాటు ఆ ప్రాంతంలో ఐ.టి – ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రభుత్వం భావించింది.‌ కంచె గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఈ భూములు చాలా విలువైనవి.‌ ఈ 400 ఎకరాల భూమి విలువ ₹20,000 కోట్ల పైమాటే. ఇందుకే సొమ్ము చేసుకొవాలని చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం.

cm revanth reddy

 

అయితే దీనిపై హెచ్‌సీయూ లోని విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాల విద్యార్థులు, పర్యావరణవేత్తలు, పార్టీలు ప్రజాసంఘాల నాయకులు ఈ భూమిని కాపాడాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 29న 40 కి పైగా బుల్డోజర్లను పంపి ఆ భూమిని చదును చేస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు నిరసనను ఉదృతం చేశారు. మార్చి 30న 52 మంది విద్యార్థులను పోలీసుల అరెస్టు చేశారు. తర్వాత రోజు యూనివర్సిటీతో సంబంధం ఇద్దరు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారని అధికారులు ఆరోపించారు. అయితే వారిద్దరూ యూనివర్సిటీ విద్యార్థులే అని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.

ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఇది తమ భూమి అని, ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్లే భూమిని కాపాడి రాష్ట్ర అభివృద్ధికి వాడుతున్నాం అని ప్రకటించింది.‌ మరి ఈ 400 ఎకరాలను అభివృద్ధికి వాడాలా? పరిరక్షించాలా?

అసలు యూనివర్సిటీ భూముల చరిత్ర ఏంటి?

1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల నిరసనలతో అట్టుడికాయి. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం 6 పాయింట్స్ ఫార్ములాని ప్రవేశపెట్టింది. అందులో 2వ పాయింట్ లో సెంట్రల్ యూనివర్సిటీ ని స్థాపించాలని ఆదేశించింది.1974 లో పార్లమెంట్లో చట్టం చేసి (యాక్ట్ నెం.39 ఆఫ్ 1974) ఈ యూనివర్సిటీని స్థాపించారు.

hcu gazette notification in parliament in 1974

1975లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హయాంలో సెంట్రల్ యూనివర్సిటీకి 2,324 ఎకరాల భూమిని కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు కేటాయించింది. ఆ తర్వాత నుంచి ఇది ఒక ప్రఖ్యాత యూనివర్సిటీ గా రూపుదిద్దుకుంది.

_కాకపోతే ఇక్కడ అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే ఆ భూములను యూనివర్సిటీ పేరు మీద కాకుండా ప్రభుత్వ పేరు మీదుగా ఉంచటం.‌ దానివల్ల ఆ భూముల పైన ప్రభుత్వానికే హక్కులు ఏర్పడ్డాయి._

university of hyderabad

 

అయితే ప్రభుత్వం వాటి అవసరాల కోసం యూనివర్సిటీ నుండి భూములు తీసుకోవడం మొదలయ్యింది.‌1987లో మొదటిసారి ఈ భూ కేటాయింపులు జరిగాయి. అప్పటినుండి కొన్ని వందల ఎకరాలు ప్రభుత్వం వాటి అవసరాల కోసం తీసుకుంటూనే వచ్చింది. అయితే చట్టం ప్రకారం విద్యా ప్రయోజనాల కోసమే తీసుకోవాలి. పలు దఫాల్లో రీసెర్చ్ సంస్థలు, నవోదయ స్కూల్ తో పాటు క్రీడా అవసరాల కోసం భూమి తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ప్రభుత్వ భవనాలు – ఆర్టీసీ డిపో వంటి వాటి కోసం కూడా ఈ భూమిలే వాడుకున్నారు.

అలా 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు స్పోర్ట్స్ ఫెసిలిటీ అభివృద్ధి కోసం ఐఎంజీ(IMG) భారత అనే ప్రైవేట్ కంపెనీకి కంచ గచ్చిబౌలిలోని సర్వే నెం‌. 25 లో 400 ఎకరాలు కేటాయించింది.‌ అయితే సమయానికి ప్రాజెక్టును మొదలు పెట్టకపోవడం తో తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 21, 2006 న తిరిగి ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2007 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (సంరక్షణ, రక్షణ మరియు పునరుద్ధరణ) చట్టాన్ని రూపొందించింది. దాంతో IMG సంస్థ కోర్టుకు ఎక్కింది. హైకోర్ట్, సుప్రీంకోర్టు లో కేసు నడిచినా చివరకు 21ఏళ్ళ తర్వాత 2024లో తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది.

2024 జూన్ 24న టీజీఐఐసీ ప్రతిపాదన మేరకు 400 ఎకరాల భూమిని ఆ కార్పొరేషన్ కు బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిని ఐటి పరిశ్రమ అభివృద్ధి కోసం అలానే ఇతర ఆర్థిక అభివృద్ధి కోసం ఈ భూమిని వేలంలో కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా ఆ 400 ఎకరాలను చదును చేసి పనిని వేగవంతం చేయాలని 40 కి పైగా బుల్డోజర్లతో పోలీస్ ప్రొటెక్షన్ తో అధికారులు పనులు మొదలుపెట్టారు.

దీనిపైనే విద్యార్థులు, యూనివర్సిటీ సంబంధిత అధికారులు, ప్రొఫెసర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాను ఎంత చెబుతున్నా వాళ్లకు నచ్చిందే చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. యూనివర్సిటీ లోపల,బయట వివిధ రకాల ధర్నాలు,ఆందోళనలు చేస్తున్న ప్రజలను లాఠీ చార్జీ చేస్తూ నిరసనను తొక్కేస్తున్నారు. కనీసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఈ పనిని పూనుకున్నారు.

దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఇతర మంత్రులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు.

మార్చి 25న అసెంబ్లీ సెషన్ లో సీఎం అక్కడ చేస్తున్న ఆందోళన పై విమర్శ చేశారు. ఆ భూముల్లో ఏ జింకలు సింహాలు,పులులు లేవని.. కొన్ని గుంట నక్కలు ఉన్నాయని అన్నారు. అది ప్రభుత్వ భూమి దాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమే వాడుతున్నామని సంజాయిషీ ఇచ్చుకున్నారు.

అక్కడితో ఆగక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమి అని, కొందరు వ్యక్తులు పార్టీలు విద్యార్థులను రెచ్చగొట్టి ఈ ఆందోళన చేయిస్తున్నారని విమర్శించారు. పైగా “తాము ఈ భూములను ప్రైవేటు వ్యక్తుల నుంచి రక్షించి అభివృద్ధి కోసం వాడుతున్నాము, మేము చేస్తున్న మంచిని గుర్తించకుండా ఇలా మాటలు అనటం సరికాదు” అని అన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు “ఇంచు భూమి కూడా హెచ్‌సీయూ నుండి ప్రభుత్వం తీసుకోలేదని, 20 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో చెట్లు పెరిగితే అడవి అయిపోద్దా?” అని ప్రశ్నించారు.

” ఇక్కడ భూమి తీసుకున్నందుకు వారికి వేరే చోట భూమిని కేటాయించామని” తెలియజేశారు.

 యూనివర్సిటీ కౌంటర్:

HCU letter to government of telangana

యూనివర్సిటీ మార్చి 31న,ఒక ప్రెస్ నోటును విడుదల చేసింది. అందులో 2024లో ఈ భూమికి సంబంధించిన ఎలాంటి సర్వే జరగలేదని, తనకు దానిపై ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా తమతో ఎలాంటి భూవిభజన విషయంపై చర్చ జరగలేదని పేర్కొంది. అంతేకాదు, యూనివర్సిటీ భూముల అప్పగింపు కోసం విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఏమైనా భూమి మార్పిడి జరగాలంటే యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి అవసరమని స్పష్టం చేసింది.

జీవవైవిధ్యం నిలుపుతున్న ప్రాంతం: 

hcu overview

📸: Gokul Kamal
@HydUniv

విద్యార్థులు,శాస్త్రవేత్తలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు చెప్పేది ఏంటంటే;

ఈ భూముల్లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం (1972) ప్రకారం రక్షించాల్సిన జింకలు, దుప్పులు,అడవి పందులు, కోతులు,కొండముచ్చులు, కుందేళ్ళు, ముళ్ళ పందులు, కొండచిలువలు,నాగుపాములు,రక్తపింజర తాబేళ్లు,ఉడుములు, ఇతర సరిసృపాలతో పాటు,

మన జాతీయ పక్షి అయిన నెమళ్ళు, తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ‌ పాలపిట్టలు, పిచ్చుకలు, గుడ్లగూబ,గద్దలు, బుల్బుల్, కింగ్ ఫిషర్ వంటి లోకల్ పక్షులతో పాటు..కామన్ టీల్,గ్రే వాగ్ టైల్,బార్న్ స్వాలో వంటి సీజనల్ విదేశీ పక్షులు కలిపి 200 పైగా పక్షి జాతులు ఉంటాయి‌.

వీటికి ఆవాసం ఇస్తున్న చెట్లు, పీకాక్ లేక్, బఫెల్లో లేక్‌ వంటి సరస్సులు.. బంగాలి ఫిషింగ్ పాండ్, ఫ్రాగ్ పాండ్ లాంటి చిన్న కొలనులు అక్కడ ఉన్నాయి.

 

చట్టం ఏం చెప్తుంది:

 

1996 T N గోదావర్మన్ తిరుముల్పాద్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు ప్రకారం, ఏ భూమిపైనా అటవీ (forest cover) ఉంటే, అది చట్టపరంగా ‘అటవీ భూమి’గా పరిగణించాలి. అది అధికారికంగా అటవీ భూమిగా నోటిఫై చేయబడకపోయినా, అటవీ అనే పదాన్ని భౌగోళిక మరియు పర్యావరణ పరంగా అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరి ఇంత జీవవైవిధ్యం వీరికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ కనబడలేదా? కేబీఆర్ పార్క్ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇక్కడ చెట్లు ఉంటాయి.వాటిని తొలగిస్తే నగర ప్రజలకు కూడా ఎంతో నష్టం కాదా!

ప్రభుత్వ ద్వంద్వ వైఖరి:

ఇటువంటి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 24% ఉన్న అటవీని 33% పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యాన్ని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓ సభలో కాలుష్యం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, దాని నుండి బయటపడి సుస్థిరమైన నగరాన్ని నిర్మించుకోవాలి అని అన్నారు. ఇటీవలే పర్యావరణ దినోత్సవం నాడు ఆ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.

మరి అన్ని వందల ఎకరాల్లో ప్రకృతిని నాశనం చేస్తూ ఈ మాటలు ఎందుకు?

ప్రజాపాలన అంటూ అధికారం చేపట్టి, ఇవాళ అదే ప్రజలను లాఠీ చార్జీ చెస్తున్నారు. బుల్డోజర్ పాలిటిక్స్ కు వ్యతిరేకం అంటూనే అవే బుల్డోజర్లతో పచ్చదనాన్ని పెకలించి వేస్తున్నారు.

భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనదే: 

ఫ్యూచర్ సిటీ – ఫోర్త్ సిటీ అంటూ రేవంత్ సర్కార్ గొప్పలు పోతూ ప్రస్తుతానికి, భవిష్యత్తుకు ఆధారమయ్యే చెట్లను కూల్చేస్తున్నారు. ఇప్పుడు సమస్య ఆ భూములు ప్రభుత్వం పేరు మీద ఉన్నాయా యూనివర్సిటీ పేరు మీద ఉన్నాయా అనేది కాదు. ఈ భూముల్లో ఉన్న పచ్చదనాన్ని పర్యావరణాన్ని కాపాడుకొని ముందుకు ఎలా వెళ్లాలి అనేది చూడాలి.

దక్షిణ భారతంలో హైదరాబాద్ సిటీనే 2వ అత్యంత కాలుష్యపరమైన సిటీగా ప్రకటించారు. గత సంవత్సరం నగరంలో అత్యంత కాలుష్యం నమోదైంది.

 

ఇప్పటికే ఎన్నో ఉన్న ఎన్నో చెరువులు పచ్చదనాన్ని హైదరాబాద్ మహానగరంలో మాయం చేశారు. దాని ఫలితాలు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఉష్ణోగ్రతలు పెరగటం, కాలుష్యం విపరీతంగా ఉండటం, ముఖ్యంగా వర్షాలకు రోడ్లు చెరువులవటం.. ఇవన్నీ నగరవాసులకు నిత్య కృత్యం.

హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయికి ఎదగాలన్నా, ఇక్కడ ఉన్న జనాలు ఆరోగ్యంగా ఉండాలి అన్నా.. ఇటువంటి భారీ లంగ్ ప్లేసెస్ ను తప్పనిసరిగా కాపాడుకోవాలి. లేదంటే ఢిల్లీకి పట్టిన గతే మనకు పట్టడానికి ఎంత దూరంలో లేము.‌


Written By

Sumanth Thummala is aContent Writer and the co-founder of Prajadhwani news. He works passionately toward creating positive change in the world through meaningful, responsible writing.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *