గ్వాలియర్ జిల్లా తాటిపూర్ పోలిస్టేషన్ పరిధిలో జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఈ కథ రాశాను.
మనకు అమ్మంటే ప్రేమను పంచే ఒక ప్రేమ మూర్తిలా తెలుసు. నడకలు నేర్చిన సమయంలో ఎక్కడ తప్పటడుగు వేస్తామో అనే భయంతో మన చేయి పట్టుకుని సరైన దారిలో నడిపించేది అమ్మ. మన మొదటి మాట, మొదటి అడుగు, మొదటి కన్నీరు… అన్నిటికీ సాక్షి అమ్మే. ఆమె ఒడిలో ఉంటే ప్రపంచమే సురక్షితంగా అనిపిస్తుంది.
అమ్మంటే త్యాగం, అమ్మంటే మమకారం, అమ్మంటే నిస్వార్థమైన ప్రేమ. కానీ…అలాంటి అమ్మే ఒక రోజు తన కడుపున పుట్టిన బిడ్డకే మృత్యువై మారితే? ప్రేమ స్థానంలో భయం, మమకారం స్థానంలో పాపం నిలిస్తే? ఇది ఒక వార్త కాదు…ఇది ఒక తల్లి తప్పిదం వల్ల ఒక చిన్నారి జీవితం ఎలా ఆగిపోయిందో చెప్పే హృదయ విదారక కథ…!
ఒక సాయంత్రం…ఐదేళ్ల సన్నీ మెట్లెక్కుతూ పైకప్పు వైపు వెళ్తాడు. అమ్మను పిలవాలని,
ఆమె ఒడిలో కూర్చోవాలని…ఆ చిన్న మనసులో ఒకటే ఆశ. కానీ అక్కడ చూసిన దృశ్యం…ఆ చిన్ని మనసుకు ఏమి అర్ధం కాని పరిస్థితే..అమ్మ… తన తన పక్కన నాన్న కాదు..ఇంకెవరో అభ్యంతరకర స్థితిలో ఉన్నా కూడా అర్ధం చేసుకోలేని పసితనం. ఆ చిన్నారి ఆ దృశ్యం చూడటమే మహా పాపంగా అయిపోయింది..
ఆ తల్లి గుండెల్లో తుఫాను రేపింది. ఆ దృశ్యం ఆ చిన్నవాడు ఎవరికైనా చెప్పేస్తే ఎలా అనే ఆలోచన… ఆ క్షణంలో..అమ్మ ప్రేమ కంటే తను చేసిన తప్పు బయటపడుతుందన్న భయం పెద్దదైపోయింది. తన కడుపున పుట్టిన బిడ్డను ఏమాత్రం ఆలోచించకుండా రెండంతస్తుల ఇంటి పైకప్పు నుంచి కిందికి తోసేసింది…ఆ నిమిషం అక్కడ ఆకాశం నుంచి పడిపోయింది కేవలం ఒక శరీరం కాదు…ఒక తండ్రి కలలు, ఒక తల్లి మమకారం,ఒక ఇంటి ఆనందం.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు సన్నీ కన్నుమూశాడు. తండ్రి మొదట ఇది ప్రమాదం అని అనుకున్నాడు. తల్లి కూడా అలాగే నటించింది. కానీ నిజం…
మనసు లోతుల్లో దాగదు. ఆ కసాయిని చేసిన పాపం వెంటాడింది కాబోలు..రాత్రుళ్ళు ఆమె నిద్రలో లేచి భయంతో కంపించేది. కళ్ళు మూసినా తెరిచినా ఒక్కే ముఖం…తన కొడుకు
“అమ్మా…ఇలా ఎందుకు చేశావు? నేనేం చేశా అమ్మా” అనే ప్రశ్న ఆమె గుండెల్లో ప్రతిధ్వనించేది. ఆ భయం…ఆ పాపభారం.. చివరకు ఆమెను నిజం ఒప్పుకునేలా చేసింది.
ఒక రోజు…భర్త ముందు కూలిపోయి “నేనే…మన కొడుకును చంపేశాను…” అని చెప్పింది… ఆ మాటలు విన్న తండ్రి ప్రపంచమే కూలిపోయినట్లైంది. ఆయన ఆధారాలు సేకరించి పోలీసులకు ఇచ్చాడు.
చివరకు కోర్టు తీర్పు వచ్చింది. తల్లి దోషిగా తేలింది. జీవిత ఖైదు విధించబడింది. కానీ…సన్నీ మాత్రం తిరిగి రాలేదు. తండ్రి గుండెల్లో శూన్యం మిగిలింది. ఇంట్లో నవ్వుల స్థానంలో మౌనం స్థిరపడింది. ఇక్కడ నిందితులెవరు? పాపం ఎవరిది? ఆ కసాయి అనుభవించేది శిక్షా? లేక ఆ పసికందు పడ్డ ఆవేదనా? ఆ బిడ్డ తన తల్లి ఎత్తుకుంది అనుకున్నాడేమో…కానీ అలా ఎత్తుకుని పై నుండి పడేస్తుందని ఊహించి వుంటాడా? అసలు ఎవరైనా ఊహిస్తారా? ఈ ప్రపంచంలో తల్లే ఇలా చేస్తే ఇక ఎవర్ని నమ్మగలరు? క్షణకాలం సుఖం కోసం కన్నా బిడ్డలను కాలరాసే తల్లిదండ్రులు సిగ్గుతో తల దించుకోవాల్సిన సందర్భమిది. అయ్యా అమ్మా మీకు ఒక మనవి. మీ సుఖం కోసం ఒకర్ని కనేసి వాళ్ళని కాలరాయకండి. పిల్లల్లేక బాధపడే వాళ్ళు ఎందరో ఉన్నారు. దయచేసి మీకు పిల్లలు అడ్డు అనుకుంటే పిల్లలని కనకండి.
ఈ కథ మనకు ఒక పాఠం చెబుతుంది…పిల్లలు మన తప్పులకు మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు. అమ్మ ప్రేమ దేవతని మరిపించేలా ఉండాలి…నాన్న ప్రేమ బాధ్యత నేర్పాలి. కానీ ఆ ప్రేమ తప్పుదారిలో వెళ్తే అదే ప్రేమ ఒక శాపంగా మారుతుంది.
ALSO READ: నన్ను నాలా బ్రతకనివ్వని ఈ సమాజం నాకెందుకు? నిన్ను నీలాగే ప్రేమించు. నిన్ను నీలాగే గౌరవించు!

LGBTQ: పాత చింతకాయ పచ్చడి ప్రసంగాలు మానుకుంటే చాలా మంచిది..! వారి పట్ల ఇంత వివక్ష ఎందుకు?
Parenting: గట్టిగా అరవద్దు.. పిల్లల ముందు గొడవ పడొద్దు.. అధ్యయనాలు చెబుతున్న కఠిన నిజాలు!
Parenting: స్కూల్లో మీ పిల్లలు బుల్లియింగ్కు గురవుతున్నారా? ఈ 5 లక్షణాలు కనిపిస్తే అదే నిజం!
Relationships: కన్నీటి చుక్కలో దాగిన శాంతి.. ఈ సమాజంపై ఓ మహిళ ఒంటరిగా గెలవగలదా?
Women’s Life: ఓ స్త్రీ.. నీ విలువెంత? ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెబుతారా?
India’s Hidden Script: బాల్యం నుంచే Gender Roles ను నేర్పిస్తున్న ఫ్యామిలీలు, సొసైటీ