Menu

Telangana Group 1 Exams: తెలంగాణ సర్కార్‌కు రాజ్యాంగం గుర్తు రాలేదా? రిజర్వేషన్ల లొల్లి తెచ్చిన జీవో. 29 !!

Tri Ten B
TGPSC group 1 exams controversy

పరీక్ష సరిగ్గా నిర్వహించడం కూడా రాదా?

నిరుద్యోగులంటే చులకనభావమా?

రాజ్యాంగ విలువలకు పాతరేస్తారా?

పరీక్ష నిర్వహణలో కేసీఆర్‌ ప్రభుత్వానికి రేవంత్‌ ప్రభుత్వానికి తేడా ఏముంది?

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి, నిరుద్యోగుల పాత్ర చాలా కీలకం. తెలంగాణ వస్తే తమకు మంచి ఉద్యోగాలు వస్తాయి, తమ జీవితం బాగుపడుతుందని వాళ్లు భావించారు. గత పది ఏళ్లుగా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశం ఇవ్వనందువల్లే బిఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగవలసి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ కూడా నిరుద్యోగులతో అదే చదరంగం ఆడుతుంది.

రోడ్డుపై గ్రూప్-1 అభ్యర్థి నిరసన

ఏదో పరీక్ష పెట్టామా, అభ్యర్థుల ముఖాన ఓ ప్రశ్న పత్రం పడేశామా, అన్నట్టుంది రేవంత్‌ సర్కార్‌ తీరు. గ్రూప్‌-1 పరీక్షే అందుకు అతి పెద్ద ఉదాహరణ. తెలంగాణలో ఏ పరీక్ష నిర్వహించినా అది వివాదాలు లేకుండా జరగదేమో అనుకునేలా రోజులు గడుస్తున్నాయి. ప్రభుత్వం మారితే తమ రాతలు కూడా మారుతాయని గంపెడాశలు పెట్టుకున్న అభ్యర్థులకు రేవంత్‌ సర్కార్‌ ఘోరమైన అన్యాయం చేస్తోంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశ్నాపత్రమే ఓ తప్పుల తడక.. అదేంటని కోర్టులు అడిగితే తెలుగు అకాడమి పుస్తకాలే ప్రమాణికం కాదని TGPSC చెప్పడం విడ్డూరం. అంటే ఇంతకాలం అదే అకాడమి పుస్తకాలు చదివిన అభ్యర్థులు వెర్రివాళ్లా? ఇటు ఇండియాలో రిజర్వేషన్‌ ఎలా అమలు జరుగుతుందో తెలియదో ఏమో పాపం.. జీవో 29 పేరిట ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు రాజ్యాంగ విలువకు తూట్లు పొడుస్తున్నాయి. అణగారిన,శ్రామిక కులాలకు చెందిన అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తున్నాయి. అందుకే పరీక్ష రద్దు చేయాలని అభ్యర్థులు గట్టిగా కోరుతున్నారు.

ప్రాధమిక హక్కుల ఉల్లంఘనే?

అక్టోబర్‌ 21 మధ్యాహ్నమే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష జరగనుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేయాలని కోర్టుల తలుపు తట్టిన అభ్యర్థులకు ఇప్పటివరకు నిరాశే ఎదురైంది. అయితే మెయిన్స్‌ పరీక్ష మొదలవడానికి కొద్దీ గంటల ముందు హైకోర్టు మరోసారి అభ్యర్థుల వాదన విననుంది. మరోవైపు జీవో 29 రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషన్‌దారులు ఆరోపిస్తున్నారు. నిజానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జీవో 55 ప్రకారం పరీక్షలు జరిగేవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి జీవో 29ను తీసుకొచ్చింది. ఇక్కడే వివాదం మొదలైంది.

TGSPC group 1 exam

నిరసన చేస్తున్న విద్యార్థిపై పోలీసుల దాడి

రిజర్వేషన్‌ కనీస సూత్రాలు తెలియవా?

సాధారణంగా 50శాతానికి మించకుండా రిజర్వేషన్లతో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయి. ఇందులో బీసీ రిజర్వేషన్ 27శాతం ఉంటుంది. ఎస్సీ రిజర్వేషన్‌ 15శాతం ఉంటుంది. ఎస్టీ రిజర్వేషన్ 7.5శాతం ఉంటుంది. మిగిలినదంతా ఓపెన్ క్యాటగిరి కిందకు వస్తుంది. ఈ ఓపెన్ క్యాటగిరి మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఈ క్యాటగిరిలో ఏ కులం వారైనా ఉండొచ్చు. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో 55 ప్రకారం కూడా అంతే. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 ప్రకారం మాత్రం రిజర్వేషన్‌ అభ్యర్థికి మెరిట్ కోటాలో ఉద్యోగం వచ్చే అవకాశమే లేదు. ఎన్ని మార్కులు సాధించినా, టాప్‌ ర్యాంక్‌ వచ్చినా సంబంధిత రిజర్వేషన్‌ ప్రకారమే ఉద్యోగాన్ని భర్తీ చేయాల్సి వస్తోంది. ఇది రిజర్వేషన్‌ ప్రాధమిక సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల అభ్యర్థులు అవకాశాలను కోల్పోతారు. మరోవైపు రేవంత్‌ మాత్రం రద్దు డిమాండ్‌ను ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారని ఎదురు మాట్లాడుతున్నారు. జీవో రిలీజైన రోజే అభ్యర్థులు ఈ విషయాన్ని చెప్పి ఉండాల్సిందని అభ్యర్థులకు కౌంటర్ ఇస్తున్నారు.

తెలుగు అకాడమి పుస్తకాలు ప్రామాణికం కాదట

ఎలాంటి వివాదాలు లేకుండా పరీక్ష సజావుగా జరగాలని అభ్యర్థులకు కోరుకుంటారు. అయితే గ్రూప్‌-1 పరీక్ష మాత్రం వివాదల చుట్టూనే జరుగుతోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు రెండుసార్లు ఈ పరీక్ష రద్దయింది. ఇటు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా 60 సీట్లను పెంచి కొత్తగా నోటిఫికేషన్‌ విడుదల చేసినా పరీక్ష నిర్వహణలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. గ్రూప్‌-1 పరీక్ష ప్రిలిమ్స్‌ ప్రశ్నాపత్రంలో 150 ప్రశ్నాలు ఉంటే అందులో 14 ప్రశ్నలపై అభ్యర్థులు కోర్టు తలుపుతట్టారు. అయితే ఈ 14 ప్రశ్నలకు సంబంధించిన తప్పులను కూడా అంగీకరించలేదు TGPSC. ఆ తప్పులనే ఒప్పులగా చూపించే ప్రయత్నం చేసింది. నిజానికి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే ఈ రెండు పుస్తకాల్లోని అంశాలను కాకుండా వేరే పుస్తకాలను కోర్టుకు చూపించి తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది TGPSC. ఇది అభ్యర్థుల ఆగ్రహానికి కారణమైంది. తెలుగు అకాడమి పుస్తకాలు ప్రామాణికం కాదని చెప్పడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పరీక్ష నిర్వాహణలో బోర్డు డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపించింది. అందుకే పరీక్షను రద్దు చేసి ఎలాంటి గందరగోళం లేకుండా నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: రాజ్యం చేసిన ద్రోహం! ప్రొఫెసర్ సాయిబాబా మరణం!!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *