Menu

Ghaziabad Triple Tragedy: కంటికి కనిపించని ప్రమాదం.. ముగ్గురు మైనర్ సిస్టర్స్‌ను చంపేసిన కొరియన్ ప్రపంచం..!

Praja Dhwani Desk 2 minutes ago
korean dramas series addiction

ముగ్గురు అమ్మాయిలు తమకి మాత్రమే తెలిసిన మరో ప్రపంచంలో బతికారు. అది బయట కనిపించని ప్రపంచం. ఫోన్ స్క్రీన్‌లో మాత్రమే తెరుచుకునే ప్రపంచం. అక్కడ వాళ్లు ఒంటరిగా లేరు. అక్కడ వాళ్లు భయపడలేదు. అక్కడ వాళ్లను ఎవరూ కొట్టలేదు, ఆదేశించలేదు, పెళ్లి మాటలూ ఎత్తలేదు. ఆ ప్రపంచానికి వాళ్లు ఒక పేరు పెట్టుకున్నారు.. అదే ‘కోరియన్’. కానీ నిజ జీవితం మాత్రం వేరే కథ చెప్పింది. చదువు ఆగిపోయింది. ఇంటి ఒత్తిడి పెరిగింది. ఇంట్లోవాళ్లు ఫోన్ లాగేసుకున్నారు. దీంతో ఆ ముగ్గురు ఒక నిర్ణయం తీసుకున్నారు.

ఈ లోకాన్ని వీడాలని డిసైడ్ అయ్యారు. ఈ కథ మూడు ప్రాణాల ముగింపు మాత్రమే కాదు. ఇది వినిపించని పిల్లల మనసుల కథ. ఆన్‌లైన్ ప్రపంచం ఎలా మోసం చేస్తుందో వివరించే గాధ. ఘాజియాబాద్‌లో జరిగిన ఈ ఘటన దేశాన్ని తీవ్రంగా కలిచివేసేలా చేసింది.

ఈ నిర్ణయం ఒక్క రాత్రిలో తీసుకున్నది కాదు. ముగ్గురు మైనర్ సిస్టర్స్‌ కొన్ని సంవత్సరాలుగా స్కూల్‌కు వెళ్లడం మానేశారు. చదువులో వెనుకబడ్డామని కాదు.. బయట ప్రపంచంతో తమకు సంబంధమే లేదన్న భావన వాళ్లలో నెమ్మదిగా బలపడింది.

వారి ప్రపంచం ఫోన్ స్క్రీన్‌కే పరిమితమైంది. అక్కడే వాళ్ల స్నేహితులు ఉన్నారు, అక్కడే వాళ్ల హీరోలు ఉన్నారు, అక్కడే వాళ్లకు అర్థమయ్యే భాష ఉంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న 8పేజీల సూసైడ్ నోట్ వారి లోపలి ప్రపంచాన్ని స్పష్టంగా బయటపెట్టింది. ఆ లేఖలో వారు తమ తండ్రికి క్షమాపణ చెప్పారు. కానీ ఒక విషయం మీద మాత్రం రాజీ పడలేకపోయామని రాశారు. తమ జీవితంలో కోరియన్ అంటే ఒక వినోదం కాదు, అది తమ జీవితమని చెప్పారు. పెళ్లి మాట వింటే తమలో భయం మొదలవుతుందని, కొరియన్ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో బతకడం తమ వల్ల కాదని ఆ లేఖలో రాసుకొచ్చారు.

ఈ ఆలోచన ఒక్కసారిగా పుట్టలేదు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, ముగ్గురు అమ్మాయిలూ రోజంతా ఫోన్లలోనే గడిపేవారు. కొరియన్ డ్రామాలు, ఆన్‌లైన్ గేమ్స్, కార్టూన్లు, వర్చువల్ క్యారెక్టర్లతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పరుచుకున్నారు. నిజ జీవితంలోని క్రమశిక్షణ, ప్రశ్నలు, ఆదేశాలు, భవిష్యత్తు గురించి మాట్లాడే మాటలు వాళ్లకు ఒత్తిడిగా మారాయి. ముఖ్యంగా తండ్రి ఫోన్లు లాగేసుకోవడం, డ్రామాలు చూడకూడదని చెప్పడం వాళ్లకు తమ జీవితాన్నే లాక్కున్నట్టు అనిపించింది.

తండ్రి చెప్పిన మాటలు ఈ విషాదానికి మరో కోణం చూపిస్తున్నాయి. కుటుంబంపై అప్పుల భారం ఉంది. పిల్లలు చదువు మానేయడంతో ఆందోళన పెరిగింది. వాళ్లు నిజ జీవితానికి తిరిగి రావాలన్న ఉద్దేశంతోనే కఠినంగా వ్యవహరించానని ఆయన చెప్పారు. మూడు రోజుల ముందు ఫోన్లు తీసేయడం, కొరియన్ డ్రామాలు చూడవద్దని చెప్పడం అదే ప్రయత్నంలో భాగమని వివరించారు. కానీ ఆ చర్యలు పిల్లల మనసుల్లో ఎంత లోతైన కలకలాన్ని రేపాయో ఆయన ఊహించలేకపోయారు. ఆ రాత్రి కుటుంబమంతా కలిసి భోజనం చేసింది. తర్వాత ముగ్గురు తమ గదిలోకి వెళ్లారు. తలుపు తీయమన్నా స్పందన లేదు. కొద్దిసేపటికే వినిపించిన అరుపులు, ఆ తర్వాతి నిశ్శబ్దం ఒక కుటుంబాన్ని శాశ్వతంగా విరిచేసింది. పోలీసులు ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా నిర్ధారించారు. ఎవరినీ నిందించలేమని, కానీ ఈ ఘటన వెనుక మానసిక ఒత్తిడి, ఒంటరితనం, వర్చువల్ ప్రపంచంపై అతిగా ఆధారపడటం ఉన్నాయని చెబుతున్నారు.

ఇక పిల్లల మనసులు ఎక్కడికి వెళ్లిపోతున్నాయో గమనించలేకపోతున్న సమాజానికి ఈ ఎపిసోడ్‌ అద్దం పడుతోంది. ఫోన్ ఒక సాధనం మాత్రమే. కానీ అది ఒకే ప్రపంచంగా మారితే, నిజ జీవితం భారంగా అనిపించడం మొదలైతే, అక్కడే ప్రమాదం మొదలవుతుంది. ఈ ఘాజియాబాద్ విషాదం నేర్పుతున్న పాఠమిదే!
ALSO READ: ‘ఆమెను మోసం చేశారు..’ నిజమైన హేతువాదం సోషల్‌మీడియాలో కాదు.. నిజ జీవితంలో కనిపించాలి..! సిద్ధాంతాల వెనుక దాక్కునే పిరికితనం!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *