Menu

Modi 3.O : దేశ చరిత్రలో తొలిసారి.. ముస్లింలపై ఎందుకింత అక్కసు!

Tri Ten B
no muslims in modi cabinet

‘వారంతా(ముస్లింలు) చొరబాటుదారులు.. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు అందించాలని మీరు అనుకుంటున్నారా..?’ ఇది ఏ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తో లేదా హిందూ ధర్మం కోసమే పుట్టినట్టు జనాల్లో తిరిగే బజరంగ్‌ దళ నేతో చేసిన కామెంట్స్‌ కాదు .. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు స్వయంగా దేశ ప్రధాని పదవిలో ఉన్న మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎన్నికల్లో విద్వేష వ్యాఖ్యలు చేయడం, మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడడం మోదీకి ఇది కొత్తేమీ కాదు.. అయితే ఎన్నికల తర్వాతైనా ముస్లింలకు బీజేపీ ఎంతో కొంత ప్రాధాన్యత ఇస్తుందని మీలో ఎక్కడైనా ఆశ ఉంటే అది అత్యాశే అయినట్టు లెక్క! ఎందుకంటే కొత్తగా కొలువుదీరిన 71మంది మంత్రివర్గంలో ఒక్కరంటే ఒక్క ముస్లిం నేత కూడా ప్రమాణస్వీకారం చేయలేదు. మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి పదవి కూడా ఈసారి ముస్లింలకు ఇవ్వలేదు. స్వాతంత్ర్య భారతంలో ఒక్క ముస్లిం నేత కూడా కేంద్ర మంత్రివర్గంలో లేకపోవడం ఇదే తొలిసారి.

అసలు ఒక్కరు కూడా లేకపోవడమేంటి?
2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నజ్మా హెప్తుల్లా మైనారిటీ వ్యవహారాల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ బాధ్యతలు అందుకున్నారు. అయితే 2022లో నఖ్వీ ఈ పదవికి రాజీనామా చేశారు. తర్వాత నుంచి మోదీ మంత్రివర్గంలో ముస్లిం నేతే లేకుండా పోయారు. నిజానికి 293 ఎంపీ స్థానాలు గెలిచిన ఎన్డీఏ కూటమిలో ఒక్క ముస్లిం నేత కూడా గెలవలేదు. అంతేకాదు ఈ 293మందిలో ఒక్కరంటే ఒక్క క్రిస్టియన్‌, సిక్కు కూడా లేరు.

రాజ్యసభ కోటాలోనూ ఇవ్వలేదు:
గెలిచిన ఎంపీలే మంత్రి వర్గంలో ఉండాలన్న నియమాలేవీ లేవు. రాజ్యసభ కోటాలో చాలామందిని మంత్రులకు ఎన్నుకునే పద్ధతి ఇండియాకు ఉంది. అందుకే అసలు పోటియే చేయని నిర్మాల సీతారామన్‌ మరోసారి ఆర్థికశాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. అటు 293మంది ఎన్డీఏ ఎంపీల్లో లేని క్రిస్టియన్లు, సిక్కులకు రాజ్యసభ కోటాలో పోర్ట్‌ఫోలియోలు కేటాయించింది మోదీ సర్కార్‌. అయితే ముస్లింలను మాత్రం విస్మరించింది. మైనారిటీ వ్యవహారాలశాఖ సిక్కు నేతకు అప్పగించింది.

నిలబెట్టింది కూడా ఒక్కరినే:
భారత్ జనాభాలో 14శాతం వరకు ఉన్న ముస్లింలకు ఈ సారి మంత్రివర్గంలో చోటే ఇవ్వకపోవడం భారత లౌకికవాదానికి తూట్లుపోడవడం కాకపోతే ఇంకేంటి? గెలిచిన 293మందిలో ముస్లింలు లేకపోతే మేం ఏం చేయగలమని వితండవాదం చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఎంపీ అభ్యర్థుల్లో బీజేపీ ఎంతమంది ముస్లింలను నిలబెట్టిందని అడిగితే సమాధానామేమీ ఉండదు. ఎందుకంటే బీజేపీ కేవలం ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని మాత్రమే నిలబెట్టింది. కేరళ మలప్పురం నియోజకవర్గంలో బీజేపీ ఒక ముస్లిం అభ్యర్థికి టిక్కెట్‌ ఇచ్చింది. అటు బీహార్‌-కిషన్‌గంజ్‌లో ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న జేడీయూ ఒక ముస్లింను పోటీకి నిలబెట్టింది. ఈ రెండు మినహా అసలు బీజేపీకి సంబంధించి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా పోటిలో లేరు.

18వ(2024) లోక్‌సభలో కేవలం 24 మంది ముస్లిం ఎంపీలు మాత్రమే ఉన్నారు. అందులో INDI కూటమి నుంచి 21 మంది ఉన్నారు. AIMIM నుంచి అసదుద్దీన్ ఒవైసీ గెలిచారు. అటు స్వతంత్ర ఎంపీలగా జమ్ముకశ్మీర్‌ నుంచి అబ్దుల్ రషీద్ షేక్, మొహమ్మద్ హనీఫా ఉన్నారు. అటు ఎన్డీయే నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్క ముస్లిం కూడా లేరు. సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌.. అని నినదించే మోదీకి ముస్లింల పట్ల విశ్వాసం లేకకావొచ్చు లేదా ద్వేషభావమై ఉండొచ్చు!

Also Read: ఒకరిది దొరహంకారం.. ఇంకొకరిది అతి విశ్వాసం.. ఇవే ఈ ఇద్దరి పతనానికి కారణం..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *