Menu

Gaza Hunger Crisis: నాలో ఇంకిపోయిన సముద్రాలు.. చితా భస్మమైన ఆకాశాలు.. గాజా గాయబ్!

Tri Ten B 6 months ago

ఒక్కసారి ఈ ఫొటో చూడండి…! కళ్లతో కాదు.. మనసుతో చూడండి.. మనుషులగా చూడండి..!

gaza kids hunger

ఏం అనిపించింది? నాకైతే ఈ ఫొటో చూసినప్పుడు.. నా శరీరం గడ్డకట్టిపోయినట్టు అనిపించింది.. ఒక్కనిమిషం ఊపిరి ఆగిపోతుందేమో అని భయం వేసింది. ఇది ఆధునిక శకంగా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కాలంగా చెప్పుకునే సమయమా అనే ఆవేదన కలిగింది. మనిషులను స్పేస్‌కి పంపుతున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం.. మరి గాజాలో ఆకలితో చనిపోతున్న బిడ్డలకు పాలు అందించలేకపోన్నామా అనే సందేహం కలిగింది. గాజా మారణకాండ చూశాక.. అక్కడి పసిబిడ్డల ఆకలికేకలు విన్నాక నాలోని సముద్రాలు ఇంకిపోయాయి.. నాలోని ఆకాశాలు చితా భస్మమైయ్యాయి..! ఒక్కసారి మీరే ఆలోచించండి.. ఆ తల్లి ఒడిలో బిడ్డ ఉందేమో కానీ ఆమె లోలోతుల్లో ఆశ లేదు.. ఆ తల్లిదనమంతా విలవిల్లాడుతోంది. ఆ బిడ్డ ఆకలితో చనిపోతుంటే.. మనం ఏం చేస్తున్నామో ఓసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అక్కడ బాంబులు పడుతుంటే.. ఇక్కడ ఫోన్‌లో రీల్స్ చూస్తున్నాం.. గాజాలో పిల్లలు ఆకలితో కుప్పకూలిపోతుంటే.. ఇక్కడ జల్సాలు చేస్తున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధం ముసుగులో జరుగుతున్న సామూహిక వధను మనకళ్లతో కళ్లప్పగించి చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి ఈ ప్రపంచం ఎటు పోతోంది? ఎవరు చేసిన నేరాలకు ఎవరు బలవుతున్నారు? ఈ దారుణానికి బాధ్యులు ఎవరు? నేటి సైన్స్ కాలంలోనూ కొనసాగుతున్న ఈ ఆకలిచావులు ఆగెదెప్పుడు?

పసిపిల్లల మెదళ్లే పేలిపోవాలా?

గాజా వార్తలు చదువుతుంటే కడుపు తరుక్కుపోతోంది.. ఎంత అమానుషం! ఎదురుగా ఒక మనిషి ప్రాణం పోతోందంటేనే ఊహించలేనంత బాధ! అలాంటిది.. అన్నెంపున్నెం తెలియని పసిబిడ్డల రక్తాలతో కూడిన దేహాలు, భవనాల శిథిలాల కింద దీనుల దయనీయ ఆర్తనాదాలూ చూస్తుంటే ఎంతటి హృదయమైనా కరిగి పోకుండా ఉంటుందా? ఇంతటి నరమేధానికి పాల్పడుతున్న వారికి అసలు హృదయాలు ఉన్నాయా? వాళ్లు అసలు మనుషులేనా? ఎంతటి కిరాతకులు? ఎంతటి నర హంతకులు? తిండిలేక 80మంది చిన్నారులు చనిపోవడమేంటి? వారికి ఆహారం అందనివ్వకుండా ఓ దేశం చేస్తుంటే.. మిగిలిన దేశాలు ఏ మాత్రం ప్రశ్నించకపోవడమేంటి? అసలు మనం ఏం అభివృద్ధి సాధిస్తున్నాం? ఏ దేశమైనా సరే యుద్ధ శిబిరాల్లో ఆడదాని అంగాలే ఛిద్రమవ్వాలా? పసిపిల్లల మెదళ్లే పేలిపోవాలా? మన కళ్ల ముందే పాలస్తీనా పిల్లల తలలు తెగిపడుతున్న విషయాన్ని మీరు గమనిస్తున్నారా? ఫొటోలు కూడా చూసి తట్టుకోలేని స్థితిలో మనం ఉన్నాం.. కనీసం చూపించలేని దుస్థితిలో వివరిస్తున్నాం..! మన పిల్లలు ఒక్కపూట తిండి తినకపోతే అల్లాడిపోయే తల్లి హృదయం మనది. అలాంటిది రోజులు కాదు.. వారాలు కాదు.. నెలల తరపడి ఆహారం కోసం పసిపిల్లలు రోదిస్తుంటే ఆ తల్లి హృదయం ఇప్పటికి ఎన్నివేల సార్లు ముక్కలై ఉంటుందో కదా..! ఆలోచిస్తూనే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అభం శుభం తెలియని పిల్లలు వాళ్ళు. దేశాల మధ్య వాళ్లకు సరిహద్దులు తెలియవు. వాటి మధ్య పాతుకున్న ముల్లకంచె గోడలూ తెలియవు. వాళ్ళు ఎగిరే సీతాకోకలు. చందమామ కోసం ఉవ్వెత్తున ఎగిసే పిల్లలు. అలాంటి పిల్లలకు యుద్ధంతో సంబంధమేంటి? ఏళ్ల తరపడి గాజా గడ్డపై నెత్తురు పారిస్తున్న ఇజ్రాయెల్‌ దీనికి సమాధానం చెబుతుందా? దానికి అండగా నిలుస్తూ వస్తున్న అమెరికా దీనికి బాధ్యత వహిస్తుందా? ఈ ఘోర నిజాన్ని ప్రశ్నించకుండా మౌనంగా గమనిస్తున్న మిగిలిన ప్రపంచం ఇప్పటికైనా బాధ్యులను నిలదీస్తుందా?

ఇంకా ఆదిమ దశలోనే ఉన్నామా?

అరచేతిలో అన్నం కోసం నిలబడ్డ వారిని కాల్చేయడం ఏంటో అర్థంకావడంలేదు. మొన్న ఒక్కరోజులోనే 81 మంది మరణించారు. అందులో 31 మంది కడుపు నింపుకోవడానికి సహాయం కోసం వచ్చిన వారే. ఏ దేశమైనా ఇలా చేస్తుందా? అన్నం కోసం కడుపు మాడిన మనిషిని.. సహాయాన్ని ఆశించిన పిల్లలను లక్ష్యంగా చేసుకుని కాల్చుతారా? ఓ మనిషి ఆకలితో అలమటిస్తుంటే ఎవరికైనా జాలి కలుగుతుంది. అలాంటిది బ్రెడ్డు ముక్క కోసం లైన్‌లో నిలబడిన వారిని చంపుకుంటూపోతున్నారంటే అలాంటివారిని ఏం అనాలి? తిండి ఆశించి నిలబడిన చోట మృతదేహాలు కనిపించడం అత్యంత బాధాకరం. తిండి కోసం తలదాచుకున్న ఓ భవనాన్ని కూల్చేసి మరో 15 మందిని హతమార్చారు. శరణార్థ శిబిరంపై దాడి చేసి మరో 13 మందిని చంపారు. వీళ్లంతా తిండి కోసం వచ్చినవారే. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి.. మనమంతా ఆధునిక కాలంలో ఉన్నామనే భావనే తప్ప మన జీవితం మాత్రం ఇంకా ఆదిమ దశలోనే లేదా? చుట్టూ అణ్వాయుధాలను కట్టుకొని తిరుగుతున్నాం. మతం, ఆధిపత్యం పేరుతో కొట్టుకు చస్తున్నాం. గాజా పిల్లల దీన స్థితి చూస్తే నాకైతే ఇలానే అనిపిస్తుంది. సరిగ్గా ప్రపంచపటం నడిబొడ్డున.. శిలువనెక్కిన చేతుల నిండా మానిపోని గాయాల గుర్తుల సాక్షిగా.. అభంశుభం తెలియని పసికందులు నిర్జీవంగా మారుతుంటే మీకేం అనిపిస్తుంది? ఈ 76ఏళ్లలో పాలస్తీనా గడ్డపై ఏం కనిపించింది? చిరిగిన పుస్తకాలు.. నిలువెల్లా ఛిద్రమైన అక్షరాలు.. ముక్కలు ముక్కలైన పలకలు.. పిండి పిండైన బలపాలు.. కాళ్లు తెగిన బుడిబుడి నడకలు.. మూగపోయిన బుల్లిబుల్లి మాటలు.. ఇది నాలుగు ముక్కల్లో చెప్పాలంటే పాలస్తీనా చిన్నారుల జీవితం..!

విధ్వంసం, వినాశనం, మానవ హననం

ఇవాళ పాలస్తీనా చిన్నారులకు ఆహారం, నీరు, ఇంధనం, విద్యుత్తు, వైద్యం ఏమీ అందడం లేదు. మురుగు నీరు తాగుతున్నారు. ఆకలికి మాడి అలమటిస్తున్నారు. కంటి నిండా నిద్ర లేదు. కడుపులో తిండి లేదు. వాళ్లని ఏ దేశమూ పట్టించుకోవడం లేదు. మానవ హక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అని కబుర్లు చెప్పే పశ్చిమ దేశాలు కనీసం వాళ్ల వైపు చూడడంలేదు. ఇటు హమాస్‌పై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధం ఇప్పటిలో ఆగేలా లేదు. నిజానికి యుద్ధం అంటేనే హత్యలు! యుద్ధం అంటేనే క్రూరత్వం, భీభత్సం, విధ్వంసం, వినాశనం, మానవ హననం..! ఎదుటి మనిషి ప్రాణాలు తీయడం, ప్రాణాలు పోగొట్టుకోవడం, మనిషిని మనిషి చంపుకోవడం.. ఇదే యుద్ధంమంత్రం. మానవ సమాజానికి యుద్ధాన్ని మించిన ఉన్మాదం, అనాగరికం, భయానకం, ప్రమాదకరం ఇంకోటి లేదు. పాలస్తీనా పిల్లల దుస్థితి చూసిన తర్వాత ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మరి మీరేంటారు? గాజా పిల్లల ఆకలిచావులకు కారణమేంటి? కారణం ఎవరు? మీకే తెలియాలి!

ALSO READ: అణచివేతల చీకట్లో నిలబడ్డ వెలుగులు.. ప్రేమకు పరిధులుంటాయా? ఇది వినిపించని గొంతుల గర్జన!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *