Menu

Ganja-Cannabis: ఇక నుంచి భారత్‌లో గంజాయి లీగలే..! ఈ నిర్ణయం ఎవరి కోసం? ఎందుకోసం?


ఇకపై ఇండియాలో గంజాయి సాగు చట్టబద్ధం కానుందా? విచ్చలవిడిగా గంజాయి మొక్కలను పెంచుకోవచ్చా? గంజాయిను ప్రభుత్వాలే ప్రమోట్ చేయనున్నాయా?


Praja Dhwani Desk
marijuana ganja medical usage

ఓ 8ఏళ్ల చిన్నారి హత్యాచారానికి గురైంది.. కారణం ఓ యువకుడి గంజాయి మత్తు..

ఓ స్కూల్ పిల్లాడు తన చేతులను కత్తితో కసాకసా కోసేసుకున్నాడు.. కారణం గంజాయి మత్తు..

ఓ అమ్మాయి ప్రవర్తనలో అనూహ్య మార్పు.. ఇంట్లో వారిని బండబూతులు తిడుతోంది.. కారణం గంజాయి మత్తే..

ఇలా ఒకటి కాదు రెండు కాదు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో జరుగుతున్న ఎన్నో ఘోరాలకు, నేరాలకు గంజాయి మత్తు ఓ ప్రధాన కారణం. మరి ఇలాంటి దారుణాలకు కారణం అవుతున్న గంజాయిని సాగు చేయడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గంజాయి సాగుకు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడమేంటి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ..! ఇంతకీ గంజాయి సాగు దేని కోసం? ఇండియాలో హిమాచల్‌ప్రదేశ్‌ కాకుండా.. ఏ రాష్ట్రాల్లో గంజాయి సాగుకు చట్టబద్ధత ఉంది? ఇక మిగిలిన దేశాల సంగతేంటి?

ganja crime news

గంజాయితో సమాజంలో ఎన్నో ఘోరాలు ( ప్రతీకాత్మక చిత్రం )

ఆదాయం కోసం ఇలా చేయవచ్చా?

హిమాచల్ ప్రదేశ్‌లో గంజాయిని చట్టబద్ధం చేయాలనే ఆలోచన కొత్తదేమీ కాదు. 2018లో నాటి ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అటు పారిశ్రామిక, వైద్య గంజాయి సాగును చట్టబద్ధం చేయాలని కోరుతూ సిమ్లాకు చెందిన న్యాయవాది దేవన్ ఖన్నా 2022లో హిమాచల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు కూడా. ఇక తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం గంజాయి సాగును అనుమతించడం వెనుక ఉన్న ఆలోచన రాష్ట్రానికి ఆదాయాన్ని సృష్టించడం. దీంతో పాటు ఉపాధి వనరుగా గంజాయి సాగును వాడుకోవడం. మరోవైపు గంజాయిని చట్టబద్ధం చేయడం వల్లన రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వరంగా మారుతుందన్నది అక్కడి ప్రభుత్వ వాదన!

dont use cannabis

గంజాయితో జీవితాలు చిత్తు ( ప్రతీకాత్మక చిత్రం )

యువత పక్కదారి పడితే అంతే సంగతి

ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న హమాచల్‌ ప్రదేశ్‌ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ప్రజల ఆరోగ్యం సంగతేంటి? విచ్చలవిడి గంజాయి సాగుతో యువత ఈ మత్తుకు బానిసగా మారితే జరిగే పరిణామాలు ఊహించుకుంటేనే భయం వెయ్యకమానదు. అయితే కేవలం హిమాచల్‌ ప్రదేశ్‌లోనే కాదు ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌లో కూడా నియంత్రిత గంజాయి సాగు జరుగుతోంది. ఇండియాలో మొదటిసారిగా 2015లో ఉత్తరాఖండ్‌ గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించింది.

ganja Uruguay cannabis

యురేగ్వేలో గంజాయికు చట్టబద్ధత ( ప్రతీకాత్మక చిత్రం )

ఈ దేశాల్లో గంజాయి సాగుకు ఓకే

నిజానికి ప్రపంచవ్యాప్తంగా 50కు పైగా దేశాలు వైద్య ఉపయోగం కోసం గంజాయిని చట్టబద్ధం చేశాయి. 2013లో గంజాయి ఉత్పత్తి, పంపిణీ, వినియోగాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం యురేగ్వే నిలిచింది. ఇటు 2022 గంజాయిను పూర్తిగా చట్టబద్ధం చేసిన మొదటి ఆసియా దేశంగా థాయ్‌లాండ్‌ నిలిచింది. ఇక కెనడా, జార్జియా, లక్సెంబర్గ్, మాల్టా, మెక్సికో, దక్షిణాఫ్రికాలలో కూడా గంజాయి వాడకాన్ని అనుమతిస్తారు. అమెరికాలోని 23 రాష్ట్రాల్లో గంజాయి వినియోగం ఉంది.

తెలుగు రాష్ట్రాలు ఇలా..

ఓవైపు తెలంగాణ ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. మరోవైపు గంజాయి సాగుకు కేంద్రంగా మారిన ఏపీలో కూడా ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఇటు యాంటి నార్కోటిక్‌ బ్యూరో గంజాయి పెడ్లర్లపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నారు. ఇక గంజాయి వినియోగించారో లేదో తెలుసుకునేందుకు డ్రగ్స్‌ టెస్టింగ్‌ కిట్లను క్షేత్రస్తాయిలో పోలీసుస్టేషన్లలో అందుబాటులోకి తెచ్చారు.

ganja testing kits in telangana

తెలంగాణలో డ్రగ్ టెస్టింగ్ కిట్స్

 

నిర్ణయాన్ని అంగీకరిస్తాయా?

మరోవైపు మిగిలిన రాష్ట్రాలు కూడా గంజాయి విషయంలో ఇదే వైఖరితో ఉన్నాయి. అయితే ఇదే సమయంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌కు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వెళ్లే టూరిస్టుల సంఖ్య ఎక్కువే. అక్కడికి వెళ్లినవారంతా గంజాయిను ఓపెన్‌గా కోనుగోలు చేసే అవకాశాలు లేకపోలేదు. అక్కడ నుంచి రాష్ట్రాలకు గంజాయి వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయన్నది చాలా మంది అభిప్రాయం. మరి అక్కడికి వెళ్లి గంజాయి కొట్టినవాళ్లు తర్వాత తమ ప్రాంతాలకు వెళ్లి దాన్ని సేవించకుండా ఉండగలరా అన్నది ప్రశ్నర్థకమే.  ఇటు ఇప్పటికే గంజాయి విషయంలో చాలా కఠినంగా ఉన్న చాలా రాష్ట్రాలు హిమాచల్‌ప్రదేశ్‌ కారణంగా తమకు హాని జరిగే అవకాశాలను గుర్తించవచ్చు. అప్పుడు ఇది రెండు రాష్ట్రాల వివాదంగా కూడా మారవచ్చు. దీన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏవిధంగా నియంత్రిస్తుందో చూడాల్సి ఉంది.

అనారోగ్య సమస్యలు తప్పవు

గంజాయిను వైద్యపరంగా లేదా హిమాచల్‌ప్రదేశ్‌ లాగా ఆర్థిక ప్రయోజనాల కోసం సాగు చేయడం వినడానికి బాగానే ఉన్నా ఈ నిర్ణయాలు పక్కదారి పట్టకుండా ఎలా ఉంటాయన్నది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే గంజాయి పీల్చడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అది చాలా సార్లు అడిక్షన్‌కు దారి తీస్తుంది. గంజాయిను ఎక్కువగా వినియోగించేవారిలో శారీరక, మానసిక మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఇటు ఊపిరితిత్తులు లాంటి కీలక అవయవాలు కూడా పాడువుతాయి.

cannabis lung cancer

మత్తు.. చిత్తు.. ఏ మత్తైనా చిత్తే కదా

ఇక గంజాయికు అడిక్ట్ అయిన వాళ్లు అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడంతో పాటు కొన్నిసార్లు చనిపోతారు. అటు ఎన్నో నేరాల వెనుక గంజాయి మత్తుతో పాటు ఇతర డ్రగ్స్ వాడకం ఉందన్నది నిత్య సత్యం. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దోపిడి, అత్యాచారాలు లాంటి నేరాలకు గంజాయితో మూడి పడి ఉంది. అయితే కేవలం గంజాయి మాత్రమే మత్తు కాదు.. సిగరేట్లు,మద్యం కూడా మత్తే.. వాటి ద్వారా చిత్తవుతున్న కుటుంబాలు గంజాయి కంటే తక్కువేమీ కాదు. ఇలా ఎన్నో మత్తులు ప్రపంచాన్ని పట్టిపీడిస్తుండగా కొన్ని మత్తులను ప్రభుత్వం నిషేధిస్తున్నాయి.. మరికొన్ని మత్తులకు అనుమతలిస్తున్నాయి. వాటిని నిజంగా నియంత్రించకుండా ఒక ఆదాయ మార్గాలు గా చూస్తున్నాయి రాష్ట్రాలు.‌ ఏది ఏమైనా అది ఏ మత్తైనా ప్రజలు వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.

DISCLAIMER: మాదక ద్రవ్యాలతో పాటు మద్యం, సిగరేట్ల లాంటి వాటిని తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై పని చేసి శరీర అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తాయి.మాదకద్రవ్యాల వాడకం చట్టవిరుద్ధం.దీంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ ఆర్టికల్ ఇంటర్‌నేట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది.

ఇది కూడా చదవండి: బొప్పాయి ఆకు ప్లేట్‌లేట్స్‌ను పెంచుతుందా? దీని వెనుక ఉన్న అపోహలు- నిజాలేంటి?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *