Menu

Harish Rana: ‘మా కుమారుడిని చనిపోనివ్వండి..’ సుప్రీంకోర్టు ముందుకు తల్లిదండ్రుల కన్నీటి కథ!

Praja Dhwani Desk 3 weeks ago
harish rana episode

13 ఏళ్లుగా ఒక మనిషి శ్వాస తీసుకుంటున్నాడు కానీ స్పందన లేదు. మాట లేదు. చూపు లేదు. జీవితం ముందుకు కదలడం లేదు. ఢిల్లీలోని ఒక ఇంట్లో ఈ 13 ఏళ్లు కాలం ఆగిపోయింది. ఇప్పుడు ఆ ఆగిపోయిన జీవితంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకోబోతోంది.

సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన ఈ నిర్ణయం చాలా భారమైనది. చికిత్స కొనసాగించాలా? లేదా జీవితం పేరుతో సాగుతున్న బాధకు ముగింపు పెట్టాలా? ఢిల్లీకి చెందిన హరిష్ రాణా 2013లో జరిగిన ఒక ప్రమాదం తర్వాత నుంచి పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్‌లో ఉన్నాడు. ట్యూబుల సహాయంతో శ్వాస, ట్యూబుల ద్వారానే ఆహారం తీసుకుంటున్నాడు. వైద్య నివేదికల ప్రకారం కోలుకునే అవకాశం దాదాపు శూన్యం. ఇప్పుడు అతడి తల్లిదండ్రులే కోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడి జీవితాన్ని పొడిగించడం గౌరవమా? లేదా గౌరవంగా మరణించేందుకు అవకాశం ఇవ్వడమే సరైనా నిర్ణయమో చెప్పాలని కోర్టు మెట్లు ఎక్కారు.

హరిష్ రాణా కేసు సుప్రీంకోర్టు ముందు రావడం ఇదే తొలిసారి కాదు. కానీ ఈసారి కోర్టు స్వయంగా అతడి తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ఈ అంశాన్ని డెలికేట్ ఇష్యూగా అభివర్ణించారు. మనమంతా మానవులమేనని, ఎవరు జీవించాలి ఎవరు మరణించాలనే తీర్పు ఇవ్వడం చాలా కష్టమని కోర్టే అంగీకరించింది. హరిష్ పరిస్థితిపై కోర్టుకు రెండు మెడికల్ బోర్డులు నివేదికలు సమర్పించాయి. వాటి ప్రకారం అతడు పూర్తిగా తపర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్‌లో ఉన్నాడు. మెదడు కార్యకలాపాలు కనీస స్థాయికి కూడా చేరడం లేదు. భవిష్యత్తులో స్పందించే అవకాశం లేదు కూడా. ఈ నివేదికల ఆధారంగా అమికస్ క్యూరీ కోర్టుకు ఒక స్పష్టమైన వాదన వినిపించారు. ఇది ఎవరి జీవితాన్ని తీసేయడం కాదు, సహజ మరణాన్ని కృత్రిమంగా ఆలస్యం చేస్తున్న చికిత్సను నిలిపివేయడమేనని చెప్పారు. దీన్నే పాసివ్ యూతెనేషియా అంటారు.

పాసివ్ యూతెనేషియాలో ఏ ఇంజెక్షన్లు ఇవ్వరు. ఎలాంటి చర్యలు తీసుకోరు. కేవలం శరీరాన్ని నిలబెట్టే ట్యూబులు తొలగిస్తారు. ఆహారం, శ్వాస యంత్రాలను మెల్లగా ఆపేస్తారు. అదే సమయంలో రోగికి నొప్పి లేకుండా ఉండేందుకు మందులు ఇస్తారు. అంటే మరణాన్ని తీసుకురావడం కాదు. మరణాన్ని అడ్డుకుంటున్న వ్యవస్థను తొలగించడం. ఇదే తేడాను కోర్టు ముందు స్పష్టంగా ఉంచారు.

భారత చట్టాల్లో యూతెనేషియా అంశం కొత్తది కాదు. 2011లో అరుణా షాన్‌బాగ్ కేసులో తొలిసారి సుప్రీంకోర్టు పాసివ్ యూతెనేషియాను గుర్తించింది. 1973లో లైంగిక దాడికి గురై నాలుగు దశాబ్దాలకు పైగా వెజిటేటివ్ స్టేట్‌లో ఉన్న అరుణా కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ కేసులో కోర్టు అనుమతి ఇచ్చినా ఆమె సహజంగానే 2015లో మరణించారు. తర్వాత 2018లో సుప్రీంకోర్టు పాసివ్ యూతెనేషియాను చట్టబద్ధం చేస్తూ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. హరిష్ రాణా కేసు ఆ మార్గదర్శకాలు వాస్తవంగా అమలు కానున్న తొలి సందర్భంగా మారవచ్చని న్యాయవర్గాలు చెబుతున్నాయి. కేంద్రం తరఫున హాజరైన అడిషనల్‌ సాలిసిటర్ జనరల్ కూడా పాసివ్ యూతెనేషియాకు మద్దతు చెప్పారు. అయితే మరణం చికిత్స నిలిపివేయడం వల్ల కాకుండా, అసలు వ్యాధి కారణంగానే జరగాలని కోర్టు నిర్ధారించాలని సూచించారు. అలాగే ఇలాంటి కేసుల్లో కేర్‌టేకర్స్ అభిప్రాయాలకు కూడా చట్టపరమైన విలువ ఇవ్వాలని కోరారు.

మరోవైపు 13 ఏళ్లుగా ఒకే మంచం మీద కదలని కుమారుడిని చూస్తూ జీవించడం తల్లిదండ్రులను ఎంతగానో బాధపెడుతోంది. తమ కుమారుడి శ్వాస కొనసాగుతుండటం జీవితం కాదని, అది బాధను మాత్రమే పొడిగిస్తోందని తల్లిదండ్రులు కోర్టుకు చెప్పుకున్నారు. ఇక ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు ఇప్పుడు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పు హరిష్ రాణా జీవితానికే కాదు, భవిష్యత్తులో ఇలాంటి వేలాది కుటుంబాలు ఎదుర్కొనే న్యాయ మార్గానికీ దిశానిర్దేశం చేయబోతోంది.

ALSO READ: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *