Biased Journalism in India and Telugu States: పక్షపాతం, పచ్చపాతం, జగన్‌వాదం, కాషాయవాదం లేని మీడియా సంస్థలు కనిపించడం చాలా అరుదుగా మారిపోయిన కాలమిది. ఏ ఛానెల్ చూసినా ఏ న్యూస్ పేపర్ తిరగేసినా భజన, విద్వేషం తప్ప ఏమీ కనిపించని దుస్థితి. జూన్ 4న విడుదలైన ఎన్నికల ఫలితాల రోజూ కూడా కనీస నైతిక జర్నలిస్టు సూత్రాలను మరిచాయి పలు సంస్థలు. ఇందులో తెలుగు మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. నేషనల్‌మీడియాలో అతివాదానికి కేరాఫ్‌గా ఉండే అర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ తరహాలోనే తెలుగు ఛానెళ్లూ తయారయ్యాయి. ఎన్డీఏ మ్యాజిక్ మార్క్ 272 దాటగానే స్డూడియోలో డిబెట్ చేస్తున్న అర్ణబ్ ఒక్కసారిగా ఎగిరిగంతేశాడు.. గట్టిగట్టిగా అరుస్తూ ఆనందపడ్డాడు. క్రికెట్‌లో వికెట్ పడితే బౌలర్ ఎగరిదూకినట్టు దూకాడు. ఆయన ఓ డిబెట్‌ను హోస్ట్ చేస్తున్నాడన్న ఇంగిత జ్ఞానాన్ని మరిచాడు.
View this post on Instagram
హోస్టులా ఘోస్టులా?
నిజానికి నేషనల్‌మీడియాలో ఈ తరహా యాంకరింగ్ చేసేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.. రాహుల్ కన్వల్, నవీతా కుమార్, సుధీర్ చౌదరి, అమన్ చోప్రా, అంజనా లాంటి వారు చాలాసార్లు మీతిమిరి రియాక్ట్ అవుతుంటారు. అయితే ఈ అతివాద యాంకరింగ్ కేవలం నేషనల్‌మీడియాను మాత్రమే కాదు తెలుగు మీడియానూ చిదరుపుట్టిస్తోంది. మీడియా సంస్థలు ఏదో ఒకపార్టీకి పనిచేయడమన్నది సాధారణ విషయమేనైనా అసలు వార్తలు ప్రెజెంట్ చేయడంలో ప్రొఫెషనాలిటీ లేకపోవడం అత్యంత విషాదం. డిబెట్లకు పిలిచి హోస్టులు ఘోస్టులు లాగా ఒక సైడే మాట్లాడడం జర్నలిస్టు విలువలకు పాతరేయడం కాకపోతే మరేమిటి? ఇది చాలా ఏళ్లుగా సాగుతున్నా ఎన్నికల సమయంలో మాత్రం హద్దులు దాటేసిందనే చెప్పాలి.
జనాలూ అంతే:
టీవీ(4+1) సాంబా, సీ(ఏ)బీఎన్ వెంకటకృష్ణ లాంటి వాళ్ల డిబెట్లు చూస్తే వీరంతా హోస్టులా లేక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులానన్న అనుమానం కలుగుతోంది. ఇలా పచ్చమీడియా యాంకర్లు ఎన్నో ఏళ్లుగా వెగటు పుట్టిస్తుంటే తెలుగుమీడియాలో ఎంతో పేరు ఉన్న నంబర్-1, నంబర్-2 న్యూస్ ఛానెళ్లు సైతం తమ యాంకర్లతో జర్నలిస్టు విలువలను మంటగలిపాయి. ముఖ్యంగా టీవీ(3×3) డిబెట్లు రిపబ్లిక్ ఛానెల్‌ను మించిపోవడం అత్యంత బాధకారం. అటు తెలుగుదేశం గెలిచిన తర్వాత పలు ఛానెళ్లు సంబరాలు చేసుకోవడం, ఇటు వైసీపీ అనుకూలిత ఛానెళ్లు కనీసం కూటమి గెలుపును పట్టించుకోకుండా ఉండిపోవడం దుర్మార్గం. ఇదంతా సంబంధిత ఛానెళ్లలో పెత్తనం చెలాయించేవారి వల్ల జరిగిందా లేదా మ్యానేజ్‌మెంట్ పాలసీనే అలా ఉందానన్నది అటు ఉంచితే ఇలాంటి వన్ సైడెడ్ యాంకరింగ్‌లు, డిబెట్ల వల్ల మొత్తం జర్నలిజానికే చెడ్డపేరు. పైగా మీడియా ఇజ్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమాక్రసీ లాంటి బడాయి మాటలు పలుకుతూ ప్రోఫెషనలిజాన్ని మరిచిన ఈ టాప్ ఛానెళ్లను జనాలు సమర్థిస్తూ ఉండడం మరో విడ్డూరం. నిజానికి ప్రజలకు కూడా ఇలాంటి ఛానెళ్లే కావాలి.. తెలుగు దేశం మద్దతుదారైతే పచ్చపాత మీడియా చూస్తారు.. వైసీపీ అభిమానులైతే న్యూట్రల్ ముసుగులో బులుగు వార్తలే ప్రసారం చేసే మీడియా ఛానెళ్లు చూస్తారు. ఇంత బానిసత్వ మైండ్‌సెట్‌లో ఉంటూ మళ్లీ మీడియా విలువల గురించే మాట్లాడే జనాల గురించి చెప్పడానికి మాటలు, పదాలు ఇంకా ఏ భాషలోనూ కనిపెట్టలేదు!
కులోన్మాద ఛానెళ్లు:
అటు జనసేన పార్టీకి ప్రైమ్(3×3)తో పాటు చాలా యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. వీటి ద్వారా ఫేక్ న్యూస్‌లు జనాల్లోకి తీసుకెళ్లడంలో ఈ సంస్థల యాంకర్లు పసుపు, బులుగు యాంకర్లకు ఏ మాత్రం తీసిపోరు. జగన్ ఓటమి తర్వాత ప్రైమ్(3×3) యాంకర్ మాట్లాడిన మాటలు ఓ న్యూస్ ప్రెజంటర్ మాట్లాడినట్టు ఏ మాత్రం లేవు. కులపిచ్చితో ఊగిపోయే ఈ ఛానెళ్లు పైకి మాత్రం కులాల లేని రాజకీయాలంటూ హెచ్చులకు పోతాయి. అటు యూట్యూబ్ ఛానెళ్లు అయితే సరేసరి.. వాటి గురించి ఎంత చెప్పుకున్నా చెప్పాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. అయినా మెయిన్‌స్ట్రీమ్ మీడియానే ఇంతలా దిగజారిపోయిన రోజుల్లో యూట్యూబ్ ఛానెళ్ల నుంచి ప్రోఫెషనలిజం ఆశించడం అత్యాశే అవుతుంది.
Also Read: కరుడుకట్టిన యుద్ధాన్మోది.. హిట్లర్‌కు ఏం తక్కువ కాదు!