Menu

Draupadi: నా మౌనమే మీ అహంకారానికి కారణమా? ఈ తరం ద్రౌపది: ఎవరికి తలవంచని వనిత..!

Lakshmi Aruna 7 months ago
draupadi generation

ఈ సారి ఆమె ఐదుగురికి కాదు… ఒకే ఒక ప్రశ్నకి భార్యగా పుడుతుంది. ఆనాటి ద్రౌపది తిరిగి పుడితే… ఈ సమాజాన్ని ఏమి అడుగుతుంది? తెలుసుకోవాలనుందా…ముందుగా లాంగ్‌ లాంగ్‌ ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం..! పురాణాల్లోని చరిత్రలో.. ఆ ద్రౌపదికి వైభవం ఉంది… కానీ వ్యక్తిగతంగా ప్రశాంతత లేదు. ఐదుగురు భర్తలు ఉన్నా, ఒక్క భర్త ప్రేమగా పక్కన కూర్చోలేని జీవితమది. అయినా ఆమె ఏనాడు ప్రశ్నించలేదు… ఎందుకంటే ఆ కాలంలో ఆమెకు ప్రశ్నించే హక్కే లేదు. కానీ…ఒకవేళ ఈ జన్మలో ద్రౌపది పుడితే?

ఈ సారి ద్రౌపది బట్టలు లాగినవాళ్లను చూస్తూ ఊరుకోదు, “నా మౌనమే మీ అహంకారానికి కారణమా?” అని ప్రశ్నిస్తుంది. అవమానాన్ని ఓనవాలు చెబుతూ జయజాలాలు చెప్పే రాజసభకు ఈసారి ఆమె తన నోట మాటలు కాదు…పలుకుబడి, ధైర్యం, న్యాయం అడుగుతుంది.

ఈ జన్మలో ద్రౌపది పెళ్లి అయిన మూడో రోజే విడాకులు తీసుకుంటుంది, ఎందుకంటే ఆ సంబంధం “బలవంతపు ఒప్పందం” అని గుర్తిస్తుంది కాబట్టి. ఆమె గౌరవం కోసం ఆరంభమైన మహాభారత యుద్ధం…ఈసారి ఆమె దాన్ని అవసరం అనుకోదు. ఆమె కలం.. యుద్ధానికి బదులుగా చైతన్యాన్ని లేవనెత్తుతుంది.

ఈ ద్రౌపది ఒక పత్రికా సంపాదకురాలు అవుతుంది, లేదా జడ్జ్, లేదా మానవ హక్కుల ఉద్యమ నాయకురాలు… ఇలా ఏదైనా కావొచ్చు..ఈ ద్రౌపది అప్పటిలా మౌనంగా కృష్ణుడి కోసం చూడదు. ఎందుకంటే ఈ యుగంలో ఏ కృష్ణుడు రాడు తనని కాపాడటానికి అని తనకు తెలుసు.

నేటి ద్రౌపది సిగ బిగించుకొని కూర్చోదు..ఆ కురులపై చేయి వేసిన వాడి చెయ్యి విరిచే ఒక విప్లవంగా మారింది..తనకు కత్తి అవసరం లేదు.ఒక కలం లేదా గళం చాలు… ఒక సినిమా పాటపై అభ్యంతరం చెప్పినంత మాత్రాన, ఆమెను “సంస్కార హీనురాలు” అంటారేమో…ఒక దుస్తుల ఎంపికపై కామెంట్స్ చేసి, ఆమెను “భారతీయతను తగలబెట్టిందని” ఈ సమాజం తీర్పు ఇవ్వవచ్చు…కానీ ఈ ద్రౌపది వెనక్కి తగ్గదు.

ఎందుకంటే ఈసారి ఆమె రాజసభలో ఒంటరిగా కాదు..ఆమెతో పాటు నిలుస్తారు లక్షల మంది మహిళలు…ఆమె తిరిగి పుడితే… భర్తల కోసం కాదు… సమాజానికి అద్దం చూపడానికి పుడుతుంది. ఒక్కసారి ఆమె మొహం చూస్తే మీ వాదనలు కాదు… మీవంటి వ్యవస్థలే ప్రశ్నలుగా మారతాయి.

ద్రౌపది మళ్ళీ తిరిగి పుడితే… యుద్ధం కాదు, మార్పు కోసం ప్రయత్నం చేస్తుంది. కారణం, ఈసారి ఆమెకు ప్రేమ కాదు… స్వేచ్ఛ తన అవసరం కాబట్టి!

ALSO READ: నువ్వెవరు? ఈ కులాలు, వర్గాలు ఎవరి సృష్టి? నిజంగా దేవుడు ఉన్నాడా?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *