‘World Health ripped us off..’ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎంతో ఆవేశంగా చెప్పిన డైలాగ్ ఇది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీసింది. యూనైటెడ్ నేషన్స్ ఏజెన్సీ అయిన ప్రపంచ ఆరోగ్యం సంస్థ-WHO నుంచి అమెరికా వైదొలుగుతుందని ట్రంప్ ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. WHO చైనా ఆధీనంలో పని చేస్తుందని పాత పాటనే మళ్లీ పాడిన ట్రంప్ ఏకంగా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ ట్రంప్ నిర్ణయంతో నెక్ట్స్ ఏం జరగనుంది? అసలు ట్రంప్ ఎందుకిలా చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లాలి. కరోనా నాటి రోజులను తవ్వి గుర్తుచేసుకోవాలి.
కరోనా కట్టడిలో WHO ఫెయిల్
ఇంతింతై వటుడింతయై అన్నట్టు కరోనా ప్రపంచాన్ని పూర్తిగా కమ్మేసిన రోజులను తలుచుకుంటే ఇప్పటికీ గుండె బరువెక్కిపోతుంది. కరోనా బారినపడి అయిన వారిని, ఆప్తులను కోల్పోయిన వారి బతుకులు ఇంకా చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నాయి. మెడికల్ సైన్స్ దూసుకుపోతున్న ఈ కాలంలోనూ ఓ వ్యాధి 70లక్షల మందిని బలితీసుకుంటుందని కరోనా ముందు వరకు ఎవరూ ఊహించి ఉండరు. ఈ నిందంతా కేవలం వైరస్‌పై వేసేసి చేతులు దులుపేసుకుంటే అది ముమ్మాటికి తప్పే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలను, వ్యాధులను పర్యవేక్షించే బాధ్యత గల వృత్తిలో ఉన్న WHO కరోనా విషయంలో వేసిన అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. అసలు కరోనాను ‘ప్యాండమిక్’గా ప్రకటించడడానికే WHO ఆలస్యం చేసింది. 2020 జనవరి చివరిలోనే కరోనా తీవ్రతపై డాక్టర్లు తీవ్ర హెచ్చరికలు చేసినా WHO మాత్రం మార్చి వరకు ఈ వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించలేదు. వ్యాధి ప్రపంచమంతా విస్తరించిన తర్వాత కానీ WHO నుంచి ఈ ప్రకటన రాలేదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి సరైన సూచనలు ఇవ్వడంలోనూ WHO విఫలమైంది. ముఖ్యంగా సెకండ్‌వేవ్ సమయంలో WHO పనితీరు అనేక సందేహాలకు కారణమైంది. అటు వాక్సిన్ల విషయంలో WHO తీసుకున్న నిర్ణయాలు కూడా విమర్శలు ఎదుర్కొన్నాయి. ఆస్ట్రాజెనికా వాక్సిన్ కారణంగా రక్తం గడ్డకట్టే సమస్యలు కొన్ని సందర్భాల్లో బయటపడ్డాయి. అయినా ఏం టెస్టు చేశారో ఏమో తెలియదు కానీ WHO దీన్ని అత్యవసర వాక్సిన్‌గా గుర్తించడం పట్ల డాక్టర్ల సైతం విమర్శలు గుప్పించిన పరిస్థితి కనిపించింది. ఇదంతా ట్రంప్ నిర్ణయానికి ఓ కారణంగా చెప్పవచ్చు. అయితే ప్రధాన కారణం మాత్రం ఇంకోటి ఉంది. WHO చైనాకు మద్దతుగా నడుచుకుందన్నది ట్రంప్ ప్రధాన వాదన.
WHO అంతకాలం ఏం చేసినట్టు?
కరోనా ఎక్కడ పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవు. మెడికల్ జర్నల్స్‌లో ప్రచురితమైన అధ్యయనాల ప్రకారం కరోనాను ముందుగా చైనాలోని వూహాన్‌లో గుర్తించారు. దీంతో ఈ వైరస్ చైనాలోనే పుట్టిందనే ప్రచారం జరిగింది. అక్కడ మాంసం మార్కెట్ నుంచి జంతువుల ద్వారా మనుషులకు సోకిందనే వాదన ఉంది. ఇందులో నిజనిజాలు ఏంటో తేల్చాల్సిన బాధ్యత కచ్చితంగా WHOపై ఉంటుంది. అటు WHO మాత్రం ఈ అంశంపై దర్యాప్తు చేయడంలో చాలా ఆలస్యం చేసింది. 2019డిసెంబర్‌లో వైరస్ వ్యాప్తి తీవ్రమైతే.. WHO సిబ్బంది చైనాలో పర్యటించింది మాత్రం 2021 జనవరిలో. అంటే 13 నెలల తర్వాత కానీ WHO బృందం చైనాలో అడుగుపెట్టలేదు. అటు వైరస్ మూలాలను గుర్తించేందుకు వచ్చిన WHO టీమ్‌కు చైనా పూర్తిస్థాయి సహకారం అందించలేదన్న ప్రచారం కూడా ఉంది. ఇదంతా చైనాను వ్యతిరేకించే దేశాలు ఎక్కువగా నమ్మే విషయాలు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధమో ఎవరికీ తెలియదు.. కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. కరోనా కట్టడిలో మాత్రం WHO విఫలమైంది. ఇది గణాంకాలు చెబుతున్న నిజాలు. ఇప్పుడు ట్రంప్‌కు ఇవే కారణాలుగా కనిపిస్తున్నాయి. చైనా ద్వేషిగా ముద్రపడ్డ ట్రంప్ WHO నుంచి ఈ నాలుగేళ్లలో ఏదో ఒక రోజు బయటకు వస్తారన్నది అందరూ ఊహించిందే కానీ ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టిన తొలి రోజే ఈ నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోలేదు. ఇక ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రావడానికి ఏడాదైనా పడుతుంది. ఈ నిర్ణయ ప్రభావం చాలా గట్టిగానే ఉంటుంది.
చైనాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్
ఎందుకంటే WHOకి అమెరికా అతి పెద్ద దాత. 2022-23 సంవత్సరంలో WHOకి అమెరికా ఏకంగా 10,622 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. అటు ట్రంప్ నిర్ణయంతో అమెరికాకూ గట్టి దెబ్బ తగలడం ఖాయమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా ఆరోగ్య భద్రతను ట్రంప్ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. CDC, NIH లాంటి అమెరికా ఆరోగ్య సంస్థలు ఎక్కువగా WHO సమాచారంపైనే ఆధారపడి పనిచేస్తుంటాయి. అటు ట్రంప్ మాత్రం ఇవేవీ ఆలోచించకుండా మొండిగా, గుడ్డిగా ముందుగా వెళ్లినట్టు ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ విమర్శిస్తోంది. నిజానికి ట్రంప్ తన మొదటి విడత అధ్యక్ష కాలంలోనే WHOకు ఓ సందర్భంలో నిధులు నిలిపివేశారు. కరోనా సమయంలో WHO నుంచి అమెరికా వైదొలే ప్రక్రియను మొదలుపెట్టారు కూడా. కానీ, బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ రావడంతో పాత పాటే మళ్లీ మొదలైంది. అదే చైనా.. అదే WHO.. అదే ట్రంపూ!