ఓ తల్లి ఇంటి బయట కూర్చొని తన పిల్లలను ఎంతో దీనంగా చూస్తోంది. ఆమె కళ్లెదుట పడి ఉన్న పిల్లల కళ్లలో కన్నీళ్లు ఎండిపోయాయి. కడుపు లోపలికి ఒరిగిపోయి ఉంది. ఏదైనా తినిపించమని పిల్లలు కన్నీళ్లు కారుస్తున్నారు. ఆమె మాత్రం నిరాశగా ఆకాశాన్ని చూస్తోంది. ‘అమెరికా వాళ్లు పంపే ఆహారం కూడా లేకుండా పోయిందా?’ ఈ ప్రశ్న ఇప్పుడు ఈ ఒక్క తల్లి మదిలో మాత్రమే కాదు.. లక్షలాది మంది పేద ఆఫ్రికన్ల మనసును వేధిస్తున్న ప్రశ్న ఇది. వాళ్లు పడుతున్న నరక యాతన ఇది.
కోట్లాది మంది ప్రాణాలకు ముప్పు?
అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని, విధానాన్ని నరనరాన ఎక్కించుకొని అగ్రరాజ్యాన్ని పాలిస్తున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమానవీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధ్యక్ష పదవిలోకి వచ్చిన కేవలం 10 రోజుల్లోనే అమెరికా ఇతర దేశాలకు అందించే సాయం- USAIDని మూసివేయాలని ఆదేశించారు ట్రంప్. 6 లక్షల కోట్లకుపైగా బడ్జెట్ కలిగిన ఈ సహాయ సంస్థను మూసివేయడమంటే… ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజల ఊపిరి తియ్యడమే. ఈ నిర్ణయం ఇప్పటికే కొన్ని రోజులు అమల్లో నడిచింది. కానీ అమెరికా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ట్రంప్ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం పూర్తిగా అమల్లోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా ప్రజలు ఆకలితో ప్రాణాలు విడిచే ప్రమాదం ఉంది. అటు ఫెడరల్ జడ్జి తాత్కాలిక ఆదేశాలపై ట్రంప్ న్యాయపోరాటం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలకు అమెరికా నుంచి అందాల్సిన సాయం నిలిచిపోయింది. ఫెడరల్ కోర్టు ఆదేశాలు తాత్కాలికమే. ట్రంప్ రేపో మాపో USAID సంస్థను పూర్తిగా మూసివేస్తారు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచంలోని కోట్లాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.
కెన్నెడీ నిర్ణయానికి తూట్లు:
USAID అంటే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్..! దీన్ని 1961లో నాటి అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ స్థాపించారు. ఈ USAID లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించడం, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ప్రజలకు బతికే అవకాశం కల్పిస్తున్న దాతృత్వ సంస్థ ఇది. దీని కోసం ప్రతీ ఏటా అమెరికా బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సి వస్తుంది. నాడు కెన్నెడీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆఫ్రికాలోని పేద దేశాలకు 60 ఏళ్లకు పైగా ఆహారం అందుతోంది. ఇప్పుడు USAID నిధులు నిలిపివేస్తే అనేక సహాయ కార్యక్రమాలు నిలిచిపోతాయి. ఉదాహరణకు.. మలావి లాంటి దేశాల్లో USAID నిధులు ప్రభుత్వ బడ్జెట్‌లో 13శాతం ఉంటాయి. ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లో సగానికి పైగా వాటా USAID నుంచే వస్తాయి. ఈ నిధులు లేకపోతే ఆహార సరఫరా ఆగిపోతుంది. హెచ్‌ఐవి నివారణ కార్యక్రమాలు నిలిచిపోతాయి. విద్యా వ్యవస్థపైనా తీవ్రంగా ప్రభావం పడుతుంది.
మూడు నెలల్లో మానవ సంక్షోభం
USAIDని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు నెలల్లో పెను మార్పులు జరుగుతాయి. కెన్యా, నైజీరియా, ఈథియోపియా, యుగాండా దేశాల్లో కోటి 50 లక్షల మంది చిన్నారులు ఆకలితో మరణించవచ్చు. సూడాన్‌లో 50 లక్షల మందికి ఒక్క ముక్క ఆహారం కూడా అందదు. ఆఫ్రికాలోని తీవ్ర పేదరికం 50శాతం నుంచి 80శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఇటు ఆఫ్రికా దేశాల్లోనే కాదు.. ఆసియాలోని పలు దేశాలు కూడా నరకంలో వెళ్తాయి. యెమెన్‌లో ఇప్పటికే 45శాతం ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. USAID లేకపోతే ఈ సంఖ్య 60శాతానికి పైకి పెరుగుతుంది. అమెరికా కేటాయించిన మొత్తం 5 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారం నిలిచిపోతే మూడు నెలల్లోనే ప్రపంచంలోని చాలా దేశాలు స్మశానంగా మారతాయి.
గాజా మరింత దీనస్థితికి?
అటు బాంబుల మోత నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న గాజా ప్రజల దుస్థితి ట్రంప్ నిర్ణయం మరింత చీకట్లలోకి జారేలా చేస్తుంది. ఇజ్రాయెల్-హమాస్ 15 నెలల యుద్ధం కారణంగా గాజాలో 48,189 మంది మరణించారు. ఇందులో 19 వేల మందికిపైగా చిన్నారులు ఉన్నారు. ఇదే సమయంలో USAID సంస్థ మూతపడితే ఇది 15 లక్షల మంది పాలస్తీనియన్ల కడుపును కొడుతుంది. గాజాలో USAID ద్వారా పనిచేస్తున్న 10 ఆస్పత్రులు మూతపడతాయి. ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర మందులు లేకుండా 1,00,000 మందికి పైగా రోగులు మరణించే ప్రమాదం ఉంది. ఇప్పటికే అక్కడి 80శాతం ప్రజలు భవిష్యత్తు గాఢాంధకారంలో మగ్గి ఉంది.
జాతీయవాదం చాటున మరణమృదంగం?
ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ నిర్ణయం మానవత్వాన్ని పూర్తిగా నాశనం చేసే చర్య. అమెరికా ఫస్ట్ విధానం పేరుతో ప్రపంచంలోని అతి పెద్ద మానవత సంస్థను మూసివేయాలని ట్రంప్ నిర్ణయించుకోవడంపై మానవ హక్కుల సంఘాలు, కోర్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సౌతాఫ్రికాలో పుట్టి, అమెరికా పౌరసత్వం పొందిన ఎలన్ మస్క్ మాటలను ట్రంప్ గుడ్డిగా వింటున్నారని.. నిధుల కోత అనే సాకుతో ప్రపంచంలో ఆకలి చావులకు ఆయన కారణం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జాతీయవాదం మాటున పేద ప్రజలు నలిగిపోవడం ఎంతో విషాదం. శతాబ్దాల క్రితం వనరుల కోసం ఆఫ్రికాను దోపిడి చేసిన దేశాలు మరోసారి అదే ఆఫ్రికా ప్రజలను మట్టిలో కలిపేయాలని చూస్తుండడం అత్యంత అమానవీయం!
ఇది కూడా చదవండి: చరిత్రను మరిచిన రష్యా.. చెర్నోబిల్ మరోసారి మృతభూమిగా మారుతుందా?