కొన్ని మరణాలు ఇప్పటికీ మిస్టరీనే..! కొన్ని హత్యలకు సంబంధించిన కుట్రా సిద్ధాంతాలను ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజలు నమ్ముతూనే ఉంటారు. వాటి గురించి సత్యాన్వేషణ చేస్తూనే ఉంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కూడా ఈ లిస్ట్‌లోకే వస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ, అమెరికా మాజీ అటార్ని జనరల్ రాబర్ట్ కెన్నెడీ, పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల కేసులకు సంబంధించిన సీక్రెట్ ఫైల్స్‌ను బహిర్గతం చేస్తానని కుండబద్దలు కొట్టారు ట్రంప్. ఈ నిర్ణయం అమెరికా CIA.. అంటే Central Intelligence Agencyకి ఏ మాత్రం నచ్చలేదు. అటు FBI.. అంటే Federal Bureau of Investigation సైతం ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. దీంతో మరోసారి ఈ హత్యల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ హత్యల వెనుక ఉన్న కుట్రా సిద్ధాంతాలు ఏంటి? ఈ హత్యల్లో CIA పాత్ర ఉందా? అసలు 1960దశకంలో అమెరికాలో ఏం జరిగింది?
అసలు ఆ రోజు ఏం జరిగింది?
1963 నవంబర్ 22.. నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలో ఓపెన్ కారు పరేడ్‌లో పాల్గొన్నారు. ఆయన కారులో ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తుండగా కెన్నెడీపై మూడు రౌండ్ల కాల్పులు జరిగాయి. జనం మధ్యలో ఉన్న క్లాక్ టవర్ నుంచి కాల్పులు జరగగా.. తలపై బుల్లెట్ తగలడంతో కెన్నెడీ అక్కడికక్కడే మరణించారు. లీ హార్వే ఆస్వాల్డ్ అనే వ్యక్తి ఈ హత్య చేశాడని అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఆస్వాల్డ్‌ను కోర్టులో హాజరుపర్చే ముందు, అతను జాక్ రూబీ అనే వ్యక్తి చేతిలో హత్యకు గురవడం సంచలనం రేపింది. దీంతో కెన్నెడీ హత్యపై అనేక అనుమానాలు, కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా కెన్నెడీ హత్యలో CIA ప్రమేయముందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కెన్నెడీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన కొన్ని వర్గాల ప్రజలు CIA మద్దతుతో ఈ మర్డర్ చేశారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కెన్నెడీ తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు, ఆయన నిర్ణయాలు CIAకు వ్యతిరేకంగా ఉండడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అటు కెన్నెడీ హత్యలో మాఫియా హస్తముందన్న ప్రచారం కూడా ఉంది. కెన్నెడీ పాలసీల కారణంగా మాఫియా ఆగడాలకు బ్రేక్ పడిందన్న వాదన ఉండేది. అందుకే మాఫియా లీడర్లు పక్కా ప్లాన్‌తో కెన్నెడీని చంపేశారని నమ్మేవారు కూడా ఉంటారు. అటు క్యుబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో ఈ హత్య చేయించినట్టుగా మరో కుట్రా సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతానికి ఓ బలమైన కారణం కూడా ఉంది.
ఆస్వాల్డ్ మెక్సికోకు ఎందుకు వెళ్లాడు?
1963 సెప్టెంబరులో కెన్నెడీని చంపాడని అభియోగాలు ఎదుర్కొన్న ఆస్వాల్డ్ మెక్సికోకు వెళ్లాడు. అక్కడ క్యూబా, సోవియట్ కాన్సులేట్‌లను సంప్రదించడానికి అతను పదేపదే ప్రయత్నించాడు. అసలు ఆస్వాల్డ్ అక్కడికి ఎందుకు వెళ్లాడో తెలియదు. ఆస్వాల్డ్ మెక్సికో పర్యటన జరిగిన రెండు నెలలకే కెన్నెడీ హత్యకు గురయ్యారు. నిజానికి ఆ సమయంలో కెన్నెడీకి ఫిడెల్ క్యాస్ట్రో అతిపెద్ద శత్రువు. ఎందుకంటే 1961లో ఫిడెల్ క్యాస్ట్రో కొందరిని క్యూబా నుంచి వెలివేశాడు. దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని వారిని దేశం నుంచి బహిష్కరించారు. అమెరికా వీరితో కలిసి క్యూబా దక్షిణ తీరంలో ఉన్న బే ఆఫ్ పిగ్స్‌పై దండయాత్ర చేసింది. అమెరికా సైనికులు ఈ ఆపరేషన్‌లో నేరుగా పాల్గొన్నారు. అయితే ఈ సైనిక చర్య విఫలమైంది. క్యూబానే అమెరికాపై గెలిచింది. కానీ ఆ తర్వాత కూడా క్యాస్ట్రో-కెన్నెడీ మధ్య వైరం కొనసాగింది. ఈ కారణంతోనే ఫిడెల్ క్యాస్ట్రో ఆస్వాల్డ్ సాయంతో కెన్నెడీని చంపేశాడన్న ప్రచారముంది. ఇది బయటపడకూడదనే జాక్ రూబీతో ఆస్వాల్డ్‌ను హత్య చేయించారని నమ్మేవారూ ఉన్నారు.
CIAనే చంపిందా?
ఇక కెన్నెడీ మేనల్లుడు రాబర్ట్ కెన్నెడీ సైతం 1968లో హత్యకు గురయ్యారు. డెమొక్రాటిక్ పార్టీ తరుఫున ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటి చేయాలని ఆయన నిర్ణయించుకున్న కొన్ని రోజులకే ఈ హత్య జరగడం నాడు ప్రకంపనలు రేపింది. పాలస్తీనాకు చెందిన సిర్‌హన్ అనే క్రిస్టియన్ ఈ హత్య చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. అయితే తన తండ్రి హత్య వెనుక CIA ఉందని రాబర్ట్ కెన్నెడీ కుమారుడు ఆరోపించడం సంచలనం రేపింది. తన మావయ్య జాన్, తండ్రి రాబర్ట్‌ను CIAనే చంపేసిందని ఆయన ఆరోపించారు.
రహస్యాలు బయటకు వస్తే CIAకి తిప్పలు తప్పవా?
అటు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యపైనా అనేక కుట్రా సిద్ధాంతాలు ఉన్నాయి. అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలను నడిపిన మార్టిన్ ఏప్రిల్ 4, 1968లో హత్యకు గురయ్యారు. మేమ్ఫిస్ నగరంలోని ఓ హోటల్ బాల్కనీలో ఉన్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌ను జేమ్స్ అనే వ్యక్తి కాల్చినట్టు అధికారులు చెప్పారు. అయితే ఈ హత్య వెనుక నాటి ప్రభుత్వం ఉందని నమ్ముతారు ఆయన మద్దతుదారులు. మార్టిన్‌ను CIA చంపిందని చెబుతుంటారు. మార్టిన్ చేపట్టిన పౌర హక్కుల ఉద్యమం శక్తివంతమవుతోందని భావించి ఆయన్ను చంపారన్న కుట్రా సిద్ధాంతాలు ఉన్నాయి. అందుకే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేస్తానంటున్నారు ట్రంప్. నిజానికి 2017లో ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్ని ఫైల్స్ రిలీజ్ చేశారు. జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించి సీక్రెట్‌గా ఉన్న ఫైళ్లను బయటపెట్టారు. కానీ ఇంకా చాలా ఫైల్స్ బయటపడాల్సి ఉంది. జాతీయ భద్రతా కారణాలతో ఆ ఫైల్స్‌ను గోప్యంగా ఉంచాలని CIA, FBI కోరడంతో ట్రంప్ మరో అడుగు ముందుకు వెయ్యలేకపోయారు. ఈ సారి మాత్రం డాక్యుమెంట్స్ రిలీజ్ ఖాయమని ట్రంప్ చెబుతుండడంతో అందులో ఏం రహస్యాలు ఉన్నాయోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ఇది కూడా చదవండి: అందుకే అమెరికా ఫెడరల్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యున్నతమైనది.. భారతీయ చట్టాలకు, యూఎస్ చట్టాలకు తేడా ఇదే!