Menu

Kamala Harris: కష్టాలు, కన్నీళ్లు.. కమల మనసును ముక్కలు చేసిన ఘటన అదే..!

Praja Dhwani Desk
america elections kamala harris lost

248ఏళ్ల స్వాతంత్ర్యం.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.. ప్రపంచదేశాలకే పెద్దన్న.. అయినా ఇప్పటివరకు ఆ ఒక్కటే లోటు..! దాదాపు రెండున్నర శతాబ్దాల స్వాతంత్ర్య అమెరికాలో ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క మహిళ కూడా అధ్యక్ష పీఠంపై కూర్చొలేదంటే నమ్మశక్యంగా లేదు కదూ? కానీ అదే నిజం. జనవరి 20, 2025న అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఈసారి కూడా మహిళ అధ్యక్షురాలిని అమెరికా చూడలేకపోయింది. 2024 అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటి చేసిన కమలా హ్యారీస్‌(Kamala Harris) గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో.

అమ్మా.. నీకు మాటిస్తున్నా

కమలా హ్యారిస్ భిన్న అస్థిత్వాల కలపోత. తెల్ల జాతీయులను తప్ప ఇతరలను చీడపురుగుల కంటే హీనంగా చూసే అమెరికా సమాజాన్ని ఈ నల్ల కలువ మహిళ తనవైపుకు తిప్పుకోవడానికి పెద్ద యుద్ధమే చేశారు. సామాజిక అడ్డంకులతో పాటు రాజకీయ ప్రత్యర్థులను ఆమె ఎదుర్కొన్న తీరు యావత్‌ ప్రపంచానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా సామాజిక వెనుకబాటుతనంతో వివక్షకు గురవుతూ వివిధ రంగాల్లో రాణించాలని సమాజంతో పోరాడుతున్నవారికి ఆమె గెలుపు ఓ మార్గాన్ని చూపిందనే చెప్పాలి. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీగా ప్రయాణం మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఆమె జర్నీలో ఎన్నో ఆటు పోట్లు ఉన్నాయి. అయినా ఎక్కడా కుంగిపోని ఆత్మవిశ్వాసంతో ఇంత ఎత్తుకు ఎదిగారు. అయితే ఇంత సాధించినా కమలను ఓ విషయం ఎప్పటికీ బాధపెడుతూనే ఉంటుంది.అదే తన తల్లి శ్యామల గోపాలన్ మరణం. శ్యామల లేని లోటును ఆమె చనిపోయి 15ఏళ్లు దాటినా ఇప్పటికీ కమల అనుభవిస్తూనే ఉన్నారు. జీవితంలో కమల ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన రోజులు తన తల్లి చివరి ఘడియలు. క్యాన్సర్‌ బారిన పడి 2009లో తుదిశ్వాస విడిచిన శ్యామల గోపాలన్‌ చివరి క్షణాలు కమలతోనే గడిచాయి. శ్యామల చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆమెకు కమల ఓ ప్రమాణం చేశారు.

తల్లి చివరి కోరిక అదే..

క్యాన్సర్ చికిత్స కోసం పరిశోధనలు చేస్తూ అదే క్యాన్సర్‌ మహమ్మారికి మరణించిన శ్యామల గోపాలన్‌ ప్రపంచానికి ఓ సైంటిస్టుగా సుపరిచితురాలే. రొమ్ము క్యాన్సర్‌లో హార్మోన్ల పాత్ర గురించి అనేక విషయాలు కనుగొన్న శ్యామల గోపాలన్‌ 2009లో పేగు కాన్సర్‌తో చనిపోయారు. ఆమె ఈ లోకాన్ని విడిచే ముందు కూతురికి ఓ మాట చెప్పారు. ఇతరులకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటానని కమల శ్యామలకు ప్రామీస్ చేశారు. ముఖ్యంగా బలహీన వర్గాలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇదే తన తల్లి చివరి కోరిక అని కమల అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ మాటను నిలబెట్టుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానంటారు కమల. 2020లో ఉపాధ్యక్షరాలిగా గెలిచిన తర్వాత కూడా కమల ఈ విషయాలనే తలుచుకోని ఎమోషనల్‌ అయ్యారు.

కష్టాలు, కన్నీళ్లు…

కమల రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో శ్యామల క్యాన్సర్ బారిన పడ్డారు. ఎప్పుడూ దృఢంగా కనిపించే తల్లి క్యాన్సర్ ముదిరే కొద్దీ బలహీనంగా మారడాన్ని కమల ప్రత్యక్షంగా చూశారు. ఇది ఆమెకు చాలా భరించలేనిదిగా ఉండేది. తల్లి ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కమల ఏడవని రోజే లేదు. కష్టాలు, కలలను లోతుగా అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి తల్లేనని కమలకు తెలుసు.అందుకే ఆమె లేని లోకాన్ని ఊహించుకోవడం కమలకు భరించరానిదిగా అనిపించేది. క్యాన్సర్‌ సోకిన కొన్నాళ్లకే శ్యామల కన్నుమూశారు. ఆమె మరణం కమలకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది.

ఫ్యూచర్‌లోనైనా గెలుస్తారా?

కమల తన తల్లి మరణం తర్వాత చాలాకాలంగా ఒంటరిగా ఉండిపోయారు. తనను పూర్తిగా అర్థం చేసుకున్న వారెవరూ లేరనే భావన ఆమెను ఎంతోబాధ కలిగించింది. తల్లితో సన్నిహితంగా ఉన్న రోజుల తలుచుకోని ఒంటరిగా ఏడ్చేవారు. నిజానికి కమల తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే విడాకులు తీసుకున్నారు. కమల, ఆమె చెల్లెల మాయను శ్యామల ఒంటరిగా పెంచారు. అందుకే తల్లి మరణం కమల మనసును ముక్కలు చేసింది. తనలో కొంత భాగాన్ని కోల్పోయినట్లు ఆమెకు అనిపించింది. కొన్నాళ్లకు సాధారణ జీవితంలోకి వచ్చిన కమల ఇప్పటికీ తల్లిని గుర్తుచేసుకుంటూనే ఉంటారు. తల్లే కమలకు స్ఫూర్తి. 1958లో కేవలం 19 ఏళ్ల వయసులో ఉన్నతచదువుల కోసం తమిళనాడు నుంచి అమెరికాకు వెళ్లిన శ్యామల గోపాలన్ బతికి ఉండి ఉంటే కమల మరింత ఆత్మవిశ్వాసంతో ఉండేవారేమో. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న కమలా హ్యారిస్ ఒవెల్ హౌస్ నుంచి భవిష్యత్‌లోనైనా ప్రపంచాన్ని శాసించాలని డెమొక్రాటిక్‌ పార్టీ మద్దతుదారులు కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: కూర్చున్న కొమ్మనే ట్రంప్‌ నరుక్కుంటారా? ఈ భయంకర లెక్కలు చూస్తే మీకే అర్థమవుతుంది!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *