Donald Trump Birthright Citizenship Updates: వాళ్లంతా 20ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు.. చట్టబద్ధంగా రెండు దశాబ్దాల పాటు ట్యాక్సులు కట్టారు.. ప్రతీది న్యాయబద్ధంగానే చేశారు.. వారి పిల్లలు 20ఏళ్ల పాటు అక్కడే చదువుకున్నారు.. కానీ ఆ పిల్లలు 21వ సంవత్సరంలో అడుగుపెట్టగానే వారిని దేశం విడిచి పొమ్మంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న బర్త్రైట్సిటిజన్ షిప్ రద్దు నిర్ణయానికి ఒక్క మాటలో చెప్పే ఉదాహరణ ఇది. ఎంత అన్యాయమో కదా? 20ఏళ్ల పాటు అమెరికా ఆర్థికవ్యవస్థ ఎదుగుదలకు కీలకంగా ఉన్న కుటుంబాలను ఒక్క సంతకంతో తరిమేస్తారా? అందుకే ఒక మాట అంటారు.. ‘Legal does not mean fair…’ అని..! అవును..! చట్టాలు న్యాయంగా ఉండాలని లేదు.. న్యాయంగానే చట్టాలు చేయాలన్న రూలూ లేదు. ఏ దేశ ప్రయోజనాలు ఆ దేశానికి ఉంటాయి కానీ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం వెన్నుపోటుకు ఏ మాత్రం తక్కువ కాదన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ట్రంప్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఇది కొన్నాళ్లు కోర్టుల్లో నలిగే అంశమని చెప్పవచ్చు.
అంతా అయోమయం.. గందరగోళం
అమెరికాలో H-1B, L-1 వీసాలపై పనిచేస్తున్న భారతీయుల జీవితాలు, వారి పిల్లల భవిష్యత్తు ట్రంప్ నిర్ణయంతో గందరగోళంలో పడిపోయాయి. బర్త్రైట్సిటిజన్షిప్ రద్దుతో ఇకపై వర్క్ వీసాలపై ఉన్న వారికి పిల్లలు పుడితే ఆ బిడ్డలకు అమెరికా పౌరసత్వం రాదు. ట్రంప్ ఆదేశాల ప్రకారం.. వర్క్ వీసాపై ఉన్న వ్యక్తుల పిల్లలు 21 సంవత్సరాల వయసు వరకు వారి తల్లిదండ్రుల వీసాపై అమెరికాలో నివసించవచ్చు. కానీ 21 సంవత్సరాల తరువాత, వారి పిల్లలకు అమెరికాలో నివసించే హక్కు ఉండదు. పౌరసత్వం లేకుండా తల్లిదండ్రులతో కలిసి ఉండేందుకు ఇకపై అనుమతి ఉండదు. తల్లిదండ్రులకు గ్రీన్ కార్డు(Green Card) ఉండాల్సిందే. లేదా ఆ పిల్లలు అమెరికా విడిచి వెళ్లాల్సిందే. అంటే ఓ కుటుంబం విడిపోయే పరిస్థితి ఇది. నిజానికి ట్రంప్ ఆదేశాలకు ముందు అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలకు అక్కడి పౌరసత్వం లభించేది. పిల్లల పౌరసత్వం ద్వారా ఆ తర్వాత తల్లిదండ్రులు ఈజీగా పౌరసత్వం తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు పౌరసత్వం ఉంటేనే పిల్లలు అక్కడ జీవించగలరట. ఈ నిబంధన ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి రానుంది.
కుటుంబాలను విడదీస్తారా?
నిజానికి అమెరికన్ సిటిజన్‌సిప్ పొందడం చిన్న విషయం కాదు. ఇప్పటికే 10లక్షల మందికి పైగా భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నారు. ట్రంప్ ఆదేశాలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇక 2030 నాటికి 21 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉండే పరిస్థితులు ఉంటాయని ఓ అంచనా. H-1B వీసాదారుల్లో 72శాతం మంది భారతీయులే ఉంటారు. వీరందరికి పౌరసత్వం లభించకపోతే వారి కుటుంబాలు నాశనం అవుతాయి. ఎందుకంటే H-1B వీసా కాలపరిమితి మొత్తం 6 సంవత్సరాలు. ఆ తర్వాత వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా చివరకు గ్రీన్‌కార్డు రాకపోతే పరిస్థితి ఏంటి?. ఒకవేళ గ్రీన్‌కార్డు రాకపోతే అంతకాలం అమెరికాలోనే పుట్టి పెరిగిన పిల్లలు 21ఏళ్ల తర్వాత దేశం విడిచివెళ్లాల్సి ఉంటుంది. ఇది ముమ్మాటికి మోసమేనన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఆ 20ఏళ్ల పాటు ఆ పిల్లల తల్లిదండ్రులు ప్రత్యక్షంగా అమెరికాకే పనిచేస్తున్నట్టు లెక్కా. అమెరికాలో H-1B వీసాదారుల సగటు వేతనం కోటి 20 లక్షల రూపాయలు. సుమారుగా 5 లక్షల 40 వేల మంది భారతీయులు H-1B వీసాలపై అమెరికాలో ఉన్నారు. అంటే మొత్తం వేతనాల సగటు సుమారు 6 లక్షల 48 వేల కోట్ల రూపాయలు. వీరు తమ వేతనాల్లో సుమారు 30శాతం పన్నుల రూపంలో చెల్లిస్తారు. అంటే లక్షా 94 వేల కోట్ల రూపాయలను కేవలం H1B వీసాదారులే ట్యాక్సుల రూపంలో అమెరికాకు చెల్లిస్తున్నారు.
అంతకాలం చేసిన సేవ దండగేనా?
అటు సిలికాన్ వ్యాలీలో 50శాతం స్టార్టప్‌లను స్థాపించింది ఇండియన్సే. ఈ కంపెనీలు సంవత్సరానికి సుమారుగా 81 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అటు భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి ప్రతి ఏడాది సుమారు 2 లక్షల 50 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. హాస్టల్, విద్య, ఇతర ఖర్చులను కలుపుకుని ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతగానే మేలు చేస్తోంది. ఇక H-1B వీసా ప్రాసెసింగ్ ఫీజు ప్రతి వ్యక్తికి సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుంది. 5 లక్షల 40 వేల మంది భారతీయ H-1B వీసాదారుల నుంచి వీసా ప్రాసెసింగ్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బులు అక్షరాల 44 వేల కోట్ల రూపాయలు. అటు అమెరికాలోని టెక్నాలజీ రంగంలో 40శాతం మంది భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉన్నారని అంచనా. ఈ రంగం నుంచి వార్షికంగా ఉత్పత్తి అయ్యే GDP దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఇందులో భారతీయుల వాటా సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు. కేవలం ఇవి మాత్రమే కాదు. ఇండియన్ డాక్టర్లు, రియల్టర్ల రూపంలో అమెరిక ఖాజానా భారీగానే నిండుతోంది. అందుకే ట్రంప్ తీసుకున్న బర్త్రైట్సిటిజన్షిప్ రద్దు నిర్ణయం అనైతికమన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: