Menu

Moun Modi vs Manmohan Singh : మీడియా స్వేచ్ఛ.. 10ఏళ్ల పాటు మౌనవ్రతం పాటించింది ఎవరంటే?

Tri Ten B
no press meet by narendra modi

Difference Between Modi and Manmohan: ప్రపంచంలో ఎవరైనా విమర్శకు అతీతులు కాదు. అందులోనూ ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే ఇండియాలో ఎవరికైనా విమర్శించే హక్కు ఉంటుంది. ఆ విమర్శ హేతుబద్దంగా ఉందా లేదా అన్నది తర్వాతి విషయం. అసలు ప్రశ్నించే హక్కే లేకపోతే అది ప్రజాస్వామ్య దేశం ఎలా అవుతుంది? ప్రశ్నించేవారిని జైల్లో పెడితే ఏం అనాలి? మీడియా గొంతును నొక్కితే అది అటోక్రసీనో.. కమ్యూనిస్టుల పాలనో అవుతుంది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాలో అసలు ఏ పాలన ఉందో అర్థంకాని దుస్థితి దాపరించింది. మరి అంతకుముందు 10ఏళ్లలో ఇండియాలో పత్రికా స్వేచ్ఛ ఉందా? కచ్చితంగా ఉంది.. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా మీడియా పని చేసింది. మన్మోహన్‌ ప్రభుత్వం మీడియా ప్రశ్నలకు జవాబులు చెప్పేది. విమర్శలు భరించేది.. ఇప్పుడా పరిస్థితి లేదు..! ఇటివలీ 33ఏళ్ల రాజ్యసభ జీవితానికి ముగింపు పలికిన మన్మోహన్‌ గురించి ఎన్నో విషయాలను మేధావులు, సామాన్యులు, విశ్లేషకులు పంచుకున్నారు కానీ పత్రీకా స్వేచ్ఛ లైన్‌ను టచ్‌ చేసిన వారు తక్కువ!


పేరాగ్రాఫ్, లైన్ టు లైన్‌ ఎన్‌కౌంటర్:
మొన్నామధ్య అమిత్‌షా కొత్త క్రిమినల్‌ చట్టాలను ప్రవేశపెట్టారు. వాటి గురించి మీడియాలో వచ్చిన విశ్లేషణలు చాలా తక్కువ.. ఏ చట్టమైనా లూప్‌హోల్స్‌ లేకుండా ఉండదు. మోదీ ప్రభుత్వం చేపట్టిన చట్టాలు అందుకు మినాహాయింపు కాదు. అయితే వాటి గురించి వివరించే ఎనలిస్టే లేడు. ఎందుకంటే వాటి గురించి చెప్పనివ్వరు.. మీడియా సంస్థలన్ని బీజేపీ అండర్‌లోనే ఉంటే ఎలా చెప్పగలరు? మరి మన్మోహన్‌ పాలనలో ఇలానే ఉందా అంటే లేదు. ఇండో-అమెరికా అణు ఒప్పందంలోని పలు వివాదాస్పద అంశాలను నాడు మీడియా పూసగుచ్చినట్టు నివేదించింది. పలువురు కాలమిస్టులు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒప్పందంలోని ప్రతి పేరాగ్రాఫ్, లైన్ టు లైన్‌ చర్చించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం అణు ఒప్పందం విషయంలోనే కాదు.. ఇతర ప్రధాన విధానాల విషయంలోనూ పత్రీకా స్వేచ్ఛ కనపడేది.

ముఖమే లేని పీఎంఓ:
ప్రధానమంత్రి కార్యాలయానికి, కాంగ్రెస్ సంస్థకు మధ్య ఉన్న సంబంధాల గురించి మన్మోహన్‌ పాలనలో అంతులేని కవరేజీ ఉండేది. సంజయ బారు ద్వారా మన్మోహన్‌కు మీడియా ఫ్రెండ్లీ ప్రెస్ అడ్వైజర్ ఉన్నారు. సంజయ బారు పాత్రికేయులతో నిత్యం టచ్‌లో ఉండేవారు. తన కార్యాలయంలో మీడియా కోసం ఓ ఓపెన్‌ హౌస్ కూడా ఉంది. మీడియాతో మాట్లాడేందుకు నాటి మంత్రులు ఎవరూ భయపడేవారు కాదు. వివిధ మంత్రులు, రాజకీయ పార్టీల పెద్దలతో మీడియా సంభాషణలు స్వేచ్ఛగా సాగేవి. ఇప్పుడా పరిస్థితి లేదు.. అసలు పీఎంఓ లో మనుషులు ఉన్నారా రోబోలు ఉన్నాయా అని అనుమానం వస్తోంది. ఎందుకంటే వారి ముఖాలు మీడియాకు కూడా తెలియవు.

నాడు 24గంటల కవరేజీ.. నేడు 24గంటలు భజన:
ఇక ఉద్యమాలు, నిరసనల విషయానికి వద్దాం.. మన్మోహన్-2 హయంలో కాంగ్రెస్‌పై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిరసనలు పెల్లుబికిన సందర్భాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది 2011లో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం. ఈ ఉద్యమం పతాకస్థాయికి చేరి చివరకు యూపీఏ ప్రభుత్వ పతనానికి కారణమైన తొలి మెట్టుగా నిలిచింది. ఇలా కాంగ్రెస్‌ ప్రభుత్వ ఉద్యమాలు సామాన్యుల వరకు చేరాయంటే నాడు మీడియా కవరేజీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మన్మోహన్‌ మీడియాను ఏనాడు అడ్డుకోలేదు. కానీ మోదీ పాలనలో ప్రభుత్వ విధానాలను మీడియా విమర్శించడం చాలా అరుదుగా మారింది. రాజకీయ పరిణామాలపై నిజాయితీగా నివేదించడాన్ని పత్రికలు మరిచాయి. అలా మరిచిపోయేలా చేశారు విశ్వగురువు. తాజాగా ఎలక్టోరల్‌బాండ్ల గురించి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా మీడియా మాత్రం దీని విషయంలో సాఫ్ట్‌గా వ్యవహారించింది. కొన్ని మీడియా ఛానెల్స్‌ అయితే అసలు ఇదే న్యూసే కాదని.. దీనికి వ్యూస్ రావని సబ్‌ఎడిటర్ల చేతులు కట్టేశాయి కూడా.

ఇంతకీ ఎవరు మౌనవ్రతం చేశారు?
ఇక మన్మోహన్‌ను నిత్యం మౌన్‌మోహన్‌ అని బీజేపీ నేతలు ఎగతాళి చేస్తుంటారు. నిజానికి మన్మోహన్‌ మౌన్‌మోహన్‌ కాదు.. ఆయన మౌనమూనీ.. వాస్తవానికి మౌనవ్రతం చేసింది మన్మోహన్‌ కాదు మన 56 ఇంచుల ఛాతీ వీరుడు. మన్మోహన్ సింగ్ స్వయంగా మీడియాను ఎదుర్కోవడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. లెక్కలేనన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. ఆయన్ను ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధించిన మీడియా రిపోర్టర్లకు ఓపిగ్గా, చాకచక్యంగా, నిజాయతీగా సమాధానాలు చెప్పారు. ఇటు మోదీ మాత్రం ఇప్పటివరకు ఒక ప్రెస్‌మీట్‌ కూడా పెట్టలేదు. ఎందుకో మోదీకి మీడియా ప్రశ్నలంటే భయం.. దాదాపు మొత్తం మీడియా ఆయన అండర్‌లోనే ఉన్నా మోదీ మాత్రం ప్రెస్‌మీట్‌ పెట్టరు.. అయినా కానీ మన్మోహనే మౌన్‌మోహన్‌.. మోదీ కాదు.. ఇది నమ్మాలంతే.. లేకపోతే ఏ పాకిస్థాన్‌కో, అఫ్ఘానిస్థాన్‌కో పోండి..మరో మాట లేదు!

Also Read: మోదీని భయపెట్టిన ఒకే ఒక్కడు..! కేజ్రీవాల్‌ అంటే కాషాయ పార్టీకి అందుకే వణుకు..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *