Delhi election analysis Telugu:
ఢిల్లీ ఎన్నికల యుద్ధంలో బీజేపీ ఘన విజయం సాధించింది. కమలం వేసిన ఎత్తులకు అరవింద్ కేజ్రీవాల్ చిత్తయ్యారు. 2015 నుంచి ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ-ఆప్‌ను హస్తినా ప్రజలు ఈ సారి తిరస్కరించారు. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీని బీజేపీ హస్తగతం చేసుకుంది. ఇంతకి బీజేపీ గెలుపుకు కారణాలేంటి? ఆప్ ఓడిపోవడానికి కారణాలేంటి? ముందుగా బీజేపీ గురించి చెప్పుకుంటే కమలం పార్టీ గెలుపుకు ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.
1) ఢిల్లీలో బీజేపీ గెలుపుకు ప్రధాన కారణం మహిళా ఓటర్లను ఆకర్షించడం. మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించే ‘మహిళా సమృద్ధి యోజన’ను ప్రకటించడం గేమ్ ఛెంజర్‌గా చెప్పవచ్చు. అటు గర్భిణీలకు 21,000 రూపాయలుచ ఆరు పోషక కిట్లు అందించే ‘మాతృ సురక్ష వందన’ పథకాన్ని ప్రతిపాదించింది బీజేపీ. ఈ పథకాలు మహిళా ఓటర్లను ఆకర్షించాయి.
2) ఇక బీజేపీ గెలుపుకు రెండో ఫ్యాక్టర్‌గా అవినీతి అంశం నిలుస్తోంది. ఈ నాలుగేళ్లలో ఆప్ నాయకులు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్‌పై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. బీజేపీ ఈ అవినీతి ఆరోపణలను ప్రచారంలో ప్రాముఖ్యతనిచ్చింది. ఇది ప్రజలకు ఆప్‌పై నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది.
3) అటు కేంద్ర పథకాలను ఢిల్లీలో అమలు చేస్తామని బీజేపీ హామీ ఇవ్వడం కమలం పార్టీకి ప్లస్‌గా మారింది. బీజేపీ తన మేనిఫెస్టోలో కేంద్ర పథకాలను లిస్ట్ చేసి పెట్టింది. ఇందులో ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు కూడా ఉన్నాయి. ఇవి అమలు చేస్తే తమకు మెరుగైన ఆరోగ్య సేవలను అందుతాయని ప్రజలు నమ్మి ఓట్లు వేశారు.
4) ఇక ఏ పార్టీ గెలుపులైనా ప్రధాన పాత్ర పోషించేది మేనిఫెస్టోనే! బీజేపీ తన మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, , పేదల కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించింది. అటు నిరుపేద మహిళలకు పెన్షన్ పెంపు, ఎల్పీజీ సిలిండర్ల సబ్సిడీలు, మురికివాడల్లో 5 రూపాయలకే భోజనం అందించే ‘అటల్ కాంటీన్లు’ లాంటి పథకాలను మేనిఫెస్టోలో పెట్టింది.
5) ఇటు ఢిల్లీపై బీజేపీ పట్టుకు ఐదో కారణం పోల్ మేనేజ్‌మెంట్. 27ఏళ్లగా ఢిల్లీ గద్దెకు దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు పోల్ మేనేజ్‌మెంట్‌ను పటిష్టంగా నిర్వహించింది. మైక్రోలెవల్లో ఇంటింటికీ పార్టీ కార్యకర్తలు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించి ప్రచారం చేయడంతో ఆ పార్టీకి కలిసి వచ్చింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే RSSతో పాటు ఢిల్లీ పరివార్ అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఢిల్లీలోని పలు కాలనీల్లో, మురికివాడ ప్రాంతాల్లో పర్యటిస్తూ వేలాదిగా చిన్న చిన్న సమావేశాలను నిర్వహించి ప్రజలకు చేరువవడం బీజేపీకి ప్లస్‌గా మారింది.
———————–
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కూడా ఐదు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.
———————–
1) ఆప్ ఓటమికి ప్రధాన కారణాలు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న అవినీతి మరకలు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం, డిప్యూటీ సీఎం నుంచి వరుసగా ఎమ్మెల్యేలు జైలు బాటపట్టారు. అటు సీఎం బంగ్లా శీష్ మహల్ అవినీతి అంశాన్ని కూడా బీజేపీ అస్త్రాలుగా చేసుకోవడంతో ఆప్‌కు గట్టి దెబ్బపడింది.
2) ఇక ఏ పార్టీ అయినా స్థానిక సమస్యలను పట్టించుకోకపోతే ఆ పార్టీ కచ్చితంగా ఓడిపోతుంది. ఆప్ కూడా అదే తప్పు చేసింది. ప్రజాకర్షణ పథకాలతో ఆప్‌కు పేద మధ్య తరగతి వర్గాల్లో ప్రజాదరణ ఉన్నా స్థానిక సమస్యలు ఆ పార్టీకి నష్టాన్ని కలిగించాయి. తాగు నీటి కొరత, పాడైన రహదారులు, ప్రజా రవాణాలో పలు సమస్యలను ఆప్ పట్టించుకోలేదు.
3) అటు సీఎం ఎంత మంచివాడైనా ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకపోతే ఆ పార్టీకి ఓటమి తప్పదు. ఆప్ ఎమ్మెల్యేలపై అనేక నేరారోపణలు ఉన్నాయి. కొంతమంది లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. నియోజకవర్గాల వారిగా విఫలమైన ఆప్ ఎమ్మెల్యేలపై పనితీరుపై ‘చార్జీ షీట్లు’ పేరిట బీజేపీ పత్రాలు పంచింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత రెట్టింపయ్యింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ ఒత్తిడితో కేసులు బనాయించి తమ నేతలను వేధిస్తుందని ఆప్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి సానుభూతి పొందేందుకు ప్రయత్నించినా ప్రజలు మాత్రం వారిని నమ్మలేదు.
4) అటు కాంగ్రెస్, ఆప్ వైరం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. INDIA గ్రూపులో ఆప్, కాంగ్రెస్ పార్టీలు కలిసే ఉన్నాయి. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో ఆప్‌కు నష్టం కలిగింది. ఆప్‌కు వెనుదన్నుగా నిలుస్తున్న ముస్లిం, దళిత ఓట్లను కాంగ్రెస్ చీల్చింది.
5) అటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సక్రమంగా అమలు చేయడంలో ఆప్ విఫలమైంది. అటు పార్టీ కార్యకలాపాల్లో పారదర్శకత లేకపోవడం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది.