Menu

Cyclone Ditwah: బంగాళాఖాతంలో మరో తుఫాను? ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు తప్పదా?

Praja Dhwani Desk 2 months ago
cyclone ditwah updates

బంగాళాఖాతం(Bay of Bengal)లో కొత్త తుఫాను(Cyclone) రూపం దాల్చబోతుందనే వార్తతో తమిళనాడు(Tamilnadu), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) తీర ప్రాంతాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఇప్పటికే సెన్యార్ తుఫాను బలహీనపడుతూ ఉండగా ఇప్పుడు డిట్వా(Ditwah) అనే కొత్త తుఫాను భయాన్ని రేపుతోంది. దక్షిణ పశ్చిమ బంగాళాఖాతం, శ్రీలంక(Srilanka) తీరానికి దగ్గరగా ఉన్న అల్పపీడనం బలపడి లోతైన అల్పపీడనంగా మారింది. ఈ వ్యవస్థ మరికొన్ని గంటల్లోనే పూర్తి స్థాయి తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో బలమైన గాలులు, పెద్ద పెద్ద అలలు, రాత్రివేళల వర్షాలు ఒకేసారి రావచ్చని చెబుతున్నారు.

ఈ తుఫాన్ ఎక్కడా తీరానికి తాకుతుంది? ఏ రోజున గట్టిగా ప్రభావం కనిపిస్తుందన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల్లో డిట్వా ప్రభావం గట్టిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలి వేగం గంటకు సుమారు 80 నుంచి 90 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది.

సెన్యార్‌ సంగతేంటి?

వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం ఈ అల్పపీడనం ప్రస్తుతం శ్రీలంకకు దగ్గరగా బలపడుతూ ఉంది. ఇది కొంత కాలం అక్కడే తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఇది భారత తీర ప్రాంతాల వైపు కదిలే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం ఈ తుఫాను నవంబర్ 29 నాటికి తమిళనాడు పుదుచ్చేరి తీరానికి దగ్గరగా రావొచ్చు. అందుకే ప్రభుత్వం ముందుగానే ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదే సమయంలో మరో తుఫాను అయిన సెన్యార్ ఇప్పటికే బలహీనపడిపోయింది. ఇది మలక్కా జలసంధి దగ్గర మొదలై ఇప్పుడు చాలా బలహీన స్థాయిలో తూర్పు వైపు కదులుతోంది. అయినప్పటికీ అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని చోట్ల ఇది ఇంకా వర్షాలు ఇవ్వవచ్చని అధికారులు భావిస్తున్నారు. వరుసగా రెండు తుఫాన్లు రావడం వలన అక్కడి ప్రజలు మానసికంగా కూడా ఒత్తిడిని అనుభవిస్తారు.

బంగాళాఖాతంలో తుఫాన్లు ఎందుకు?

ఇక బంగాళాఖాతం ఎందుకు తరచుగా తుఫాన్లు ఏర్పడే ప్రాంతంగా మారుతుందో చాలామంది ఆశ్చర్యపోతారు. దీనికి కారణం బంగాళాఖాతం నీరు ఎక్కువ వేడి ఉండడం. నీరు వేడిగా ఉంటే పైకి ఎగిరే గాలి బలంగా తయారవుతుంది. ఆ గాలి లేచిన చోట తక్కువ పీడనం ఏర్పడుతుంది. చుట్టుపక్కల ఉన్న గాలి ఆ తక్కువ పీడన స్థలానికి చేరడానికి ప్రయత్నిస్తుంది. ఇలా గాలి చుట్టూ తిరుగుతూ బలపడితే అది తుఫాను రూపం దాల్చుతుంది. అదనంగా ఈ ప్రాంతంలో నదులు సముద్రంలో కలిసే చోట ఎక్కువ తేమ ఉంటుంది. రుతుపవనాలు కూడా ఇక్కడ బలంగా మారుతాయి. అందువల్ల ప్రతి సంవత్సరం బంగాళాఖాతంలో ఒకటి లేదా రెండు తుఫాన్లు రావడం సహజం.

మొత్తానికి డిట్వా తుఫాను బంగాళాఖాతంలో త్వరగా బలపడుతున్నందున ప్రజలు ప్రభుత్వం చెప్పే సూచనలు తప్పకుండా పాటించాలి. ఇపుడు సమాచార సాంకేతికత బాగా అభివృద్ధి చెందడంతో ముందుగానే సమాచారం అందుకుంటున్నాం. సముద్రతీర గ్రామాలు, పట్టణాల్లో ఉండే ప్రజలు ఏ చిన్న మార్పు కనిపించినా ముందుగానే జాగ్రత్త పడాలి. తుఫాను రావడం ఆపలేము కానీ జాగ్రత్తలు తీసుకుని నష్టం తగ్గించుకోవచ్చనే నిజాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

ALSO READ: షేక్‌.. షేకాడిస్తోంది.. నెల రోజుల్లో 1400 భూకంపాలు.. ఆ దేశానికి ఏమైంది?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *