సాయంత్రం ఆకాశం నెమ్మదిగా చీకటి రంగు పులుముకుంటోంది. ఆఫీస్ గేట్ బయటకు అడుగు పెట్టగానే కారుణ్యకి ఒక్క క్షణం ఊరట వచ్చింది. రోజంతా పని… మీటింగ్స్… మాటల మధ్య గడిచిపోయింది. ఇప్పుడు తను వెళ్ళాలి తనకోసం కాదు తన పిల్లల కోసం. రోజంతా ఆఫీసు అలసటలో తనకంటూ ఏదైనా ఊరట ఉంది అంటే తన ఇల్లు.. పిల్లలే.
స్కూటీ స్టార్ట్ చేస్తూ “ఇంకో పది నిమిషాల్లో ఇంట్లో ఉంటాను” అని మనసులోనే అనుకుంది. హెల్మెట్ పెట్టుకుంది. ఫోన్ పాకెట్లో పెట్టుకుంది. రోడ్డుపైకి దూసుకెళ్లింది.
బైక్‌పై వెళ్తున్నప్పుడు కారుణ్య ఎప్పుడూ హడావుడిగా ఉండదు. గాలిని ఆస్వాదిస్తూ, చుట్టూ జరుగుతున్నదంతా గమనిస్తూ వెళ్తుంది. ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు ఆకాశం వైపు చూసింది. రంగురంగుల పతంగులు. చిన్నపిల్లల అరుపులు. పండుగ వాతావరణం. ఆ దృశ్యం చూసి ఆమె పెదవులపై చిన్న నవ్వు వచ్చింది. జీవితం ఇంత సింపుల్‌గా ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంది. అది ఆమె చేసిన చివరి ఆలోచన.
ఒక్కసారిగా… ఏమీ అర్థం కాకముందే… మెడ దగ్గర గట్టిగా ఏదో తగిలిన ఫీలింగ్. నొప్పి కూడా రాకముందే శ్వాస ఆగినట్టైంది. బైక్ హ్యాండిల్ చేతుల్లోంచి జారిపోయింది. రోడ్డుపై పడిపోయింది. చుట్టూ ఉన్నవాళ్లకు మొదట ఇది చిన్న యాక్సిడెంట్‌లా కనిపించింది. కానీ దగ్గరికి వెళ్లాక వాళ్లకు మాటలు రాలేదు. మెడ దగ్గర రక్తం. చాలా లోతైన గాయం.
అది ప్రమాదం కాదు. అది ఒక దారం చేసిన దాడి. చైనా మాంజా. కత్తిలా పదునైన ఆ దారం, గాజు పొడితో పూసి ఉండే ఆ సన్నని తాడు, ఒక్క సెకన్లో కారుణ్య జీవితం ముగిసేలా చేసింది. ఆమె చేసిన తప్పేమీ లేదు. ఆమె స్పీడ్‌లో లేదు. ఆమె రూల్స్ బ్రేక్ చేయలేదు. ఆమె పాపం కేవలం ఆ రోడ్డుపై ఆ సమయంలో ఉండడమే. ఆమె ఫోన్ ఇంకా పాకెట్లోనే ఉంది. ఇంట్లో అమ్మకోసం ఎదురు చూసే పిల్లలు. “ఏంటి అమ్మ బయల్దేరిందా?” అని ఫోన్ చూస్తోంది తన గారాల పట్టి. కాల్ రావడం లేదు. మెసేజ్ రావడం లేదు. రాత్రి అయ్యే సరికి ఆ ఇంట్లో నిశ్శబ్దం పెరిగింది. చివరికి పోలీస్ కాల్ వచ్చింది. ఆ ఒక్క కాల్… ఒక కుటుంబ జీవితాన్ని శాశ్వతంగా చీల్చేసింది. అమ్మ ఇక రాదు.
ఇలా కారుణ్య ఒక్కరే కాదు. ప్రతి ఏడాది ఇలానే ఎంతోమంది. బైక్‌పై వెళ్లే యువకులు. స్కూటీపై వెళ్లే అమ్మాయిలు. సైకిల్‌పై స్కూల్‌కు వెళ్లే పిల్లలు. ఎవరికీ తెలియకుండానే ఈ చైనా మంజా వాళ్ల జీవితాల్లోకి చొరబడుతుంది. ఒక ఆటగా మొదలైన విషయం… ఒక అంత్యక్రియగా ముగుస్తుంది. మనుషులే కాదు. పక్షులు కూడా. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే ఒక పిచ్చుక… ఒక పావురం… ఆ దారానికి చిక్కుకుంటుంది. రెక్కలు తెగిపోతాయి. ఎగరలేక, అరవలేక, నెమ్మదిగా ప్రాణం వదులుతాయి. ఆ దృశ్యాన్ని చూసి కూడా మనం మౌనంగా ఉంటే… మనిషిగా మనం ఏం కోల్పోతున్నాం?
చైనా మంజా నిషేధించబడింది. చట్టం ఉంది. శిక్ష ఉంది. కానీ అమలు లేకపోతే ఆ చట్టం కేవలం కాగితమే. సరదా కోసం మనం పట్టుకున్న ఆ దారం… ఎవరో ఒకరి జీవితాన్ని శాశ్వతంగా ముగించే ఆయుధం అవుతుందని ఆలోచించట్లేదు.
ఈ స్టోరీ చదివే మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి. పతంగులు ఎగురవేయడం తప్పు కాదు. కానీ ప్రాణాలు తీసే దారంతో కాదు. ఒక దారం వల్ల ఇంకరి కుటుంబం కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఇంకో ఇంట్లో ఆ ఫోన్ మౌనంగా మోగకూడదు. కారుణ్య కథ మనకు ఒక హెచ్చరిక. ఇది కథలా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. ఈ రోజు ఆమె. రేపు ఇంకెవరో.
ఆ దారం మీ చేతిలో ఉంటే… అది ఒక ఆట కాదు. అది ఒక బాధ్యత.
ప్రాణాలు తీసే మంజా ఆటలు మనకి వద్దు. ఒకరి కన్నీళ్లకు మనం కారణం కావొద్దు.
ALSO READ: సికింద్రాబాద్‌లో మొదలైన జార్జ్ నిశ్శబ్ద విప్లవం.. ఆకలిని గౌరవంగా ఎదుర్కొన్న ఒక ఆలోచన!
