భారీ వర్షాలు, వరదలతో చైనా మరోసారి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా చైనాను వరదలు ముంచెత్తాయి. చైనాలో కుండపోతకు దాదాపు 30 మంది మరణించారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వేలాది మంది వరదల్లో చిక్కుకున్నారు. కొన్ని ప్రాంతాలలో కేవలం 24 గంటల్లో 645 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. దీంతో జిక్సింగ్ నగరం నుంచి 11,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఓవైపు ఎండ.. మరోవైపు వాన:
నిజానికి గత నెల జులై అంతటా చైనా వేడి గాలులతో చెమటలు కక్కింది. ఎండవేడి తట్టుకోలేక ప్రజలు విలవిలలాడారు. 1961 తర్వాత ఈ జూలైలో నమోదైన ఉష్ణోగ్రత చైనాలో అత్యధికం. అయితే జులై చివరి నాటి నుంచి పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి. అటు సౌత్ చైనా ప్రాంతాలను వరదలు పోటేత్తాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జిక్సింగ్ ప్రాంతంలోని టౌన్‌షిప్‌లను కలిపే అనేక రహదారులు తాత్కాలికంగా మూసి వేశారు. ఇది విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. సమాచార వ్యవస్థ కూడా పలు చోట్ల దెబ్బతింది.
ఆ వాయువుల వల్లే ప్రమాదం:
గ్రీన్‌హౌస్ వాయువులను ప్రపంచంలోనే అత్యధికంగా విడుదల చేసే దేశం చైనా. ఇది విపరీతమైన వాతావరణ మార్పులకు కారణం అవుతోంది. అందుకే చైనాలో రోజుల వ్యవధిలోనే వాతావరణం అనుహ్యంగా మారిపోతోంది. ఓ రోజు ఎండ మండిపోతుంటే మరో రోజు వర్షం దంచి దంచి కొడుతోంది. ఇక కొన్ని ప్రాంతాల్లో వరుణుడి బీభత్సం సృష్టిస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో భానుడు 40 డిగ్రీలు సెంటిగ్రేడ్ దాటి నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. షాంఘైలో 40డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
మొదటి స్థానంలో ఇండియా:
ప్రపంచంలో వరదల కారణంగా ఎక్కువ మంది చనిపోయే దేశాల్లో చైనా రెండోస్థానంలో ఉంది. చైనాలో సంవత్సరానికి సగటున 1,000 మంది వరదల కారణంగా చనిపోతున్నారు. బంగ్లాదేశ్‌లో 800, నైజీరియాలో ఏడాదికి 500 మంది వరదలకు చనిపోతున్నారు. ఇక వరదల దాటికి ఎక్కువ మంది చనిపోయే దేశాల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
వాతావరణ మార్పులతో చైనాలో భారీ వర్షపాతం, టైఫూన్‌ల లాంటి ఘటనలను పెంచుతోంది. ఇక మానవ కార్యకలాపాల వల్ల సంభవించే వాతావరణ మార్పులే కాకుండా ఫెలవమైన నగర నిర్మాణాలు, మైనింగ్ కారణంగా చైనాలో ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. ఎడాపెడా అడవులను నరకడం చైనాలో వాతావరణ మార్పులకు మరో కారణం.
Also Read: ఆధునిక దేవాలయాలే మనకు శాపాలా ? వేలాది ప్రాణాలను తీస్తున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం..!!