Menu

Charles Darwin:డార్విన్ సిద్ధాంతం! ప్రతి జీవి కథ. మతాలు పెట్టే పేచీ!

Sumanth Thummala

మనిషి..క్షీరదాల(vertebrates) జాతిలో సంపూర్ణంగా రెండు కాళ్ళ మీద ఎదిగిన జీవి.. ఎన్నో పరిణామ క్రమాలను దాటుకుంటూ ఈరోజు ఆధునిక మానవుడు అనే స్థాయికి చేరుకున్నాడు. అయితే మనిషికి తాను ఎవరు? ఎక్కడినుండి వచ్చాడు? ఎలా వచ్చాడు? అనే ప్రశ్నకు సమాధానం కోసం ఎంతో ప్రయత్నించారు. శాస్త్రీయ విజ్ఞానం అనేది లేకపోవడంతో సృష్టికర్త ఈ విశ్వాన్ని సృష్టించాడు అనే విశ్వాసం ప్రజల మెదళ్ళలో నాటుకుపోయింది. ప్రతి మతం దాన్ని నమ్మిస్తూ ముందుకు వెళ్ళింది.

అటువంటి వాతావరణంలోనే ఇంగ్లాండ్ లో ఓ వ్యక్తి మొత్తం ఈ కథనే మార్చేశాడు. అతనే చార్లెస్ డార్విన్(Charles Darwin). ఇవాళ డార్విన్ పుట్టినరోజు.

చరిత్ర గతినే మార్చిన మానవుడు! 

చార్లెస్ డార్విన్ 1809 సంవత్సరం ఫిబ్రవరి 12న ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. తను డాక్టర్ లేదా ఒక మత గురువుగా ఉంటాడు అని తన తల్లిదండ్రులు భావించారు. చదువు కోసం ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చేరాడు. సహజవాది (Naturalist) 1831 సంవత్సరంలో అక్కడ 22 ఏళ్ళ డార్విన్ హెచ్ఎంఎస్ బీగల్ అనే‌ నౌకలో సాహసయాత్ర కు పూనుకున్నాడు.

మొదట దక్షిణ అమెరికా ఖండం వైపు పయనిస్తూ అక్కడ అనేక జంతువులు, శిలాజాలు పరిశీలిస్తూ ఈక్వెడార్ దేశంలోని గాలపాగోస్ ద్వీపాలలో తాబేళ్లు ఒక్కో ద్వీపం లో ఒక్కోలా ఉండటం ఆలోచింపజేసింది. ప్రస్తుత జీవుల్లో మార్పులకి పాత శిలాజాలతో వీటి పోలికలు కేవలం యాదృచ్ఛికం కాదు అని ఒక అంచనాకు వచ్చాడు. Natural selection అనే పరిణామం ఈ మార్పులకు కారణమని భావించాడు. దానికి సంబంధించి 20 ఏళ్ల పాటు ఎన్నో పరిశోధనలు చేశాడు, కానీ ఏదీ కూడా ప్రచురించలేదు . తను అనేక సాక్ష్యాలు సంపాదించాలనుకున్నాడు.1858లో మరొక నాచురలిస్ట్ అయిన అల్ఫ్రెడ్ వాల్లెస్ డార్విన్ తో కలిసి ఆలోచనలు పంచుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి “ద థియరీ ఆఫ్ నాచురల్ సెలక్షన్’ అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని ప్రచురించారు. ఆ తర్వాతి సంవత్సరమే ధియరీ ఆఫ్ ఎవల్యూషన్ (Theory of Evolution) ప్రకటిస్తూ ఓరిజిన్ ఆఫ్ స్పీసెస్ ను ప్రచురించాడు డార్విన్. అది తనకు అమితమైన కీర్తిని సంపాదించి పెట్టింది.

మలుపు తిప్పిన సిద్ధాంతం!

డార్విన్ సిద్ధాంతం ప్రకారం ప్రకృతిలో ప్రతి జీవి బతకడానికి పోరాటం చెయ్యాలి. అయితే ఆ జీవి అత్యంత బలమైందే అయ్యుండాల్సిన పని లేదు. కాని పరిస్థితులకు తగ్గట్టుగా బతకడానికి అనుకూలంగా మార్చుకునే జీవులే బతుకుతాయి. ఆ జీవికి జీవించడానికి ఎంత అనువైన లక్షణాలు ఉంటే పునరుత్పత్తి చేసి ఆ జాతిని పెంపొందించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. వేటికైతే అటువంటి లక్షణాలు ఉండవో, ఆ జాతి అంతరించిపోతుంది. ఏ జాతి కైతే అటువంటి లక్షణాలు ఉంటాయో, వాటిని తమ తర్వాత తరాలకు ఆ లక్షణాలను అందజేస్తాయి. అది కొన్ని తరాలపాటు కొనసాగుతూ చివరకు మరొక కొత్త జాతికి పురుడు పోస్తుంది. దీని ప్రకారమే ప్రపంచంలో అన్ని జీవులు పరిణామం చెందుతూ వచ్చాయి. మనిషి కూడా అదేవిధంగా పరిణామం చెందుతూ వచ్చాడు. సాధారణ పూర్వీకుడు నుండి మనిషి – కోతి జాతి పరిణామం చెందిందని చెప్పాడు.

మతస్తులతో పేచీ:

ఈ డార్విన్ పరిశోధన మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది. చర్చి కి‌, సంప్రదాయవాదులకు ఈ మాట అసలు నచ్చలేదు. ఇన్నాళ్లుగా దేవుడు సృష్టించడం వల్లే ప్రతి జీవి ఈ భూమ్మీద ఉందని ప్రచారం చేస్తున్న వీళ్లు, ఒకసారిగా ఇది తప్పు అని చెప్పే ఆధారాలతో వచ్చిన డార్విన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తనతో పాటు ఇతర శాస్త్రవేత్తలు కూడా అనేక ఆధారాలు ప్రచురించడంతో ఈ సిద్ధాంతానికి బలం చేకూరింది మెల్లిగా జీవ పరిణామక్రమం అనే సిద్ధాంతం అందరి ఆమోదం పొందుతూ వచ్చింది.


ప్రస్తుత సమాజంలో మతస్తుల మాట:

నేటికీ సంప్రదాయవాదులు మతం కల్పించిన కట్టు కథలను నమ్మించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. డార్విన్ సిద్ధాంతం తప్పు అని మేము ఒప్పుకోమంటారు. సిద్ధాంతం అర్థం చేసుకోకుండా, ఆధారాలను పట్టించుకోకుండా,మనిషి కోతి నుండి రావడం ఏంటి? అని గేలి చేస్తూంటారు. అబ్రహామిక్ మతాల నమ్మకం ప్రకారం మనిషి జాతి ఆడం- ఈవ్ అనే ఇద్దరు దేవుడు సృష్టించిన మనుషుల నుండి మొత్తం మనిషి జాతి వచ్చిందని ప్రచారం చేస్తారు. ఒకవేళ అది నిజమైతే ఈ పాటికి భూమ్మీద ఒక మనిషి కూడా ఉండడు ఎందుకంటే ఒక కుటుంబంలోనే సంతానోత్పత్తి జరుగుతూ పోతే జన్యుపరంగా అనేక లోపాలు ఏర్పడి జీవించడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి అది మొత్తం జాతి తుడిచి పెట్టుకు పోవడానికి కారణమవుతుంది. దీనికి సంబంధించి మనం మేనరికపు సంతాన ఉత్పత్తిలో కూడా చూస్తుంటాం.

అలాగే హిందూ మతంలో కూడా మనుధర్మ శాస్త్రం ప్రకారం మనిషి బ్రహ్మలో ఒక్కో భాగం నుండి ఒక్కో కులానికి చెందిన మనుషులు జన్మించారు అని, ఆ కులం వారు వారికి నిర్దేశించిన పనులే చేయాలని ఆశాస్త్రమైన విషయాలతో, దోపిడిని అణచివేతను ప్రచారం చేస్తుంది. వీటికి ఎక్కడా కూడా శాస్త్రీయపరమైన ఆధారాలు నిరూపణలు ఉండవు. అయితే పెరిగిన శాస్త్ర దృక్పథాన్ని చూసి సైన్సును కూడా దోచుకుంటారు. మా మత గ్రంథాల్లో ఇదివరకే ఇదంతా చెప్పారు అంటూ బూటకపు మాటలు మాట్లాడుతుంటారు.

ధీయరీ అర్థం:

థియరీ కేవలం పుస్తకాల్లోనని నిరూపితమైనది కాదని కొట్టిపారేస్తుంటారు మతస్తులు. అసలు శాస్త్రీయ సిద్ధాంతం(scientific Theory) అనేది ప్రపంచం లో ఒక అంశం మీద వివరణ, ఇది శాస్త్రీయ పద్ధతికి అనుగుణంగా పదేపదే పరీక్షించబడుతుంది ఇంకా ధృవీకరించబడుతుంది, పరిశీలన, కొలత మరియు ఫలితాల మూల్యాంకనం యొక్క ఆమోదించబడిన ప్రోటోకాల్‌లను ఉపయోగిస్తుంది. సాధ్యమైన చోట, కొన్ని సిద్ధాంతాలు ఒక ప్రయోగంలో నియంత్రిత పరిస్థితుల్లో పరీక్షించబడతాయి. ప్రయోగాత్మక పరీక్షలకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో, తార్కిక సూత్రాల ద్వారా సిద్ధాంతాలు మూల్యాంకనం చేయబడతాయి. స్థాపించబడిన శాస్త్రీయ సిద్ధాంతాలు కఠినమైన పరిశీలనను ఎదుర్కొంటాయి. వీటికి అనేక ఆధారాలు సాక్షాలుగా ఉంటాయి. మరోవైపు మతమే అసలు ఆధారాలను పట్టించుకోకుండా కేవలం ఓ మత గురువు చెప్పారని ఒక పుస్తకంలో ఉందని ఏదైనా నమ్మేస్తుంటారు నమ్మ పలుకుతుంటారు.

శాస్త్రీయ జీవన విధానమే అసలైన విధానం:

మన చర్మం మీద ఉన్న వెంట్రుకల నుండి కడుపులోని పెద్ద పేగు వరకు పుర్రె నుండి దాని లోపల దంతాల వరకు మనమే ఒక నడిచే ఆధారం. ఇది ఎన్నో శిలాజాలు నిరూపించాయి. మనిషికి శాస్త్రీయ జీవన విధానమే ఎప్పటికీ సత్యానికి దగ్గర చేస్తుంది. ఆధారాలతో నిరూపించిన తర్వాత కూడా ఒకటి పురాణాలని నిజమైన వాటిగా ప్రచారం చేసే వాళ్ళు కూడా సమాజానికి ఎంతో చేటు చేస్తున్నారు.


Written By

1 Comment

1 Comment

  1. cbs says:

    Hyatsofff.. chala goppaga vivarincharu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *