Menu

RSS-BJP: మోదీకి మూడినట్టేనా? ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల మాటల అర్థమదేనా?

Praja Dhwani Desk
bjp vs rss general elections 2024

ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి పుట్టిన బీజేపీకి మొదటి నుంచి సిద్ధాంతాలే ఊపిరి. హిందూత్వ భావాజాలాన్ని వ్యాప్తి చేయడం, దేశమంతా కాషాయం చేయడం వారి సిద్ధాంతాల్లో భాగం. దీనికి అడ్డొచ్చే ఏ విషయాన్ని అయినా వ్యూహాత్మకంగా పక్కకు పెట్టడం కమలం పార్టీ నైజం. అద్వాని అయినా వాజ్‌పెయి అయినా ఇవే సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. గెలిచినా ఓడినా ఈ సిద్ధాంతాలనే పాటించారు. ఎక్కడా కూడా తమకు తామే గొప్పవాళ్లమని విర్రవీగలేదు. పార్టీ కంటే తమ పేరుకే ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే నరేంద్ర మోదీ వేరు. ఆయన తమ సిద్ధాంతాల కంటే తానే ఎక్కువగా ఫీల్ అయ్యారు. తన పేరుతోనే ఎన్నికల బరిలోకి దిగారు. మోదీకా పరివార్‌ అని ఆయనకు బీజేపీ నేతల నుంచి గట్టి మద్దతు లిభించేలా చేసుకున్నారు. ఇదంతా ఆర్‌ఎస్‌ఎస్‌కు నచ్చలేదు. అయితే ఎన్నికల సమయలో మాత్రం నోరు మెదపలేదు. జూన్ 4 విడుదలైన ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ మార్క్‌ రావడంతో ఇక మోదీకి తమదైన శైలిలో ట్రిట్‌మెంట్‌ ఇవ్వాలని భావించారు.. ఒక్కొక్కరిగా మోదీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

యాంటీ-మోదీ రాతలు:
అహంకారం వల్లే బీజేపీ 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలక నేత ఇంద్రేష్ కుమార్ కామెంట్‌ చేశారు. అటు ఆర్‌ఎస్‌ఎస్‌లో మేధావిగా గుర్తింపు తెచ్చుకున్న రతన్ శారద సైతం మోదీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. పత్రికా వ్యాసాల్లో మోదీ అహంకారన్ని రతన్‌ ఎండగట్టారు. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ సైద్ధాంతిక నిబద్ధతను దెబ్బతీస్తోందని ఘాటుగా రాసుకొచ్చారు. అటు మహారాష్ట్రలో అజిత్‌ పవార్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ మౌత్‌పీస్‌ ‘ఆర్గనైజర్‌’ తప్పుబట్టింది. ఇవన్ని మోదీ వ్యతిరేక రాతలు, మాటలు. మునుపెన్నడూ లేని విధంగా బీజేపీపై ఆర్‌ఎస్‌ఎస్‌ మాటల దాడి చేయడం దేనికి సంకేతం?

సిద్ధాంతాలను పక్కన పెట్టి మరీ… :
ఆర్‌ఎస్‌ఎస్‌కు తమ సిద్ధాంతపాలన బీజేపీ నుంచే అమలు కావాలి. అటు మోదీ సారధ్యంలో బీజేపీ కూడా హిందూత్వ ఐడియాలజీ వ్యాప్తే లక్ష్యంగా పని చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే రామ మందిరాన్ని నిర్మించింది. ఆర్టికల్‌ 370ను రద్దు చేసింది. త్రిపుల్‌ తలాక్‌ను నిషేధించగలిగింది. అటు యూనిఫాం సివిల్‌ కోడ్‌ అమలకు కూడా పక్కా ప్లాన్‌ వేసింది. ఇక రామ మందిర ప్రారంభోత్సవం సమయంలోనూ మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌కు పెద్ద పీఠ వేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను అందరికంటే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ తన మాతృసంస్థ పట్ల భక్తిని చాటుకున్నారు. అయితే మోదీ చేసిన ఒకే ఒక్క పని ఆర్‌ఎస్‌ఎస్‌కు నచ్చలేదు. తనకు తానుగా పార్టీ ఫేస్‌గా చెప్పుకుంటూ సిద్ధాంతాలను ప్రమోట్‌ చేయకుండా ఎన్నికల బరిలో దిగడం సంఘ్‌ నేతలకు ఏ మాత్రం రుచించలేదు.

మోదీ పార్టీగా మారిపోయిన పరిస్థితి:
2014 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి 2009-14 మధ్య కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. రెండోది మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రమోట్‌ చేస్తూ బీజేపీ బరిలోకి దిగడం. గుజరాత్‌ మోడల్‌ పేరుతో బరిలోకి దిగిన బీజేపీ 2014 ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే అప్పటివరకు బీజేపీని కేవలం హిందూత్వ పార్టీగానే చూసిన చాలామంది ఆ తర్వాత కమలంపార్టీని మోదీ పార్టీగా చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రజలకు అందించే సంక్షేమ పథకాల నుంచి పార్టీ కార్యకలాపాల వరకు అన్నిటిలోనూ మోదీ పేరే కనిపించేది.. ఆయన పేరే వినిపించేది. ఇలా మోదీ తనకు తానుగా ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇది 2019 ఎన్నికల్లో వర్కౌట్ అయ్యింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ను పట్టించుకోని మోదీ టీమ్:
2019లో మోదీ పేరుతోనే బరిలోకి దిగిన బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో మోదీకి తిరుగేలేకుండా పోయింది. అయితే 2019-24మధ్య సీన్‌ రివర్స్‌ అయ్యింది. మోదీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలవడంతో పాటు అటు కాంగ్రెస్‌ కూడా పుంజుకోవడం మొదలుపెట్టింది. నిజానికి ఇలాంటి సమయంలో మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ సాయం తీసుకుంటారని అంతా భావించారు. అయితే మోదీ మాత్రం మరోసారి తన పేరు మీదే ఎన్నికల బరిలో నిలిచారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఓ విధంగా ప్రచారానికి దూరంగా ఉంచారు. వారితో మాట్లాడింది లేదు.. కలిసి కూర్చొని చర్చించింది లేదు.. వారి అభిప్రాయాల్ని తెలుసుకుందీ లేదు. పైగా తమకు సొంతంగా బలం ఉందని.. ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం లేకుండా తమ పార్టీ నడవగలదని నాడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా బహిరంగంగా చెప్పడం సంఘ్‌ నేతల కోపానికి కారణమైంది. దేశంలో కమ్యూనిస్టులు మినహా బీజేపీ మాత్రమే సిద్దాంతాలకు కట్టుబడి ఉందని గతంలో చెప్పిన నడ్డా ఎన్నికలకు ముందు మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌తో తమ పార్టీకి అవసరంలేదని అర్థం వచ్చే విధంగా కామెంట్స్‌ చేయడం విడ్డూరం!

కొంపముంచిన యూపీ:
ఎన్నికల సమయంలో బీజేపీతో ఆర్‌ఎస్‌ఎస్‌ అంటిఅంటనట్టే నడుచుకుంది. మిత్రపక్షాలతో సంబంధం లేకుండా అధికారంలోకి రావడానికి ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ప్రచారాల్లో కనిపించలేదు. తీరా ఫలితాలు చూస్తే యూపీలో బీజేపీ గట్టి దెబ్బ తగిలింది. 80 స్థానాల్లో 36స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది ఓవరాల్‌గా బీజేపీ మ్యాజిక్‌ మార్క్‌(272) దాటకపోవడానికి కారణమైంది. వారణాసిలో పోటి చేసిన మోదీకి సైతం మెజార్టీ ఘోరంగా తగ్గిందంటే ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంతలా విఫలమైందో అర్థం చేసుకోవచ్చు.

వ్యక్తి కంటే వ్యవస్థే గొప్పది కదా:
అటు 2029 ఎన్నికల సమయానికి మోదీకి 78ఏళ్లు వస్తాయి. 75ఏళ్లు దాటిన వారు పోటిలో ఉండకూడదని సంఘ్‌ రాజ్యాంగం చెబుతోంది. దీంతో మోదీ ఫేస్‌ లేకుండానే వచ్చేసారి బీజేపీ బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయితే మోదీ మాత్రం ఇప్పటివరకు వన్‌ మ్యాన్‌ ఆర్మీలా పార్టీని నడిపారు. మోదీ అంటే బీజేపీ, బీజేపీ అంటే మోదీ అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఇది లాంగ్‌ టర్మ్‌లో బీజేపీని గట్టి దెబ్బడం ఖాయం. ఈ పరిణామాలను గమనిస్తూ వస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఇక మోదీకి ప్రత్యామ్నాయం కోసం వేట కొనసాగిస్తోంది. అందుకే పనిలో పనిగా వ్యవస్థ(సంఘ్‌) కంటే వ్యక్తి(మోదీ)ఎక్కువ కాదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ఇప్పటికే సోషల్‌మీడియాలో నితీన్‌ గడ్కరీని ఓ నాయకుడిగా ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ఆర్ఎస్‌ఎస్‌లో క్రమశిక్షణకు పెద్ద పీఠ ఉంటుంది. అందుకే నితీన్‌ గడ్కరీని నాయకుడిగా ప్రజలు చూసేలా ఆర్‌ఎస్‌ఎస్‌ పావులు కదుపుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు యోగి ఆదిత్యనాథ్‌తోనూ వరుస భేటీలు జరుపుతోంది. మొత్తంగా చూస్తే తమ వేలు వదిలి సొంతంగా నడుస్తున్న మోదీ సారధ్యంలోని బీజేపీని మళ్ళీ తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అంతే కానీ ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ విడిపోవు. పిల్లాడు తప్పు చేస్తే తండ్రికి సరిదిద్దే బాధ్యత ఉన్నట్టే ఆర్‌ఎస్‌ఎస్‌కు బీజేపీ విషయంలో అలానే ఉంటుంది.. ఇలా ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడం 1984, 2003 తర్వాత ఇదే తొలిసారి. ఇదంతా ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే అలకలే కానీ గొడవలు కావు!

Also Read: పేదలు డాక్టర్లు కాకూడదా? నీట్‌ పరీక్షా విధానమే బడాబాబుల కోసం!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *