అవినీతి నిర్మూలనంటూ రాజకీయాల్లోకి దూసుకొచ్చి అనతి కాలంలోనే సీఎం పదవిని దక్కించుకున్న కేజ్రీవాల్ అదే అవినీతి మరకలంటుకోని జైలుకు వెళ్లారని మీడియా కోడై కుస్తోంది. నిజమే కావొచ్చు.. కేజ్రీవాల్ అవినీతికి పాల్పడి ఉండొచ్చు. స్కామ్ కానీ స్కామ్ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకోవడం వెనుక బీజేపీ హస్తమే లేదని భ్రమ పడేవారు అలానే పడొచ్చు. ఈ స్కామ్ ఎంత పెద్ద స్కామో త్వరలోనే తెలుస్తుంది. 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌కే క్లీన్‌చీట్ ఇచ్చిన కోర్టులు మనవి. బొగ్గు, రాఫెల్‌లు అసలు కుంభకోణాలే కాదని ప్రజలని వెర్రొళ్లని చేసిన దేశం మనది. ఈ లెక్కన చూసుకుంటే ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఓ మద్యం పాలసీని స్కామ్ కింద ఎంతకాలం ప్రజలు భావించాల్సి వస్తుందో ఇప్పటికైతే చెప్పలేం. అంతా విశ్వగురువు చేతుల్లోనే ఉంటుంది. నిజానికి తప్పు చేస్తే ఎవరికైనా శిక్షపడాల్సిందే.. కేజ్రీవాల్ పైనుంచి దిగి రాలేదు. అయితే కేజ్రీవాల్ మాత్రమే ఎందుకు అరెస్ట్ అయ్యారు..? మనీ లాండరీంగ్‌లు, డెక్కన్ హెరెల్డ్‌లు అంటూ ఈడీ పిలిచినప్పుడల్లా వెళ్లే సోనియా, రాహుల్ ఇప్పటివరకు ఒకసారి కూడా ఎందుకు జైలుకు వెళ్లలేదు? ఈడీ దాడులు 2014 తర్వాత 95శాతం బీజేపీయేతర నేతలపైనే జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. బీజేపీ నేతలంతా మంచివాళ్లు కావొచ్చు.. మిగిలిన పార్టీలు బుద్ధి గడ్డి తినే పార్టీలు కావొచ్చు. మరి వారందరిలో కేజ్రీవాల్ ఒక్కరే ఎందుకు అరెస్ట్ అయ్యారు?
కేజ్రీవాల్ రాజకీయ అరంగ్రేటమే ఓ సంచలనం. అన్నాహజారే ఉద్యమంలో పాల్గొనడం, పార్టీ స్థాపించడం, గెలవడం, సీఎం కుర్చి ఎక్కడం, రాజీనామా చేయడం, మళ్లీ గెలవడం ఇదంతా కాసేపు పక్కన పెడదాం. కేజ్రీవాల్ ఎందుకు భిన్నమైన నాయకుడో తెలుసుకుందాం.
కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలే టార్గెట్:
నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలకు రాజకీయాల్లోకి రాకముందే ముచ్చెమటలు పట్టించిన నాయకుడు కేజ్రీవాల్. నేరుగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకే గురి పెట్టిన కేజ్రీవాల్..2007-2010 మధ్య సోనియా అల్లుడు చేసిన అక్రమాలపై గళం విప్పారు. అన్ సెక్యూర్డ్ వడ్డీ లేని రుణాలతో వాద్రా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని కేజ్రీవాల్ 2012లో సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ దెబ్బకు కాంగ్రెస్‌కు దిమ్మదిరిగింది. కేజ్రీవాల్ అంతటితో ఆగలేదు. నాటి బీజేపీ చీఫ్ నితిన్ గడ్కరీ కపట నాటకాలను ఆయన బహిర్గతం చేశారు. వివిధ రాజకీయ పార్టీలతో గడ్కరీ కుమక్కై రైతుల పరిస్థితిని దుర్భరంగా మార్చారని కేజ్రీవాల్ ఆరోపించారు.
ముఖేశ్‌కి వ్యతిరేకంగా పోరాటం:
కేజ్రీవాల్ ఇక్కడితో ఆగి ఉంటే మోదీలో భయం పుట్టేది కాదు. దేశంలో ఏ నేతకు లేని తెగింపు కేజ్రీవాల్‌కు ఉంది. ముఖేశ్ అంబానీ గురించి ప్రస్తుత కాంగ్రెస్ అప్పుడప్పుడు ఏదో విమర్శిస్తుంటుంది కానీ హస్తం పార్టీ టార్గెట్ ఎప్పుడూ అదానీ, అనిల్ అంబానీపైనే ఉంటుంది. ఎందుకంటే ముఖేశ్ బీజేపీకి ఎంత దగ్గర వాడో కాంగ్రెస్‌కు అంతే దగ్గర వాడు. తన వ్యాపార సామ్రాజ్యంతో పరోక్షంగా దేశాన్నే ఏలుతున్న ఈ కుభేరుడి బండారాన్ని బయటపెట్టేందుకు కేజ్రీవాల్ ఎంతో ప్రయత్నించారు. ముఖేశ్‌కు వ్యతిరేకంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇలాంటి స్టాండ్ తీసుకునే సాహసం చేయలేదు. అంత దైర్యం కూడా ఎవరికీ లేదు. కానీ కేజ్రీవాల్‌లో పోరాడేతత్వం ఉంది. తలవంచని నైజం ఉంది.
అందుకే వారణాసిలో మోదీపై పోటికి సై అన్నారు. 49 రోజుల్లోనే సీఎం పదవి నుంచి వైదొలిగినా తర్వాత ఏకంగా ఢిల్లీని క్లీన్ స్వీప్ చేసే అంత మెజారిటీ సాధించారు. ఇలా జరగడం దేశ చరిత్రలో అదే ప్రథమం. అందుకే మోదీకి ఢీకొట్టే సరైన నాయకుడు వచ్చాడని సామాన్యులు భావించారు. ఎప్పటికైనా కేజ్రీవాల్ ప్రధాని కాగలరన్న విశ్లేషణలు మొదలయ్యాయి.
ఆప్.. సామాన్యుల పార్టీ:
అంతే.. మోదీకి భయం మొదలైంది. కేజ్రీవాల్ శక్తిని అణిచేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా టీమ్‌లను తయారు చేసింది. అయినా కేజ్రీవాల్ ఇమేజ్ చెక్కుచెదరలేదు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేజ్రీవాల్ 70స్థానాల్లో 62 సీట్లు సాధించారు. ఆ తర్వాత పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. ముందుగా పంజాబ్, గుజరాత్, గోవాలను ఎంచుకున్నారు. అక్కడ బలమైన ఓటు బ్యాంక్ ఏర్పరుచుకునేందుకు స్వయంగా కేజ్రీవాల్ రాష్ట్రాల పర్యటనలకు వెళ్లారు. పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించింది. మోదీ సొంత గడ్డ గుజరాత్‌లో 12శాతం ఓట్ షేర్‌ను సాధించింది. గతేడాది ఆమ్ ఆద్మి పార్టీకి జాతీయ పార్టీ గుర్తింపు కూడా దక్కింది. ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కామ్ జరిగిందంటూ ఈడీ ఆప్ నేతల నివాసాలు, ఆఫీస్‌లపై దాడులు చేసింది.
రాజకీయ అరంగ్రేటం నుంచి కేజ్రీవాల్‌కు బలమైన అండగా ఉన్న మనీశ్ సిసోడియాను ఈ కేసులో అరెస్ట్ చేసింది. మొత్తం 33పోర్ట్‌ఫోలియాల్లో 18 శాఖాలను సిసోడియా ఒక్కరే చూసుకునేవారు. అందుకే సిసోడియా మొదట టార్గెట్‌గా మారారు.
మోదీకి అందుకే భయం
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను అడ్డం పెట్టుకోని కేజ్రీవాల్ పార్టీని భూస్థాపితం చేయాలన్నదే బీజేపీ ఏకైక లక్ష్యం. అందుకే కేజ్రీవాల్‌నూ వదల్లేదు. స్వాతంత్ర్య భారతంలో అతి తక్కువ కాలంలో ఊహించనిదాని కంటే ఎంతో పురోగతి సాధించిన పార్టీ ఆప్. ఎప్పటికైనా కేజ్రీవాల్ పీఎం కాగలరన్నది మేధావుల మాట. అందుకే కేజ్రీవాల్ అంటే మోదీకి వణుకు. అందుకే రాహుల్, సోనియా లాంటి వాళ్లు అరెస్ట్ అవ్వరు.. కేజ్రీవాల్ మాత్రమే అవుతారు. కానీ సంఘ పరివార్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. కేజ్రీవాల్‌ను ఎంత అణిచివేస్తే అంత ఎత్తుకు ఎదుగుతారు.
జైలు నుంచే కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతున్నారంటే ఆయన మొండితనం ఎలాంటిదో ఈపాటికి బీజేపీకి అర్థమయ్యే ఉంటుంది. కేజ్రీవాల్ అందరిలాంటి నాయకుడు కాదు.. RTI చట్టం కోసం పోరాటాలు చేసిన ఆఫీసర్ అతను.. రాజకీయాల్లోకి రాకముందే కేజ్రీవాల్ నిబద్ధత గురించి ప్రజలకు తెలుసు.
అందుకే ఢిల్లీ ప్రజలు వరుసగా రెండు సార్లు పట్టం కట్టారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ కేజ్రీవాల్ అంటే ఓటర్లకు గౌరవం. ఎంత విష ప్రచారం చేసినా కేజ్రీవాల్ పాలన పట్ల ప్రజలకు నమ్మకం ఉంటుంది. చదువు దగ్గర నుంచి పరిపాలన వరకు ఇప్పుడు ఏలుతున్న బీజేపీ నేతల్లో ఎవరికీ కూడా కేజ్రీవాల్‌కు ఉన్న క్వాలిఫికేషన్ లేదు. అందుకే ఈ అరెస్టులు.. ఈ ఈడీ దాడులు!
Also Read: రూల్స్ అనామకులకేనా? పెద్దాయనకు వర్తించవా? ఏంటీ వివక్ష?