జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రయాణికులకు పెద్ద మార్పు రాబోతోంది. ఇప్పటివరకు ఓలా, ఉబర్ లాంటి ప్రైవేట్ క్యాబ్ యాప్‌లపైనే ఆధారపడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తోంది. అదే.. ‘భారత్ ట్యాక్సీ యాప్‘. ఇది కేవలం కొత్త యాప్ మాత్రమే కాదు.. ఇది ప్రైవేట్ క్యాబ్ కంపెనీల మోనోపోలీకి చెక్ పెట్టే ప్రయత్నం. డ్రైవర్లను దోపిడీ చేస్తున్న కమిషన్లకు అడ్డుకట్ట. ముఖ్యంగా సామాన్య ప్రయాణికుడి జేబుకు ఊరట కలిగించే నిర్ణయం.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం జనవరి 1 నుంచే భారత్ ట్యాక్సీ యాప్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 56 వేల మంది డ్రైవర్లు ఈ యాప్‌లో రిజిస్టర్ అయ్యారు అని కేంద్రం స్పష్టం చేసింది. ఇది ప్రారంభ దశ మాత్రమే అంటున్నారు అధికారులు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా.
ఇప్పటివరకు పరిస్థితి ఎలా ఉందంటే ఓలా, ఉబర్ లాంటి యాప్‌లు క్యాబ్ చార్జీలను తమ ఇష్టానుసారంగా పెంచుతున్నాయనే విమర్శలు చాలానే ఉన్నాయి. సర్జ్ ప్రైసింగ్ పేరుతో ఒక్కసారిగా చార్జీలు రెట్టింపు, అలాగే ఒక్కోసారి మూడింతలు అవుతున్న సందర్భాలు అనేకం. దీనితో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇక డ్రైవర్ల పరిస్థితి అయితే మరీ దారుణం. ప్రైవేట్ యాప్‌లు 20 నుంచి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రోజంతా కష్టపడి పని చేసినా చివరికి డ్రైవర్ చేతిలో మిగిలేది చాలా తక్కువ. అందుకే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే భారత్ ట్యాక్సీ యాప్ ద్వారా డ్రైవర్లకు న్యాయం, ప్రయాణికులకు సరసమైన చార్జీలు అనే లక్ష్యంతో ఈ యాప్‌ను తీసుకొచ్చినట్టు చెబుతోంది.
ప్రధానంగా ఈ యాప్‌లో.. అధిక కమిషన్లు ఉండవని, సర్జ్ ప్రైసింగ్ ఉండదని, చార్జీల్లో పారదర్శకత ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే మీరు బుక్ చేసిన క్యాబ్‌కు ఎంత చార్జ్ పడుతుందో ముందే స్పష్టంగా తెలుస్తుంది. అనవసరంగా చివరి నిమిషంలో చార్జీలు పెరిగే అవకాశం ఉండదు.
ఇది నిజంగా అమలులోకి వస్తే ప్రైవేట్ క్యాబ్ కంపెనీలపై ప్రజల ఆధారపడటం తగ్గే అవకాశం ఉంది. అలాగే ఓలా, ఉబర్ లాంటి సంస్థలు కూడా తమ చార్జీలను తగ్గించాల్సిన పరిస్థితి రావచ్చు. మొత్తానికి జనవరి 1 నుంచి రాబోయే భారత్ ట్యాక్సీ యాప్ ప్రయాణికుల పాలిట వరమా? డ్రైవర్లకు నిజమైన న్యాయమా? లేదా ప్రైవేట్ క్యాబ్ దిగ్గజాలకు పెద్ద సవాలా? ఇక ఈ యాప్ పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.. క్యాబ్ రంగంలో కొత్త యుద్ధానికి భారత్ ట్యాక్సీ యాప్ నాంది పలికిందనే చెప్పవచ్చు.

New Year Resolutions 2026: ఈసారైనా న్యూఇయర్ రిజల్యూషన్ పాటిస్తారా? బిస్కెట్ చేస్తారా?
New Year Plans: తెలంగాణ టూరిజం గోవా టూర్ ప్యాకేజ్.. న్యూఇయర్‌కి భలే ఆఫర్ బాస్.. పూర్తి వివరాలివే!