బుమ్రా(Jasprit Bumrah)ను హింస పెట్టారు..! అవును..! ఒక ఫాస్ట్ బౌలర్ ఒక ఇన్నింగ్స్‌లో 50కు పైగా ఓవర్లు వెయ్యడమేంటి? ఎంత దారుణం? ఇది శారీరక హింస మాత్రమే కాదు.. మానసిక హింస కూడా. అయినా బుమ్రా ఆస్ట్రేలియా సిరీస్ అంతా రాణించాడు. 32 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అతనికి తోడుగా ఉంది ఎవరో తెలుసా? కెప్టెన్ రోహిత్ కాదు, కోచ్ గంభీర్(Gambhir) అంతకన్నా కాదు. బుమ్రాకు తోడు నీడగా ఉన్నది అతని భార్య సంజనా(Sanjana) మాత్రమే. అతను మానసికంగా అలిసిపోయిన ప్రతీసారి భార్యనే బుస్టింగ్ ఇచ్చింది. అతను పోరాడేలా చేసింది. అయితే బీసీసీఐ మాత్రం తప్పంతా భార్యలదేనంటోంది. ఆటగాళ్లతో భార్యలు ఉండకూడదని చెబుతోంది. స్ట్రిక్ట్ రూల్స్ కూడా పాస్ చేసింది. ఇది లాజిక్ లేని నిర్ణయమని బుమ్రా ఉదాహరణ స్పష్టం చేస్తోంది. అయినా రోహిత్(Rohit Sharma), కోహ్లీ(Virat Kohli) పరమచెత్తగా ఆడితే తప్పించాల్సింది వారిద్దరిని కానీ రితికా(Ritika), అనుష్క(Anushka Sharma)ను బ్యాన్ చేయడమేంటో అర్థంకావడం లేదంటున్నారు విశ్లేషకులు.
చెత్తాట భర్తలది.. నింద మాత్రం భార్యలపైనా?
ఆటగాళ్ల ప్రదర్శన దారుణంగా ఉంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు.. ప్రాక్టీస్ లోపాలు కారణం కావచ్చు. విరాట్ కోహ్లీ అదేపనిగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్తున్న బాల్‌ను టచ్ చేసి పెవిలియన్‌కు వెళ్తే ఆ పాపం అనుష్క శర్మది ఎందుకు అవుతుంది? రోహిత్ శర్మ ఒళ్లు కదల్చకుండా బద్ధకంతో బ్యాటింగ్ చేస్తే ఆ తప్పు రితికాది అవుతుందా? కేఎల్ రాహుల్‌కు సిరీస్‌కు ఒకటి రెండు సార్లు మాత్రమే నిలకడగా బ్యాటింగ్ చేస్తాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో తుస్సుమంటాడు. ఇది రాహుల్‌కు పెళ్లి కాకముందు నుంచి ఉన్న అలవాటు. కానీ రాహుల్ అధ్వాన్నంగా బ్యాటింగ్ చేస్తే భార్య అతీయా శెట్టిని నిందిస్తారా? ఎంత అన్యాయం?
సుబ్రహ్మణ్యన్‌ను ఫాలో అవుతున్న బీసీసీఐ
నిజానికి ఇతర క్రికెట్ బోర్డులు కూడా భార్యలు, కుటుంబ సభ్యుల పర్యటనలను పరిమితం చేసే నియమాలు కలిగి ఉన్నాయి. ఉదాహరణకు క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్ల భార్యలు, కుటుంబ సభ్యుల పర్యటనలను నిర్దిష్ట సమయానికి పరిమితం చేస్తాయి. అంటే కొన్ని సమయాల్లో మాత్రమే కలుసుకునే అవకాశం ఉంటుంది. బీసీసీఐ మాత్రం మొత్తం బ్యాన్ చేసింది. ఇక ఇతర క్రీడల్లో కూడా ఆటగాళ్లు తమ భాగస్వాములతో ప్రయాణిస్తారు. టెన్నిస్, ఫుట్‌బాల్ ఆటగాళ్లు తమ పార్టనెర్స్‌తో కలిసే పర్యటనలకు వెళ్తారు. ఇటు బీసీసీఐ వైఖరి మాత్రం L & T చైర్మన్ సుబ్రహ్మణ్యన్‌ను గుర్తుకు తెస్తుంది. ఆయనేమో ఆదివారాలు భార్యలను చూస్తూ గడపడం కంటే పని చేయడం మంచిదంటారు. బీసీసీఐ కూడా ఇంచుమించుగా అలానే అంటోంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఓటమికి ఎన్నో కారణాలు ఉండగా.. వాటిని పక్కన పెట్టి బీసీసీఐ ఏదో సైంటిస్టుల మాదిరి ఆలోచించి చివరకు ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు చురకంటిస్తున్నారు. ఒకవేళ భార్యల కారణంగానే ఓటములు వస్తాయన్నదే నిజమైతే 2011 ప్రపంచ కప్‌ను టీమిండియా ఎలా గెలుచుకుంది? ఆ సమయంలో ఇలాంటి కఠిన నియమాలు లేవు కదా. అప్పుడు ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో సమయం గడిపినా 28ఏళ్ల తర్వాత టీమిండియా వరల్డ్‌కప్ కొట్టింది కదా..! ఏమో బీసీసీఐకే ఇవన్నీ తెలియాలి..!
ఇది కూడా చదవండి: గమ్మునుండవోయ్.. అందరితో గొడవలేందుకు భయ్యా నీకు.. ప్చ్..!