Menu

Asia Climate Change: 2 కారణాలు.. గాల్లో లక్షల ప్రాణాలు..సైంటిస్టుల షాకింగ్‌ స్టడీ!

Praja Dhwani Desk 2 months ago
super storms natural disasters reasons explained

ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, పిడుగు పడిన శబ్దాలు..! అంతా అల్లకల్లోలం…నిమిషాల వ్యవధిలో ఊరంతా నీటిమయం..! ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన సీన్ కాదు.. దక్షిణ ఆసియాలో నిత్యం కనిపిస్తున్న సాధారణ దృశ్యాలు. శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్‌..ఇలా ఏ దేశాన్ని కదిలించిన కన్నీటిగాథలే కనిపిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దక్షిణ ఆసియాలో ఏ దేశమూ సేఫ్‌ జోన్‌లో లేదు. ఇటు సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కొన్ని దేశాలపై ప్రకృతి ఎందుకు ఇంతలా దాడి చేస్తుందో చెప్పేందుకు వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ గ్రూప్ పరిశోధకులు ఓ రీసెర్చ్ చేశారు. ఆసియాలో వరదలు, తుఫాన్లతో పాటు ఇతర ప్రకృతి విపత్తులకు రెండు కారణాలున్నాయని ఈ రీసెర్చ్ టీమ్‌ చెబుతోంది. ఇంతకీ ఏంటా రెండు కారణాలు? భవిష్యత్‌లోనూ ఆసియా దేశాల దుస్థితి ఇలానే ఉండనుందా?

పెరుగుతున్న నీటి ఉష్ణోగ్రతలు:

దక్షిణ ఆసియాను వణికిస్తున్న ఈ విషాదాల వెనుక మొదటి పెద్ద కారణం..ఎలివేటెడ్ సీ సర్ఫెస్ టెంపరేచర్..! అంటే సముద్రం అసహజంగా వేడెక్కిపోవడం అన్నమాట! సాధారణంగా సముద్రపు నీరు చల్లగా ఉంటుంది. వర్షాలు పడినా తుఫాన్లు పుట్టినా ఇందులో పెద్దగా మార్పు ఉండదు. కాని ఈసారి పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. రీసెర్చ్ ప్రకారం.. నార్త్ ఇండియన్ ఓషన్‌లో గత నవంబర్‌లో నీటి ఉష్ణోగ్రత పెరిగింది. 1991 నుంచి 2020 వరకు ఉన్న సాధారణ సగటుతో పోలిస్తే 0.2డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. ఇక ఇలా నీరు వేడెక్కితే ఏమౌతుందని ఆలోచిస్తున్నారా? అది ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి మేఘాల్లోకి చేరి.. గాలిలో తేమ పెరుగుతుంది. అదే తేమ తుఫాన్లకు గుండెల్లో నిప్పులా పనిచేస్తుంది. ఆ సమయంలో తుఫాను తీవ్రత పీక్‌ స్టేజీకి వెళ్తుంది.

అంత తీవ్రతకు అదే కారణం:

ఉదాహరణకు సెన్యార్ తుఫాను మలక్కా జలసంధిలో పుట్టినప్పుడు.. అక్కడి సముద్రపు నీరు సాధారణం కంటే దాదాపు ఒక డిగ్రీ ఎక్కువగా ఉంది. వాతావరణ మార్పు లేకపోతే అది అంత వేడిగా ఉండేది కాదు. ఈ ఒక్కడిగ్రీ వేడి సెన్యార్‌కు అదనపు శక్తి ఇచ్చింది. అదే శక్తితో ఈ తుఫాన్‌ ఇండోనేషియాపై విరుచుకుపడింది. ఈ దెబ్బతో సుమత్రా ద్వీపంలోనే 969మంది చనిపోయారు. ఇంత బలమైన తుఫాను సుమత్రా ప్రాంతంలో రెండుసార్లు మాత్రమే నమోదైందంటే సముద్రం అసహజంగా వేడెక్కిపోవడమన్నది ఎన్ని విపత్తులకు కారణమౌతుందో అర్థం చేసుకోవచ్చు.

వందల ప్రాణాలు ఖతం:

ఇటు శ్రీలంకలో పరిస్థితి మరింత భయంకరం. దిత్వా తుఫాన్ సమయంలో అక్కడి సముద్రపు నీరు కూడా అసహజంగా వేడిగా ఉంది. ఈ కారణంతో వర్షం 5రోజుల పాటు నాన్‌స్టాప్‌గా కురవడంతో అక్కడి కొండచరియల విరిగిపడి 600 మందికి పైగా మట్టిలో కలిసిపోయారు. దేశానికి సుమారు 58వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇదంతా ఎలివేటెడ్ సీ సర్ఫెస్ టెంపరేచర్ కారణంగానే జరిగింది. నీరు వేడెక్కితే ప్రతి తుఫాను రెట్టింపు శక్తితో వస్తోందని సైంటిస్టులు బలగుద్ది మరీ చెబుతున్నారు. ఇది శాస్త్రవేత్తలు చెస్తున్న అత్యంత ప్రమాదకర హెచ్చరిక.

అటవీ నిర్మూలనతో సర్వనాశనం:

మరోవైపు దక్షిణ ఆసియాను శాశ్వతంగా దెబ్బతీస్తున్న రెండో పెద్ద కారణం అడవుల నరికివేత. చెట్లు నరికే కొద్దీ భూమి బలహీనమవుతోంది.. వర్షం పడితే నేల జారిపోతోంది.. అదే వరదలకు పెద్ద గేటు తెరిచినట్లే అవుతుంది. ఇండోనేషియాలో గత కొన్ని ఏళ్లలో లక్షల హెక్టార్ల అడవులు మాయమయ్యాయి. పామాయిల్ తోటలు, మైనింగ్, రోడ్లు, పరిశ్రమల పేరిట చెట్లను అడ్డగోలుగా నరికిపడేస్తున్నారు. చెట్లు లేకపోతే మట్టి నిలవదు.. అప్పుడు నీరు లోపలికి ఇంకిపోదు. అదే సమయంలో భారీ వర్షం కురిస్తే.. ఆ నీరంతా ఒక్కసారిగా గ్రామాలపైకి దూసుకొస్తుంది. అందుకే ఇండోనేషియాలో వరదలు పాములా కాటేస్తున్నాయి.

విధ్వంసాన్ని ఆపండి:

ఇటు మలేషియా పరిస్థితి కూడా దాదాపు ఇంతే అని చెప్పుకోవాలి. 2024లోనే వందల కోట్ల విలువైన అటవీ సంపద మాయమైంది. అటు శ్రీలంకలో అడవుల నష్టం మరింత దారుణం. గత 20 సంవత్సరాల్లో లక్షల హెక్టార్ల అడవులు కనపడకుండా పోయాయి. అదే కారణంతో అక్కడి కొండలు బలహీనపడి వర్షం కురిస్తే ఒక్కసారిగా కూలిపోతున్నాయి. దిత్వా తుఫాను మరణాలకు అడవుల లేమీ ప్రధాన కారణం. అందుకే సైంటిస్టులు చెబుతుంటారు.. అడవి ఒకదేశాన్ని రక్షించుగోలదు. అదే అడవిని చంపుకుంటూ పోతే చివరకు భూమ్మీద ఏ ఒక్క ప్రాణి కూడా జీవించి ఉండదు.

డిజాస్టర్ బెల్ట్‌లో ఏమున్నాయి?

మరోవైపు దక్షిణ ఆసియాకు ఉన్న భౌగోళిక శాపం కూడా ప్రకృతి విపత్తులకు కారణమౌతుంది. ఇక్కడే ఇండియన్ ఓషన్ ఉంది.. పసిఫిక్ ఉంది.. బే ఆఫ్ బెంగాల్ ఉంది.. ఈ మూడు సముద్రాలు తుపాన్లకు పుట్టినిల్లు. అందుకే ఈ ప్రాంతాన్ని సైంటిస్టులు డిజాస్టర్ బెల్ట్ అంటున్నారు. బే ఆఫ్ బెంగాల్‌ గురించి ఒక భయంకరమైన నిజం ఉంది. ప్రపంచంలో పుడుతున్న తుపాన్లలో ఎక్కువశాతం ఇక్కడే తమ శక్తిని పెంచుకుని ఆసియా దేశాలపై దాడి చేస్తున్నాయి. శ్రీలంక, థాయిలాండ్, మలేషియా లాంటి దేశాలు తక్కువ ఎత్తులో ఉన్నాయి. అవి సముద్రం పక్కనే ఉంటాయి. సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగితే ఈ దేశాలు నీటిలో కలిసిపోతాయి. ఇక సింగపూర్, మియన్మార్, బంగ్లాదేశ్ కూడా ఇదే ప్రమాదంలోనే ఉన్నాయి. తక్కువ ఎత్తు ఉన్న దేశాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఒక మీటర్‌ నీరు పెరిగినా లక్షల ఇళ్లపై ప్రభావం పడుతుంది.

మీకు గుర్తుందా? దక్షిణ ఆసియాలో 2004లో వచ్చిన సునామీ 14 దేశాలను కడిగేసింది. సుమారు 2 లక్షల 30వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఇండియన్ ఓషన్. అదే భూకంప బెల్ట్.
అదే ప్రమాదం ఇంకా కొనసాగుతూనే ఉందని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. వాతావరణ మార్పు వేగం ఇలాగే కొనసాగితే.. సీజన్‌తో సంబంధం లేకుండా ఏ కాలంలోనైనా ప్రకృతి తన కోపాన్ని చూపించవచ్చు.

ఇక ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్న ఒక్కటే మిగిలింది.. దక్షిణ ఆసియా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? శాస్త్రవేత్తలు దీనికి ఓ భయంకర సమాధానాన్ని చెబుతున్నారు. వాతావరణ మార్పు వేగం ఇలానే కంటిన్యూ అయితే ఇప్పటివరకు తుపాను రాని ప్రాంతాల్లో కూడా తుపాన్లు పుడతాయి. ఉదాహరణకు మలక్కా జలసంధి దగ్గర సెన్యార్‌ తుఫాన్‌ పుట్టిందని చెప్పుకున్నాం కదా.. నిజానికి ఆ ప్రాంతంలో తుఫాన్లు అక్కడ పుట్టడం చాలా అరుదు. కాని ఇకపై ఇలాంటివి సాధారణమవుతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అంటే ప్రకృతి తన దారిని మార్చుకుంది. తుఫాన్లు కొత్త రూట్ ఎంచుకుంటున్నాయి. ఎక్కడినుంచి వస్తాయో, ఎక్కడ దాడి చేస్తాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి.

ఇటు ఇండియాకి ఇదే హెచ్చరిక వర్తిస్తుంది. గత 20ఏళ్లలో ఇండియాలో లక్షల మంది ప్రకృతి విపత్తుల వల్ల చనిపోయారు. దేశ వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా విపత్తుల ప్రభావం తాకింది. ఇంత పెద్ద సంఖ్యలు ఏ దేశానికైనా బాధను కలిగిస్తాయి. ముఖ్యంగా ఇండియా జనాభా, భౌగోళిక నిర్మాణం, వాతావరణ మార్పు లాంటివి ఇండియాను ప్రమాదాల కేంద్రంగా నిలబెడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఒక్క వర్షం పడితే కొండలు కూలిపోతాయి.. బెంగాల్‌లో నదులు ఉప్పొంగితే ఊర్లు ఆచూకీ లేకుండా పోతాయి.. దక్షిణ భారతంలో వరదలు పడి నగరాలే నీటిలో మునిగిపోతాయి..!

ఇదంతా ఒక్కటే విషయాన్ని చెబుతున్నాయి. ప్రకృతి మన చేతుల్లో లేదు కాని.. దాన్ని కాపాడే బాధ్యత మాత్రం మనదే. అడవులు కాపాడితేనే పర్వతాలు నిలుస్తాయి. పర్వతాలు నిలిస్తేనే నదులు అల్లకల్లోలం కాకుండా ఉంటాయి. నదులు తన రీతిలో ప్రవహిస్తేనే ఊర్లు ఉక్కిరిబిక్కిరి కాకుండా ఉంటాయి. ఈ సీక్వెన్స్‌లో ఒక్క లింక్‌ పోయినా మనిషి బతుకే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే భవిష్యత్తును కాపాడుకోవాలంటే ప్రకృతితో యుద్ధం చేయడం ఆపాలి. అదే ప్రకృతిని స్నేహితుడిగా మళ్లీ చూడడం మొదలుపెట్టాలి. లేకపోతే ఈ భూమి మరిన్ని సెన్యార్లను, మరిన్ని దిత్వాలతో పాటు వాటితో పాటు మరిన్ని కన్నీటి గాథలను మన ముందు ఉంచుతుందండి!

ALSO READ: వీధిన పడ్డ బతుకులు.. ఆసియాపై పగబట్టిన ప్రకృతి.. లక్షలమంది బలి!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *