Menu

Bangladesh: పుట్టిన బిడ్డను కూడా చూసుకోలేక నరకయాతన.. ఆ ముస్లిం దేశంలో చిక్కుకుతున్న ఆంధ్ర మత్స్యకారులు ఎందుకు తిరిగి రాలేకపోతున్నారు?

Lakshmi Aruna 1 month ago
"బంగ్లాదేశ్ అధికారులు ఇక్కడి జైల్లో ఉన్న మత్స్యకారులను... భారతీయులను కలవడానికి అనుమతి లేదని చెప్పారు. వీరి కేసు ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు" అని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ తెలిపారు. ఆయన బంగ్లాదేశ్ వెళ్లి అక్కడి అధికారులను కలిశారు.

చేతిలో ఫోన్ పట్టుకుని ఒక రింగు కోసం ఎదురు చూస్తోంది సూరాడ అనిత. ఆమె ఇప్పుడు తొమ్మిది నెలల గర్భిణి. డాక్టర్లు జనవరి పదహారున డెలివరీ అయ్యే అవకాశముందని చెప్పారు. కానీ ఆమె మనసులో తిరుగుతున్న ప్రశ్న డెలివరీ గురించికాదు. ఆ సమయానికి తన భర్త ఇంటికి వస్తాడా? పుట్టబోయే బిడ్డకు తండ్రి ముఖం చూపించగలమా? అనే భయం ఆమెను క్షణక్షణం వెంటాడుతోంది. రోజూ అదే ఫోన్… అదే నంబర్… కనీసం రింగ్ అయినా వస్తుందేమోనని చూస్తూ చూస్తూ కళ్లలో నీళ్లు నిండిపోతున్నాయి. ఫోన్ స్విచ్ ఆఫ్ అనే మాట ఇప్పుడు ఆమె జీవితానికి ఒక భయంగా మారింది.

అక్టోబర్ పదమూడున విశాఖ హార్బర్ నుంచి చేపల వేటకు బయలుదేరారు తొమ్మిది మంది మత్స్యకారులు. వారిలో అనిత భర్త అప్పలకొండ కూడా ఉన్నాడు. వేట వాళ్లకు ఒక పనికాదు. అదే వారి ఊపిరి. ఇరవై రోజులు సముద్రంలో ఉంటే దొరికే ఆ కాస్త డబ్బుతోనే ఇంట్లో పిల్లలు చదువుతారు, అద్దెలు కడతారు, తిండి తింటారు. అక్టోబర్ పద్నాలుగు, పదిహేను తేదీల వరకు ఫోన్లు పనిచేశాయి. ఆ రెండు రోజులు మాటలు ఉన్నాయి. ఆశ ఉంది. ఆ తర్వాత ఫోన్ మూగబోయింది. సముద్రంలో ఇబ్బందులేమోనని కుటుంబాలు అనుకున్నాయి. కానీ అక్టోబర్ ఇరవై రెండున బోటు యజమాని వచ్చి చెప్పిన మాటలతో అందరి కాళ్ల కింద నేల కదిలిపోయింది. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు అరెస్ట్ చేసింది అని.

అప్పటి నుంచి రోజులు కాదు… రాత్రులు కూడా గడవడం లేదు. వాళ్లు ఎక్కడున్నారు అనే సమాచారం లేదు. జైల్లో ఉన్నారా లేదా అన్నదీ తెలియదు. తింటున్నారా? బతికే ఉన్నారా? అనే కనీస సమాధానం కూడా లేదు. ఈ మౌనం కుటుంబాల గుండెలను నలిపేస్తోంది. తిప్పలవలస, చింతపల్లి, కొండ్రాజుపేట గ్రామాల్లో ప్రతి ఇల్లు ఒకే ప్రశ్నతో నిండిపోయింది. వేటకు వెళ్లి తిరిగి రాని జీవితాలు… ఇది ఒక్క అనిత కథ కాదు. తొమ్మిది కుటుంబాల మౌన కేక.

ఇరవై ఏళ్ల ప్రవీణ్ కోసం అతని తల్లి నూకాలమ్మ రోజూ ఎదురు చూస్తోంది. “మా అబ్బాయి తెస్తేనే మేము తింటాం” అంటుంది ఆమె. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు. కనీసం అద్దె కట్టే స్థోమత లేదు. తెలిసినవాళ్లు ఇచ్చిన సాయంతోనే రోజులు నెట్టుకొస్తున్నారు. కనీసం జైల్లో ఉన్నాడని తెలిసినా మనసుకు కాస్త ఊరట కలుగుతుందేమో అని ఆమె ఆశ. కానీ ఆ ఆశ కూడా ఎవరో చెప్పే మాటలపై ఆధారపడి ఉంది.

ఇంటి బయట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లుల మనసులు మరింత బరువెక్కుతున్నాయి. “నాన్న ఎక్కడ?” అని అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మాట మూగబోయింది. వేటకు వెళ్లిన తండ్రి ఇరవై రోజుల్లో, నెలలో తిరిగి వచ్చేవాడు. ఇప్పుడు రెండు నెలలు దాటిపోయాయి. తల్లులు చెప్పే సమాధానాలు పిల్లల కళ్ల ముందు అబద్ధాల్లా నిలబడుతున్నాయి. పిల్లల్ని సముదాయించలేక తల్లుల గుండెలు పగులుతున్నాయి.

ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడ బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు. యుద్ధాల మాటలు. ఆ వార్తలు ఇక్కడ కుటుంబాల్లో భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మతం, జాతి, సరిహద్దులు… ఇవన్నీ వాళ్లకు తెలియవు. వాళ్లు చేపల వేటకు వెళ్లారు. అంతే. కానీ ఆ గీతలు దాటాయంటూ ఇప్పుడు జీవితాలు సరిహద్దుల్లో చిక్కుకుపోయాయి. మతం కోసం కాదు. జాతి కోసం కాదు. కుటుంబ పోషణ కోసం సముద్రంలోకి వెళ్లిన వాళ్లు, ఇప్పుడు మానవత్వం మరిచిపోయిన వ్యవస్థల మధ్య ఇరుక్కున్నారు.

అధికారులు భరోసాలు ఇచ్చారు. నాయకులు పరామర్శలు చేశారు. కేసులు వాయిదా పడ్డాయి. ఒప్పందాల మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఇళ్లలో ఉన్నవాళ్లకు కావాల్సింది ఒక్కటే. కనీసం ఒక ఫోన్ కాల్. “బతికే ఉన్నాం” అని చెప్పే ఒక మాట. ఆ ఒక్క మాట లేకపోవడమే ఈ కుటుంబాల జీవితాలను దుర్భరంగా మార్చింది.

మతాలు, జాతులు, సరిహద్దులు… ఇవన్నీ పెద్దల చర్చల్లో ఉండొచ్చు. కానీ మధ్యలో నలిగిపోతున్నది సామాన్యుల జీవితాలు. గర్భిణీ భార్య ఎదురు చూపులు. తల్లి కన్నీళ్లు. పిల్లల ప్రశ్నలు. ఇవన్నీ ఎవరూ చూడటం లేదు. పండగ నాటికి భర్త వస్తాడా? పుట్టబోయే బిడ్డకు తండ్రి ముఖం చూపించగలమా? అనిత అడుగుతున్న ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. కానీ ఆ ప్రశ్న ఒక్క అనితదే కాదు. ఇది మనుషులంతా మనుషుల్లా ఉండాలని అడిగే ప్రశ్న. ఇది ఇలా ఉంటే బంగ్లాదేశ్ లో జరిగిన ఘటనపై అందరూ హిందువులపై జరిగిన అన్యాయంగా చూపిస్తున్నాయి తప్ప..మానవత్వం మరిచిన సమాజంగా ఎవరు చూపించటం లేదు..మనం ముందు మతంలో పుట్టలేదు మనిషిగా పుట్టాం.. ఆ విషయం అందరూ మరిచి వాళ్ళకి అనుగుణంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. మనలో మనకే చిచ్చు పెట్టే విధంగా రీల్స్ షేర్ చేస్తున్నారు. దయచేసి ఆలోచించండి. మన పక్కవారినే తోటి మనిషిని ప్రేమించడం,గౌరవించడం రాని మనకు ఒక జాతి, ఒక మతం అంటూ ఎదుటి వారిని విమర్శించే హక్కు ఉందంటారా?

ALSO READ: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *