Menu

USA WEAPONS: అమెరికా రాజకీయాల నీడలో నలిగిన మరో దేశం.. ఇది చాలా దారుణం!

Praja Dhwani Desk 6 days ago
america weapons destroying pakistan

సైన్యం వెళ్లిపోయిన తర్వాత కూడా యుద్ధం ఆగిపోదు.. అమెరికా అడుగులు వెనక్కి తీసుకున్న చోట.. బాంబుల నీడ మిగులుతుంది. 2025లో పాకిస్తాన్ ఇదే నిజాన్ని దారుణంగా అనుభవించింది.

అమెరికా వదిలేసిన తుపాకులు ఇప్పుడు పాకిస్తాన్ వీధుల్లో మాట్లాడుతున్నాయి. ఒకప్పుడు అఫ్ఘానిస్తాన్‌లో భద్రత పేరుతో దిగిన ఆయుధాలు.. ఇప్పుడు బలూచిస్తాన్‌లో, మార్కెట్ల మధ్య, బస్సుల్లో, సైనిక శిబిరాల దగ్గర పేలుతున్నాయి. దీని కారణంగా 2025లో పాకిస్థాన్‌ రక్తపాతం మధ్య బతుకీడ్చింది. సుయిసైడ్ బాంబర్లు పెరిగారు. భీకర దాడులు తిరిగి వచ్చాయి. అధునాతన ఆయుధాలతో ఉగ్రవాదులు మళ్లీ శక్తివంతమయ్యారు. అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా తయారు చేసిన ఆయుధాలు.. 2025 పాకిస్తాన్‌ను దహనం చేశాయి.

ఇంతకీ 2021లో అఫ్ఘాన్‌ తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఆయుధాలు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి? ఫిదాయీన్ దాడులు ఎందుకు మళ్లీ పుట్టుకొచ్చాయి? అమెరికా రాజకీయాల నీడలో నలిగిన మరో దేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

 

2025లో పాకిస్తాన్ ఎదుర్కొన్న హింస సాధారణమైనది కాదు. ఇది ఒక్కసారిగా పుట్టిన ఉగ్రవాదం కూడా కాదు. దీని వెనుక ఒక స్పష్టమైన టైమ్‌లైన్ ఉంది. 2021 ఆగస్టులో అమెరికా అఫ్ఘానిస్తాన్ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకున్నప్పుడు అక్కడ మిగిలిపోయిన ఆయుధాల పరిమాణం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పెంటగాన్ లెక్కల ప్రకారం అఫ్ఘాన్ భద్రతా దళాలకు ఇచ్చిన దాదాపు 90 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, వాహనాలు, నైట్ విజన్ పరికరాలు, అసాల్ట్ రైఫిల్స్, హెలికాప్టర్లు తాలిబాన్ చేతుల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత వాటిలో సగానికి పైగా ఆయుధాలు ఎక్కడున్నాయన్న దానిపై అమెరికాకే స్పష్టత లేకుండా పోయింది.

ఈ ఆయుధాలే క్రమంగా బ్లాక్ మార్కెట్ మార్గాల్లో పాకిస్తాన్ లోపలికి ప్రవేశించాయి. అధికారిక లెక్కల ప్రకారం 2025లో పాక్‌లో 1066 ఉగ్రదాడులు జరిగాయి.

ఇది 2024తో పోలిస్తే భారీ పెరుగుదల. ఆ దాడుల్లో 3413 మంది మరణించారు. గత దశాబ్దంలో ఇదే అత్యధిక సంఖ్య. ఈ హింసలో మరో భయంకరమైన మార్పు ఫిదాయీన్ దాడుల తిరిగిరావడం. 2025లో 26 ఆత్మాహుతి దాడులు నమోదయ్యాయి. ఇది ఒక్క ఏడాదిలో 53 శాతం పెరుగుదల. ఈ దాడులు సాధారణ ప్రజలపై మాత్రమే కాదు. సైనిక కాన్వాయ్‌లు, భద్రతా శిబిరాలు, చైనా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాంతాలు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ అతి పెద్ద యుద్ధ రంగంగా మారింది.

ఇక్కడే అమెరికా విధానాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆఫ్ఘాన్ యుద్ధంలో వాడిన ఆయుధాలు ఇప్పుడు పాకిస్తాన్ లోపల ప్రభుత్వానికే ఎదురుగా నిలుస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితి 2025 ఫిబ్రవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం తాలిబాన్ చేతుల్లోకి వెళ్లిన అమెరికా ఆయుధాలను TTP, ISIS అనుబంధ గ్రూపులు, మధ్య ఆసియా ఉగ్రసంఘాలు వినియోగిస్తున్నాయి. ఈ ఆయుధాల వల్ల ఉగ్రవాదుల ఫైర్ పవర్ పెరిగింది. దాడులు మరింత ప్రొఫెషనల్‌గా మారాయి. పాకిస్తాన్ సైన్యానికీ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 2025లో 667 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఇది 2011 తర్వాత నమోదైన అతిపెద్ద సంఖ్య. సామాన్య ప్రజల మరణాలు కూడా పెరిగాయి. 580 మంది పౌరులు ఈ హింసలో ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు TTP లాంటి ఉగ్రసంఘాలు.. మరోవైపు బలూచ్ విముక్తి ఉద్యమంతో పాక్‌ చెల్లచెదురైంది. అయితే ఈ సంక్షోభం కేవలం పాకిస్తాన్ మాత్రమే సృష్టించుకున్నది కాదు. ఇది దశాబ్దాల పాటు అమెరికా యుద్ధ రాజకీయాలు పోషించిన విష విత్తనం.

ఇది ఉగ్రవాదుల విజయం కాదు. ఇది యుద్ధాన్ని వ్యాపారంగా మార్చిన శక్తుల వైఫల్యం. ఆయుధాలు ఇచ్చి, దేశాలను వదిలేసి, పరిణామాలకు బాధ్యత తీసుకోని రాజకీయాల ఫలితం. అందుకే 2025 పాకిస్తాన్‌లో జరిగిన రక్తపాతం ప్రపంచానికి ఒక హెచ్చరిక. అమెరికా ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఇలాంటి దుస్థితి తప్పకపోవచ్చు. ఆ హింస కేవలం ఆ సంబంధిత దేశానికే పరిమితం కాదు. అది సరిహద్దులు దాటి మరొక దేశాన్ని కాల్చేస్తుంది. దీనికి పాకిస్థాన్‌ అతిపెద్ద ఉదాహరణ!

ALSO READ: బలూచిస్థాన్ రక్తపాతం.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. అసల కథేంటి?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *