నేను మోనార్క్‌ను.. నేనేం చేసినా చెల్లుతుందంటే అది కుదరదు. ప్రజాస్వామ్యానికి పెద్ద పీఠ వేసే అమెరికాలో ఇలా అసలు జరగదు. జరగకూడదు కూడా. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు ఈ విషయం తెలియనది కాదు.. అయినా ఆయన తీరు మాత్రం మారదు. రాజ్యాంగవిరుద్ధమని తెలిసినా బర్త్‌రైట్‌సిటజన్‌షిప్‌ను రద్దు చేస్తున్నానంటూ సంతకాలు చేశారు. తర్వాత ఏం జరిగింది? ఫెడరల్ కోర్టు మొట్టికాయలు వేసింది. ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మరి నెక్ట్స్ ఏం జరగబోతుంది? ఇంతకీ ఫెడరల్ కోర్టు జడ్జి ఆదేశాలు అమెరికా అంతటా అమల్లోకి వస్తాయా?
అసలు ఈ కేసు ఏంటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ఒక ఉత్తర్వు జారీ చేశారు. బర్త్‌రైట్‌సిటజన్‌షిప్(BirthRight Citizenship) చట్టాన్ని రద్దు చేస్తు సంతకం చేశారు. ఫిబ్రవరి 20, 2025 తర్వాత అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం రాకుండా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వు అమెరికా(America) రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధమని వాదిస్తూ.. వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఒరెగాన్ రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులో కేసు వేశాయి. ఇవి ట్రంప్ ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ రాష్ట్రాలు. అటు పౌరు హక్కుల సంఘాలు కూడా కోర్టు గడపతొక్కాయి. సియాటిల్‌లోని ఫెడరల్ జడ్జి జాన్ కౌగెనౌర్ ముందుకు ఈ కేసు వెళ్లింది. ఇరు వర్గాల వాదన విన్న జడ్జి.. ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వలును తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ చేసిన పని రాజ్యాంగ విరుద్ధమని ఘాటుగానే మాట్లాడారు.
అమెరికా న్యాయవ్యవస్థ ఇలా పని చేస్తుంది
ఇక ఈ తీర్పు కేవలం పిటిషన్ వేసిన నాలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. ఫెడరల్ కోర్టులు జారీ చేసే కొన్ని ఉత్తర్వులు మొత్తం దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. రాజ్యాంగబద్ధమైన ఉత్తర్వులకు ఇది వర్తిస్తుంది. అదేంటి ఇండియాలో ఓ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇస్తే అది దేశం మొత్తానికి అమలు అవ్వదు కదా? మరి అమెరికాలో ఎందుకలా అనేగా మీ డౌట్? ఇది అర్థంకావాలంటే అమెరికా న్యాయవ్యవస్థ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవాలి. అమెరికా న్యాయవ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది. అందులో ఒకటి ఫెడరల్ కోర్టులు, రెండోది స్టేట్ కోర్టులు.
అక్కడ దేశం మొత్తం..
ఇందులో ఫెడరల్ కోర్టులు అమెరికా రాజ్యాంగం, ఫెడరల్ చట్టాలు, రాష్ట్రాల మధ్య వివాదాలు లాంటి ప్రధానమైన కేసులను విచారిస్తాయి. ఫెడరల్ కోర్టు అధికారాలు పూర్తిగా రాజ్యాంగంబద్ధమైనవి. ఒక ఫెడరల్ కోర్టు జడ్జి తీసుకునే నిర్ణయం మొత్తం దేశానికి అమలవుతుంది. ఇండియాలో అలా ఉండదు. భారత్‌లో ఒక రాష్ట్ర హైకోర్టు ఇచ్చే తీర్పు ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు మాత్రమే దేశమంతా అమలవుతాయి.
ట్రంప్‌కు గతంలోనే షాకులు
ఇండియాలో హైకోర్టు పరిధి సంబంధిత ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతుంది. అటు అమెరికా ఫెడరల్ కోర్టులు పరిధి పలు సందర్భాల్లో దేశమంతటా ఉంటుంది. నిజానికి ట్రంప్‌కు ఫెడరల్ కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగలడం కొత్త విషయమేమీ కాదు. 2017లో ఏడు ముస్లిం దేశాల ప్రజలను అమెరికాలో రాకుండా వారిని బ్యాన్ చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పుడు కూడా ఫెడరల్ కోర్టులు ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. చివరికి ట్రంప్ సుప్రీంకోర్టు గడప తొక్కాల్సి వచ్చింది. ఇక 2012లో నాటి అమెరికా అధ్యక్షుడు Deferred Action for Childhood Arrivals అనే పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీని 2018లో ట్రంప్ రద్దు చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఫెడరల్ కోర్టులు ప్రెసిడెంట్ ఆదేశాలను నిలిపివేశాయి. ఇప్పుడు అర్థమైందా అమెరికా ఫెడరల్ కోర్టులకు ఎంత పవర్ ఉంటుందో.
14వ సవరణ ఏం చెబుతుంది?
ఇక ఫెడరల్ కోర్టు ఆదేశాల తర్వాత ట్రంప్‌కు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది రాజ్యాంగబద్ధమైన అంశం కావడంతో కేసు ఎక్కువ కాలం సాగవచ్చు. రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టినవారికి అక్కడి పౌరసత్వం లభిస్తుందని ఇందాక చెప్పుకున్నాం కదా.. అయితే అదే సవరణలో ఒక పదాన్ని హైలేట్ చేస్తూ ట్రంప్ కోర్టులో వాదించే అవకాశం ఉంది. ఆ పదం ‘సబ్జెక్ట్ టు ది జ్యూరిస్డిక్షన్’ All persons born or naturalized in the United States, and subject to the jurisdiction thereof, are citizens of the United States అని 14వ రాజ్యాంగసవరణ(14th Amendment)లో ఉంటుంది. అంటే అమెరికాలో పుట్టినవారు, ఆ దేశ చట్టాల పరిధిలో ఉండేవారికి పౌరసత్వ హక్కు ఉంటుందని అర్థం. ఇందులో దేశ చట్టాల పరిధి అన్నది ట్రంప్‌కు వేపన్‌గా మారే ఛాన్స్ ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి అమెరికాలో నివాసముంటున్నాడని అనుకుందాం. కానీ అతనికి ఇతర దేశాల నుంచి దౌత్యపరమైన రక్షణ ఉంటే సంబంధిత వ్యక్తి ‘subject to jurisdiction’ కిందకు రారట. ఇప్పుడు వివిధ వీసాలపై అమెరికాలో ఉంటున్నవారికి సంబంధిత దేశం నుంచి దౌత్యపరమైన రక్షణ ఉంటుంది. ఇటు అనధికార వలసదారుల పిల్లలు పూర్తిగా అమెరికా చట్టాల పరిధిలోకి రారని ట్రంప్ వాదించే ఛాన్స్ ఉంటుంది. చట్టాల పరిధిలోకి రానప్పుడు వారికి పౌరసత్వం ఇవ్వకూడదని ట్రంప్ వాదించవచ్చు. నిజానికి గతంలోనూ ఈ పదంపై ఇదే తరహా కేసులు కోర్టుల్లో నడిచాయి. 1898లో యూనైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్ కేసు ఇలాంటిదే. నాటి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే ట్రంప్‌కు దెబ్బ మీద దెబ్బ పడడం ఖాయమనే చెప్పవచ్చు. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరు పౌరసత్వానికి అర్హులేనని.. తల్లిదండ్రులు చట్టబద్ధంగా నివాసముంటున్నా లేకున్నా అది పిల్లలకు వర్తించదని నాటి కోర్టు కుండబద్దలు కొట్టింది. ఈసారీ అదే రిపీట్ కావొచ్చు. ఎందుకంటే అమెరికా న్యాయవ్యవస్థ, అక్కడి ప్రజాస్వామ్యబద్ధమైన రాజ్యాంగం, ఫెడరలిజానికి ఇచ్చే విలువ అలాంటిది మరి..!
ఇది కూడా చదవండి: వెన్నుపోటుకు తక్కువ కాదు.. కటప్పను మించిపోయిన ట్రంప్!