వామ్మో.. ఫ్లైట్ ఎక్కాలంటేనే భయమేస్తోంది..2024 విమాన ప్రమాదాలు మిగిల్చిన విషాద ఘటనల గురించి ప్రజలు ఇంకా మర్చిపోనే లేదు.. ఇటు 2025 ప్రారంభ నెల జనవరిలోనూ వరుస విమాన ప్రమాదాలు జరగడం కలవరపెడుతోంది. అమెరికా(america), సుడాన్(sudan)లో ఒక్కరోజే విమాన ప్రమాదాలు జరగడం, పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఇంతకీ ఈ రెండు విమాన ప్రమాదాలు ఎలా జరిగాయి? అసలు ఇలా వరుస పెట్టి విమాన ప్రమాదాలు జరగడానికి కారణాలేంటి?
సెకన్ల వ్యవధిలో మొత్తం మారిపోయింది:
2025 జనవరి 29 రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వాషింగ్టన్ డీసీ నుంచి ఓ ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్న రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ మీదుగా PSA ఎయిర్‌లైన్స్ బాంబార్డియర్ CRJ700 విమానం నెమ్మదిగా కదులుతోంది. విమానంలో ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. కొందరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ప్రేమ పాటలు వింటున్నారు.. మరికొందరు వైన్ తాగుతూ ల్యాప్‌టాప్‌లో ఏవో చూస్తున్నారు. ఇంకొందరు కిటికీ పక్కన కూర్చొని వెలుతురు లైట్లతో మెరిసిపోతున్న నగరాన్ని చూస్తున్నారు. అందరూ ముందున్న జీవితం మీద ఎన్నో కలలతో ప్రయాణిస్తున్నారు. కానీ… వాళ్లెవ్వరికీ తెలియదు… కొన్ని నిమిషాల్లో గగనతలంలో మృత్యువు వారిని వెతుక్కుంటూ వస్తోందని! రాత్రి 9గంటలు దాటింది. రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు సమీపానికి చేరుకోగానే PSA విమానం ఓ ట్రైనీ హెలికాఫ్టర్‌ను ఢీకొట్టింది. అంతే.. హెలికాప్టర్ రోటార్‌లు విమానపు రెక్కలను తునాతునకలు చేశాయి. దెబ్బకు విమానం రెండు ముక్కలైంది. మృత్యువు గాల్లో కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 64మంది ఉన్నారు.
సుడాన్‌లో వరుస ప్రమాదాలు
అదే రోజు సుడాన్‌లో జరిగిన మరో విమాన ప్రమాదం ఆ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సౌత్ సూడాన్‌లోని యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్ పయనీర్ ఆయిల్ కంపెనీకి చెందిన బీచ్ 1900D విమానం నెమ్మదిగా టేకాఫ్ తీసుకుంటోంది. ఇంతలో ఇంజిన్ సడన్‌గా ఫెయిల్ అయ్యింది. ఒక్క క్షణంలో విమాన రెక్క ఊడిపోయింది. బీభత్సమైన శబ్దంతో రన్‌వే పక్కనే ఉన్న ఓ నిర్మాణంపై విమానం పడిపోయింది. చాలా మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఫ్లైట్‌లో మొత్తం 21మంది ఉన్నారు.
2024లో ఘోర విమాన ప్రమాదాలు
ఇక ఇటివలి కాలంలో విమాన ప్రమాదాలు వరుసపెట్టి జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2000-2024 మధ్య 26 బోయింగ్ విమాన ప్రమాదాల జరగగా.. అందులో మొత్తం 10,000 మందికి పైగా మరణించారు. ఒక్క 2024లోనే 15 విమాన ప్రమాదాలు జరిగాయి. 318 మంది ప్రాణాలు కోల్పోయారు. 2018 తర్వాతి అత్యంత ప్రాణనష్టాన్ని కలిగించిన సంవత్సరం 2024. ఇక 2025 ప్రారంభంలోనూ ఇలానే విమాన ప్రమాదాలు జరగుతుండడంతో అసలు ఈ సమస్యకు కారణం ఏంటన్నదానిపై ఎక్స్‌పర్ట్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
కొంపముంచుతున్న అలసట
అటు పైలట్ల తప్పిదం విమాన ప్రమాదాలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటివలి జరిగిన అనేక విమాన ప్రమాదాల్లో 50శాతం పైగా యాక్సిడెంట్స్ పైలట్ ఎర్రర్ కారణంగానే జరిగాయట. దీనికి పైలట్స్ అనుభవిస్తున్న అలసట ప్రధాన కారణంగా చెబుతున్నారు. అటు విమాన భాగాల్లో లోపాలు, రాడార్ సమస్యలు, ఇంజిన్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు విమాన ప్రమాదాలకు దారి తీస్తాయి. 20శాతానికి పైగా ప్రమాదాలకు ఇలాంటి సాంకేతిక లోపాలే కారణమని సమాచారం. ఇక పిడుగులు, తుపాన్లు, మంచు తుఫాన్లు లాంటివి విమాన ప్రమాదాలకు దారి తీస్తాయి. అంటే bad weather కారణంగా 15శాతం విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. అటు టెర్రరిజం, మిస్సైల్ దాడులు 5శాతం విమాన ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని విమానాలు ఉగ్రదాడులకు గురయ్యాయి. యుద్ధ పరిస్థితుల్లో కొన్ని విమానాలు లక్ష్యంగా మారాయి. ఉదాహరణకు 2014లో యుక్రెయిన్ మీదగా వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ రష్యా మిస్సైల్ ఢీకొనడంలో క్రాష్ అయ్యింది. నాటి ప్రమాదంలో 98 మంది మరణించారు. ఇక 2024లోనూ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. అటు పాత విమానాలు, సరిగ్గా రిపేర్ చేయకపోవడం, ఇంజిన్ టెస్ట్‌లు రద్దు చేయడం లాంటివి కూడా ప్రమాదాలకు దారి తీస్తాయి. కొన్నిసార్లు లేజర్ లైట్లు, డ్రోన్‌లు పైలట్లను కన్‌ఫ్యూజ్ చేసి ప్రమాదాలకు కారణం అవుతాయి. ఇలా ఎన్నో కారణాలు ప్రయాణికులను బలి తీసుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: అటు చైనా ఇటు అమెరికా మధ్యలో WHO… అసలు సంగతి ఇది!