‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా‘ అన్వి నిదానంగా చెప్పింది.
తల్లి గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. అన్వి గత నాలుగు సంవత్సరాలుగా ముక్కుతో ఊపిరి పీల్చుకోలేకపోతుంది. నిద్రలో గురక, నోటితో ఊపిరి, మాటల్లో స్పష్టత లేదు..!
*****
సాయంత్రం ఐదు గంటలు. ఆస్పత్రి బెంచ్ మీద ఓ చిన్న పాప.. చేతిలో స్కూల్ బ్యాగ్.. కళ్లలో అలసట.. ఆమె పక్కన ఒక యువతి..ముఖంలో భయం, గుండెల్లో బాధ, కళ్లలో ప్రేమ. ఆ యువతి పేరు సంధ్య. ఆమె ఒక సింగిల్ మదర్. ఆ చిన్న అమ్మాయి పేరు అన్వి.. ఆరేళ్ల పాప..!
ఆ బెంచ్ మీద కూర్చున్నది కేవలం ఒక తల్లి, ఒక పాప కాదు.. జీవితం ముందుకు తోస్తున్న ప్రశ్నలతో కూర్చున్న రెండు మనసులు. ఒకరిది అర్థం కాని బాధ, ఇంకొకరిది మోసుకొస్తున్న బాధ్యత.
డాక్టర్ రూమ్ బయట అన్వి కుర్చీలో కూర్చుని తన కాళ్లను ఊపుతూ ఉంది.
“అమ్మా.. లోపల ఇంజెక్షన్ ఇస్తారా?”
“లేదు బంగారం… డాక్టర్ అంకుల్ నీ ముక్కు చూసి మాట్లాడతారు అంతే.”
సంధ్య లోపల మాత్రం “నా పాపకి నొప్పి వస్తే నేను ఎలా తట్టుకుంటాను?” అని భయపడుతోంది. డాక్టర్ లోపలకి పిలిచాడు.
డాక్టర్ నిదానంగా అన్వికి చెప్పారు “నీ ముక్కులో చిన్న కెమెరా పెట్టి లోపల ఏముందో చూస్తాం బంగారం.. నొప్పి అసలు ఉండదు..” అన్వి భయపడుతూ సంధ్య చేతిని బలంగా పట్టుకుంది.
“అమ్మా… నువ్వు నన్ను వదిలిపెట్టవు కదా?”
నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న…భయపడకు అని ధైర్యం చెప్పింది సంధ్య.. పరీక్ష మొదలైంది. అన్వి కళ్లలో నీళ్లు తిరిగాయి.. సంధ్య గుండె చీలిపోయింది.. ఆమె మనసులో ఒక్క మాట “నా జీవితంలో ఎంత కష్టం వచ్చినా.. నా పాపకి మాత్రం నొప్పి రాకూడదు.”
ఆ చిన్న కన్నీటి బొట్టు, సంధ్య గుండె మీద పడినట్టే అనిపించింది. ఆ క్షణంలో తల్లి అనే పదానికి అర్థం ఆమె ఊపిరిలోనే కనిపించింది.
పరీక్ష తర్వాత డాక్టర్ కుర్చీలో కూర్చుని చెప్పారు “పాపకి అడినోయిడ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు మందులతో ప్రయత్నిద్దాం. తగ్గకపోతే చిన్న శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు… ఇది సాధారణ సమస్యే”.
సంధ్య ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.. కానీ గుండెల్లో మరో భయం ” ఇప్పుడు శస్త్రచికిత్స అంటే ఆ ఖర్చు ఎలా… ఉద్యోగం.. పాప స్కూల్.. అన్నీ ఎలా?” ఇలా ఏవేవో ఆలోచనలు..
ఇద్దరు బయటకు వచ్చారు..వర్షం పడుతోంది. సంధ్య, అన్వి ఇద్దరూ బస్సు స్టాప్ దగ్గర నిలబడ్డారు. అన్వి తల సంధ్య భుజంపై పెట్టుకుంది. వర్షం తడిపేస్తున్నా, ఆ భుజం మీద తల పెట్టగలిగితే చాలు అన్న నమ్మకం అన్వి కళ్లలో ఉంది. సంధ్యకు ఆ బరువు భారంగా కాదు.. బాధ్యతగా అనిపించింది.
“అమ్మా… నేను పెద్దదయ్యాక డాక్టర్ అవుతా.”
“ఎందుకు నాన్నా?”అడిగింది సంధ్య.
“మా లాంటి పిల్లలకి ఊపిరి అందాలంటే డాక్టర్స్ అవసరం కదా మమ్మీ…”అంది అమాయకంగా.. సంధ్య కళ్లలో కన్నీళ్లు… కానీ ఆ కన్నీళ్లలో ఆశ ఉంది.
తర్వాత సర్జరీ జరిగింది. కొన్ని నెలలు మందులు, జాగ్రత్తలు, రెగ్యులర్ చెకప్… అన్వి ఇప్పుడు కాస్త ఫ్రీగా ఊపీరి పీల్చగలుగుతుంది. నిద్రలో గురక తగ్గింది. మాటలు స్పష్టంగా వస్తున్నాయి. స్కూల్లో నవ్వుతూ ఆడుకుంటోంది. ఒక రోజు అన్వి స్కూల్ నుండి వచ్చి అంది.
“అమ్మా… టీచర్ చెప్పారు నా వాయిస్ ఇప్పుడు చాలా క్లియర్గా ఉందని!”
సంధ్య గుండెల్లో పూల వర్షం కురిసినట్టైంది…
ఈ కథ ఒక చిన్న పాప గురించే కాదు..
ఒక తల్లి గుండెల్లో ఉన్న ప్రేమ గురించి..!
పాప ఊపిరి కోసం ప్రతి రోజు తన భయాన్ని దాచుకున్న ఒక తల్లి గురించి.
అడినాయిడ్స్ అనే చిన్న సమస్య పిల్లల జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయగలదు. అయితే సమయానికి గుర్తిస్తే, డాక్టర్ సూచనలు పాటిస్తే, తల్లిదండ్రుల ప్రేమ ఉంటే ప్రతి పాపకూ మళ్లీ స్వేచ్ఛగా ఊపిరి వస్తుంది.
ALSO READ: నన్ను నాలా బ్రతకనివ్వని ఈ సమాజం నాకెందుకు? నిన్ను నీలాగే ప్రేమించు. నిన్ను నీలాగే గౌరవించు!

Rationalist Files: ‘ఆమెను మోసం చేశారు..’ నిజమైన హేతువాదం సోషల్మీడియాలో కాదు.. నిజ జీవితంలో కనిపించాలి..! సిద్ధాంతాల వెనుక దాక్కునే పిరికితనం!
రక్త సంబంధం గొప్పదా? లేదా అవసరానికి అండగా ఉండే స్నేహం గొప్పదా? ఆమె జీవితం చెప్పిన సమాధానం
Marriage System: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Relationships: మనల్ని మనమే మరిచిపోయిన కథ.. బతుకుతున్నామా లేదా నటిస్తున్నామా?