Menu

రక్త సంబంధం గొప్పదా? లేదా అవసరానికి అండగా ఉండే స్నేహం గొప్పదా? ఆమె జీవితం చెప్పిన సమాధానం

Lakshmi Aruna 2 weeks ago

రక్త సంబంధం గొప్పదా లేక అవసరానికి అండగా ఉండే స్నేహం గొప్పదా అనే ప్రశ్నకు ఆమె జీవితం సమాధానం చెప్పింది. ఆమె ఒక మహిళ, ఇద్దరు పిల్లల తల్లి. బాధ్యత అంటే ఏమిటో ఆమెకు పుస్తకాలు నేర్పలేదు, నిద్రలేని రాత్రులే నేర్పాయి. భర్తతో జీవితం మొదలైంది కానీ అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే బాధ్యత తీసుకోని మనిషితో జీవితం ముందుకు కదలదు. సంపాదన లేకపోవడం తప్పు కాదు కానీ ప్రయత్నం చేయకపోవడం, అవకాశాల కోసం ఎదురు చూడకుండా అమాంతం డబ్బు కోసం ప్రాకులాడటం, అప్పుల్లో తిరుగుతూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన లేకపోవడం ఆమెను లోపల నుంచి విరిచేశాయి. పిల్లల అవసరాలు అన్నీ ఆమె భుజాల మీదే పడ్డాయి. ఇంటి పోషణ, స్కూల్ ఫీజు నుంచి డాక్టర్ బిల్లుల వరకు అన్నీ ఆమె చూసుకోవాల్సి వచ్చింది. కనీసం పిల్లలకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రూపాయి కూడా పెట్టలేని వ్యక్తితో జీవితం ఎలా సాగుతుంది అనే ప్రశ్న ఆమెను ఒక నిర్ణయానికి తీసుకువెళ్లింది.

ఆమె అతనికి దూరమైంది. అది కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు, పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్న బాధ్యతాయుతమైన నిర్ణయం. ఆమె ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. పిల్లల్ని చూసుకుంటూ వాళ్ల ముఖాల్లో నవ్వు నిలబెట్టాలని ప్రతిరోజూ పోరాడింది. అలసట ఉంది కానీ పశ్చాత్తాపం లేదు. ఆ సమయంలో ఆమె జీవితంలో ఒక స్నేహం ఉంది. రక్త సంబంధం కాదు, బంధువు కాదు, కానీ బలంగా నిలిచిన తోడు. ఆమె బలహీనపడినప్పుడు ఆ స్నేహమే ఆమెను లేపింది. డబ్బుతో కాదు, సలహాలతో కాదు, “నువ్వు చేయగలవు” అనే నమ్మకంతో. కానీ అదే స్నేహం ఇతరుల కళ్ళకు తప్పుగా మారింది. పిల్లల్లో కూడా విషం నింపటానికి ప్రయత్నిస్తున్నారు.. “ఆమె వల్లే భర్తను దూరం పెట్టింది” అనే మాటలు మొదలయ్యాయి. సహాయం చేయని వాళ్లే ఆరోపణలు చేశారు.

ప్యామిలీ అని చెప్పుకునేవాళ్లు ఆమె కష్టానికి రాలేదు కానీ ఆమె జీవితంపై తీర్పులు మాత్రం ఇచ్చారు. ఇంకా బాధాకరం ఏమిటంటే ఆమె పుట్టింటి వాళ్ళు కూడా ఆమెను అర్థం చేసుకోలేదు. వాళ్లకు ముఖ్యమైనది ఆమె కన్నీళ్లు కాదు, “సమాజం ఏమంటుంది?” అన్న ప్రశ్న. అప్పుడు వచ్చింది ఆమె జీవితాన్ని కుదిపేసిన రోజు. చిన్న పాపకు ఎమర్జెన్సీ వచ్చింది. ఎవరికి చెప్పకుండా తనే ట్రీట్మెంట్ చేయించుకుందామనుకుంది.కానీ మళ్ళీ వాళ్ళ ప్రశ్నలు భరించాలి అనే భయంతో అందరికీ చెప్పింది. ఆసుపత్రి బెడ్ మీద పిల్లను చూసి ఆమె తల్లిగా లోపల చచ్చిపోయింది కానీ బయట మాత్రం బలంగా నిలబడింది. ఎందుకంటే ఆమె ముందే ఇలాంటి అవసరం కావచ్చు అని ఊహించింది..ఇన్సూరెన్స్ కట్టింది, పిల్లల భద్రత కోసం. అది ఆమె నిర్ణయం, ఆమె బాధ్యత. అయినా ఆసుపత్రిలో కూడా మాటలు ఆగలేదు. “భర్తతో ఉంటే ఇలా అయ్యేది కాదు”, “స్నేహితుల మీదే ఆధారపడుతుంది” అనే గుసగుసలు కొనసాగాయి.

ఆ క్షణంలో ఆమెకు ఒక నిజం స్పష్టంగా అర్థమైంది. రక్త సంబంధం మనకు జన్మతో వస్తుంది కానీ బాధ్యతతో రాదు. అవసరానికి అండగా నిలిచేది పేరు కాదు, మనసు. పిల్ల హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు రక్త సంబంధం ఎక్కడుందో ఆమె చూసింది. ఆమె పక్కన నిలిచింది స్నేహమే. పిల్ల చేతిని పట్టుకుని ధైర్యం ఇచ్చింది స్నేహమే. అది ఆమెకు చాలు అనిపించింది. ఈ రోజు ఆమె పిల్లలు నవ్వుతున్నారు, భద్రంగా ఉన్నారు, వాళ్ల కళ్ళలో భయం లేదు. అది భర్త వల్ల కాదు, తీర్పులు చెప్పిన బంధువుల వల్ల కాదు. అవసర సమయంలో ఆమెను వదలని మనుషుల వల్ల.

అందుకే ఈ రోజు ఎవరైనా అడిగితే రక్త సంబంధం గొప్పదా లేక అవసరానికి అండగా ఉండే స్నేహం గొప్పదా అని, సమాధానం ఒక్కటే. రక్తం మనకు పేరు ఇస్తుంది కానీ అండగా నిలిచే మనసే మనకు జీవితం ఇస్తుంది. అవసర సమయంలో నీ పక్కన నిలిచే వాళ్లే నిజమైన కుటుంబం.
నా కుటుంబం నా స్నేహితులే…అలాంటి వారు మనకంటూ ఇద్దరున్నా చాలు.

ALSO READ: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *