Real Life Stories: ఆమె జీవితం రంగులద్దుకున్న సీతాకోకచిలుకల ఉండేది. ఎక్కడ కావాలంటే అక్కడికి ఎగిరే స్వేచ్ఛ. ఎవరి గడపలో ఆగాల్సిన అవసరం లేని స్వతంత్రత. తన ఆలోచనలకు తనే దారి వేసుకునే అలవాటు. ఆమె నవ్వేది. చదివేది. ఆలోచించేది. ప్రశ్నించేది. పెళ్లి అనేది జీవితానికి తప్పనిసరి ముగింపు కాదని ఆమె చాలా ముందే నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం వల్ల ఆమె ఒంటరిగా మారలేదు. మరింత బలంగా మారింది. పని చేసింది. తన కాళ్ల మీద తాను నిలబడింది. సమాజం చెప్పిన గడువులు, వయసు లెక్కలు, భయపెట్టే మాటలు ఆమెను ఎప్పుడూ తొందర పెట్టలేదు. మధ్య వయసు దాటినా ఆమె జీవితం బోర్‌గా అనిపించలేదు. ఎందుకంటే ఆమె జీవితం ఎవరి అనుమతితోనూ నడవలేదు.
ఆమె ఆలోచనలు స్పష్టంగా ఉండేవి. దేవుడు ప్రస్తావనే లేని ఆలోచనలు. కులం లేని చూపు. స్త్రీని తక్కువగా చూసే వ్యవస్థలపై ప్రశ్నలు. అందుకే ఆమెకు తనలాగే ఆలోచించే మనుషులంటే ఆసక్తి. అలాంటి మనుషులు తన చుట్టూ ఉన్నారన్న నమ్మకంతో బతికేది. సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు, వేదికలపై వినిపించే ప్రసంగాలు, రాసే పోస్టులు ఆమెను ప్రభావితం చేసేవి. అలా ఒక రోజు ఆమె దృష్టిలోకి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పోస్టుల్లో మతం మీద తిరస్కారం ఉంది. కుల వివక్ష మీద ఆగ్రహం ఉంది. స్త్రీల హక్కుల మీద గళం ఉంది. తనను తాను రేషనలిస్ట్‌గా, నాస్తికుడిగా, అణగారిన వర్గాల పక్షాన నిలబడే వ్యక్తిగా చూపించుకునే భాష ఉంది. బయట ప్రపంచానికి అతడు ఒక మంచి మనిషిలా కనిపించాడు. చాలా మందికి ఆదర్శంగా కనిపించాడు.
ఆమె అతడిని దగ్గరగా గమనించింది. అతడు ఎలా మాట్లాడుతున్నాడు. ఏ పదాలు వాడుతున్నాడు. ఏ విషయాల మీద పోరాడుతున్నాడు. ఏ అన్యాయాల మీద గళమెత్తుతున్నాడు. అతడి మాటల్లో తర్కం కనిపించింది. అతడి విమర్శల్లో ధైర్యం కనిపించింది. తనలాంటి ఆలోచనలు ఉన్న మనిషి దొరికాడేమో అన్న భావన ఆమెలో మెల్లగా చోటు చేసుకుంది. ఆ దూరాన్ని అతడు తగ్గించాడు. మాటలు పెరిగాయి. పరిచయం దగ్గరైంది. తన జీవితంలోకి అతడే అడుగు పెట్టాడు. అతడే ముందుకు వచ్చాడు. అతడే ఆమెకి పెళ్లి ప్రతిపాదన చేశాడు. అతడే ఆమె జీవితంలో కొత్త ఆశలను నాటాడు. అప్పటివరకు ఆమె నమ్మని పెళ్లి వ్యవస్థ కూడా ఒక్కసారిగా కొత్త అర్థాన్ని తెచ్చుకుంది. వ్యవస్థ చెడిపోయిందేమో కానీ వ్యక్తులు మాత్రం నిజాయితీగా ఉండొచ్చేమో అన్న ఆశ ఆమెను తాకింది.
కానీ ఆ ఆశ ఎక్కువ కాలం నిలబడలేదు. మాటల మధ్య కనిపించిన తర్కం ఒక రోజు వెనక్కి తగ్గింది. సమాజాన్ని ప్రశ్నించిన వాడు అదే సమాజాన్ని సాకుగా పెట్టాడు. కుటుంబం అనే మాటను ముందుకు తెచ్చాడు. తల్లి, అన్నయ్య అంటూ సాకులు చెప్పాడు. నాకంటే నువ్వు 5ఏళ్లు పెద్దదానివంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇలా వయసు అనే సంఖ్యను ఒక్కసారిగా ఆమె మీద రాయిలా విసిరాడు. ఈ వయసు ఉన్న మహిళను ఏ కుటుంబమైనా అంగీకరిస్తుందంటూ చులకన చేసి మాట్లాడాడు. నిన్నటివరకు ఆన్‌లైన్‌లో పోరాడిన మనిషి, ఆఫ్‌లైన్‌లో భయపడిపోయాడు. తన నిర్ణయానికి తనే నిలబడలేని స్థితిలోకి జారిపోయాడు. ఆ క్షణంలో ఆమెకు విరిగింది ప్రేమ కాదు… ఆమె నమ్మిన ముఖం, ఆమె నమ్మిన భాష. సోషల్ మీడియాలో కనిపించే వ్యక్తికి, నిజ జీవితంలో ఉన్న మనిషికి మధ్య ఉన్న భయంకరమైన తేడా ఏంటో ఆమెకు ఆ రోజే తెలిసి వచ్చింది. ఆ తర్వాత తిరిగి ఆమె మునపటి మనిషిలా మారలేకపోయింది. ఇప్పటికే ఆమెను ఈ బాధ వేధిస్తూనే ఉంది. ఇది నిజంగా జరిగిన ఘటన..!
ఆమె జీవితంలో జరిగింది ఒక వ్యక్తిగత విషాదం కాదు. అది ఒక పెద్ద మోసానికి చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక్కడ సమస్య ప్రేమలో లేదు. పెళ్లిలో లేదు. వయసులో కూడా లేదు. సమస్య ఆలోచనలను వ్యాపారంగా మార్చుకున్న మనస్తత్వంలో ఉంది. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. నాస్తికత్వం గొప్ప ఆలోచన. హేతువాదం సమాజానికి అవసరమైన ఆయుధం కూడా. దేవుడిని ప్రశ్నించడం, కులాన్ని తిరస్కరించడం, మనిషిని మనిషిగా మాత్రమే చూడడం అంటే ఈ సమాజం మీద యుద్ధం ప్రకటించడమే. మనం పుట్టిన వెంటనే ఎవరో పేరు పేడతారు. ఒక కులాన్ని, ఒక మతాన్ని అంటగడతారు. వాటి కోసం జీవితాంతం బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పే ఆలోచన నిజమైన విముక్తికి మార్గమే. అలాంటి ఆలోచనలు ఈ ప్రపంచంలో చాలా మార్పులకు కారణమయ్యాయి. ఇంకా అవుతాయి కూడా.
అయితే నాణానికి రెండు వైపులు ఉన్నట్టే..ఇందులో కూడా మరో కోణం ఉంది. ఈ గొప్ప ఆలోచనల్ని ముసుగులుగా వేసుకుని లోపల మాత్రం పాత భయాల్ని, పాత ఆధిపత్యాన్ని మోసుకెళ్లే వాళ్లతోనే అసలైన సమస్య. బయటకు హేతువాదిలా ఫోజ్ కొడతారు.. లోపల మాత్రం సంప్రదాయవాది. స్టేజీ మీద కులానికి వ్యతిరేకం. ఇంట్లో మాత్రం వయసుకి వ్యతిరేకం. పోస్టుల్లో ఫెమినిజం. నిర్ణయాల్లో మాత్రం పురుష అహంకారం. ఇదే అసలు ఫేకుతనం..!
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఒక పెద్ద సర్కస్‌లా మారింది. ఫేస్‌బుక్ గ్రూపులు ఉన్నాయి. వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయి. ప్రతి ప్లాట్‌ఫారంలోనూ పోరాటాలే. ప్రతిదానికీ ఒక ఉద్యమమే. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. స్క్రీన్ మీద పోరాడడం చాలా ఈజీ. సోషల్‌మీడియా పోస్టుల్లో విప్లవం చేయొచ్చు కానీ నిజ జీవితంలో ఒక నిర్ణయానికి నిలబడే ధైర్యం ఉండకపోతే నీ రాతలు ఎలా ఉంటే ఎవరికి ఎక్కువ?
చాలా మంది తమను తాము రాడికల్ ఫెమినిస్టులమని చెప్పుకుంటున్నారు. అయితే వారంతా స్త్రీల పక్షానే ఉంటారని నమ్మకూడదు. కొంతమంది హేతువాదులమని చెప్పుకుంటున్నారు. అయితే వారంతా శుద్దపూసలని కాదు.. ఓ పేరు మోసిన హేతువాదికి ఫేస్‌బుక్‌లో ఓ గ్రూపు ఉంది. ఆయనగారికి చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. ఆ ఫేస్‌బుక్ గ్రూప్ అడ్మిన్ ఓసారి అమ్మాయిని ట్రాప్ చేస్తే ఈ విషయం ఆ హేతువాదికి తెలిసింది. ఆ సమయంలో ఆయన బాధితురాలి పక్షాన నిలబడకపోగా.. ‘రెండు చేతులు కలవకపోతే చప్పట్లు వినిపిస్తాయా’ అంటూ అసలు బుద్ధిని చూపించాడు. ఆయనగారు గతంలో టీవీ ఛానెల్స్‌లో బిల్డప్పులకు పోయేవాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఓల్గా రాసిన స్వేచ్ఛ పుస్తకంలో ఇలాంటి హేతువాదుల గురించి ప్రస్తానవ ఉంటుంది. అది 1987లో రాసిన పుస్తకం.. అంటే సోషల్‌మీడియా లేని కాలంలోనూ మరో రూపంలోనూ ఈ ముసుగు హేతువాద దొంగలు ఉండేవారని అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ కొంతమంది తాము దళిత ఉద్యమకారులమని చెప్పుకుంటున్నారు. అయితే వారంతా ప్రతి వివక్షను తిరస్కరిస్తారని అనుకోవద్దు. ఎందుకంటే వివక్ష ఒకే రూపంలో ఉండదు. కులం ఒక రూపం. వయసు ఇంకో రూపం. జెండర్ ఇంకో రూపం. శరీరం ఇంకో రూపం. ఒకదాన్ని మాత్రమే చూసి మిగతావన్నిటిని విస్మరించడం కూడా గుడ్డితనమే అవుతుంది. కొంతమందికి కులం కంపు మాత్రమే పీల్చగలిగే మూర్ఖపు ముక్కు ఉంటుంది. మిగిలిన కంపులు అసలు వీళ్లకి కంపులే కాదు.. వాటిని హాయిగా పీల్చుతారు కూడా.
అందుకే ఈ మహిళకు జరిగిన కథ అందరికీ ఒక హెచ్చరిక. సోషల్ మీడియాలో కనిపించే ముఖాలను నమ్మవద్దు. వారు ఏం మాట్లాడుతున్నారు అనేది కాదు, వారు ఎలా జీవిస్తున్నారనేదే ఇంపార్టెంట్. సంక్షోభం వచ్చినప్పుడు ఎవరు వెనక్కి తగ్గుతున్నారు, ఎవరు నిలబడుతున్నారన్నదే అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే ఈ రోజు ఆమె. రేపు ఇంకెవరో. ముసుగులు మారతాయి. బాధితులు మారతారు. కానీ ముసుగుల్ని గుర్తించకపోతే ఇలాంటి మోసాలు కొనసాగుతూనే ఉంటాయి..!
ALSO READ: మనిషితత్వం, కుక్కతత్వం మధ్య యుద్ధం..! ఈ సమస్యకు అసలు మూలం ఓ దిక్కుమాలినతత్వం!

Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Marriage System: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Business Ideas: ఈ 6 బిజినెస్ ఐడియాస్తో మీరు లక్షలు సంపాదించవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!
Cyclone Ditwah Updates: మరో తుఫాన్ టెన్షన్.. ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్!