Menu

Lagisetty Madhavi: ‘మీ సమస్యలన్నీ తీరుస్తా..’! లక్ష్మాపూర్‌ ప్రజల కోసం నిలబడుతున్న లగిశెట్టి మాధవి…!

Tri Ten B 7 days ago
Lagisetty Madhavi telugu news

కొంతమంది మనుషులు మాటలతో కాదు, మనసుతో స్పందిస్తారు. ఎవరికి సాయం కావాలన్నా అది తమదే అన్నట్టుగా కదిలిపోతారు. అందరికంటే ముందుగా అడుగు వేస్తారు. లగిశెట్టి మాధవి సరిగ్గా అలాంటి మనిషే. ఎవరికి కష్టమున్నా సరే వారికి చేయాల్సింది చేసేవరకు ఆమె దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఒక రోజు నేను(త్రినాథ్‌) బైక్‌ డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు వరుసగా కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. అప్పటికే ఐదు మిస్డ్ కాల్స్. తనకి అత్యవసరమేమో అని తిరిగి కాల్ చేశాను. అయితే తనకు సంబంధించిన విషయం కాదు.. నా ఫ్రెండ్‌ జాబ్‌ కోసం ఆమె చేస్తున్న కాల్స్ అని తెలుసుకున్నాను. తాను ఎప్పుడూ కలవని ఒక వ్యక్తి భవిష్యత్తు గురించి మాధవి పడతున్న తపన చూసి ఎంతో ఆశ్చర్యమేసింది. ఆమె లాభనష్టాలు లెక్కించదు. తన పని, తన కుటుంబమనే స్వార్థముండదు. ఎవరికైనా సాయం చేయాలనే ఒక్క ఆలోచనతో ముందుకు వెళ్లిపోతుంది. ఇదే ఆమె మనసు స్పందించే విధానం. ఇదే ఆమె జీవించే విధానం. అలాంటి మనసే ఈరోజు లక్ష్మాపూర్ గ్రామం 3వ వార్డు ప్రజల వైపు తిరిగింది. మాజీ సీఎం దత్తత గ్రామం అన్న పేరు ఉన్నా, ఇంకా అనేక సమస్యల మధ్య నలుగుతున్న ఈ గ్రామాన్ని చూసి ఆమె మౌనంగా ఉండలేకపోయింది. ఒక వ్యక్తి కష్టాన్ని తనదిగా తీసుకునే మనిషి, ఒక గ్రామం బాధను కూడా దూరం నుంచి చూడలేకపోతుంది. అందుకే కౌన్సిలర్‌గా పోటికి దిగింది.

లగిశెట్టి మాధవి 16ఏళ్లగా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అయితే ఆమె జర్నలిజం కేవలం అక్షరాలు రాయడానికే పరిమితం కాలేదు.. నిజాన్ని చూడగలగడం, సమస్యను అర్థం చేసుకోవడం, బాధను అనుభవించడం ఆమెకు సహజంగా వచ్చిన లక్షణాలు. ఈ తరం జర్నలిజంలో వార్తలు త్వరగా మారిపోతున్న రోజుల్లో, సామాన్యుల కోసం నిలబడుతున్న అరుదైన జర్నలిస్టు ఆమె. కలం పట్టినప్పుడు నిజం వైపు నిలబడుతుంది. అవసరం వచ్చినప్పుడు మాటతోనే కాదు, చేతలతో కూడా పోరాడుతుంది. ఆఫీసులో సహోద్యోగులకు అండగా నిలవడం, అన్యాయం జరిగితే ప్రశ్నించడం, ఎవరికైనా సహాయం కావాలంటే తన వంతు ప్రయత్నం చేయడం ఆమెకు అలవాటు. జర్నలిజం ఆమెకు వృత్తి అయితే, సాటి మనుషుల కోసం నిలబడటం ఆమె స్వభావం. ఉద్యోగం కావాలని ఎవరైనా చెప్పగానే మొదట గుర్తొచ్చే పేరు మాధవి అని ఆమె ఎవరో తెలిసినవాళ్లందరికీ తెలుసు.

ఈ మనసుకు మూలం ఆమె కుటుంబ విలువలే. ఆమె తల్లిదండ్రులతో పాటు మావయ్య, రిటైర్డ్ హెడ్‌మాస్టర్ లగ్గిశెట్టి నాగభూషణం, తాతలను గ్రామంలోని పెద్దలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మానవత్వానికి చిరునామాగా ఉన్న ఆ కుటుంబ విలువలే మాధవిలోనూ కనిపిస్తుంది. ప్రజల మధ్య జీవించి, వారి కష్టసుఖాల్లో భాగస్వాములై ఉండడమే ఈ కుటుంబ స్వభావం. లక్ష్మాపూర్ గ్రామ పరిస్థితులు ఆమెకు తెలియనవికాదు. కేసీఆర్‌ దత్తత గ్రామంమన్న పేరు ఉన్నా రైతు బంధు లాంటి పథకాలు చాలా మందికి అందడం లేదు. ధరణి ఇక్కడే మొదలైనప్పటికీ అసలు హక్కుదారుల పేర్లే లేని పరిస్థితులు ఉన్నాయి.

రాక్ ఏరియాలో డ్రైనేజీ సమస్య ప్రజల జీవితాలను ఇబ్బంది పెడుతోంది. సెప్టిక్ ట్యాంక్ తీసే పరిస్థితి లేక ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. కరకపట్ల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులోకి చేరి ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఇవి కాగితాల మీద రాయాల్సిన వార్తలు మాత్రమే కాదు. పరిష్కరించాల్సిన నిజ జీవిత సమస్యలని మాధవికి తెలుసు. అందుకే ఈసారి మాధవి ప్రజల ముందుకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడింది. రాజకీయ పార్టీల కుళ్లు, స్వార్థపు లక్షణాల సామాన్యులకు ఏ మాత్రం మంచి చేయని కాలమిది. ఇది అందరి కంటే ఓటర్లేగా బాగా తెలుసు. అందుకే ఏ పార్టీ తరుఫున పోటి చేయడంలేదు. స్వతంత్ర(ఇండిపెండెంట్)అభ్యర్థిగా వార్డు స్థాయిలో సేవ చేయాలని మాధవి ఆశిస్తోంది. లక్ష్మాపూర్ గ్రామం 3వ వార్డు ప్రజలందరికీ తోడుగా నిలవాలనుకుంటోంది. ప్రజల కోసం పనిచేసే ప్రతినిధిగా ఉండడం కోసం ఆమె నిత్యం ఆలోచిస్తూనే ఉంటుంది. ఆమె ప్రజల మధ్య నుంచి వచ్చిన మనిషి. ప్రజల మనసు అర్థం చేసుకున్న మనిషి. ఈ గ్రామానికి ఒక కౌన్సిలర్ మాత్రమే కాదు, ఒక చెల్లెలుగా, ఒక కూతురుగా, ఒక అమ్మగా నిలబడాలనుకుంటున్న ఆశ మాధవిది..! అదే ఆమె బలం… అదే ప్రజలకు నమ్మకం..!

:- త్రినాథ్‌, జర్నలిస్ట్

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *