Menu

Jeffrey Epstein Files: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్.. కొత్త లీక్‌లో బయటపడిన సంచలన విషయాలు..!

Lakshmi Aruna 1 week ago
what are epstein files

లైంగిక నేరాలకు పాల్పడి 2019లో అమెరికా జైలులో మరణించిన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా విడుదలైన దర్యాప్తు ఫైల్స్‌లో రాజకీయ, వ్యాపార, రాజకుటుంబాలకు చెందిన పలువురు శక్తివంతమైన వ్యక్తుల పేర్లు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. ముఖ్యంగా మస్క్‌ పేరు ప్రధాన చర్చకు దారి తీసింది. ఇంతకీ ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి?

ఎప్‌స్టీన్ ఎవరు?

ముందుగా జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవరనే విషయాన్ని తెలుసుకోవాలి. బయటకు చూస్తే అతడు ఒక ఫైనాన్షియర్. కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన వ్యక్తులతో పరిచయాలున్నాయి. కానీ మరో వెర్షన్ చూస్తే మాత్రం ఒక చీకటి నెట్‌వర్క్‌ను నడిపిన వ్యక్తిగా ఎప్‌స్టీన్‌ వార్తల్లో నిలిచారు. మైనర్లపై లైంగిక దాడులు, అక్రమ రవాణా చేసినట్టు ఎప్‌స్టీన్‌పై ఆరోపణలున్నాయి. ప్రభావవంతమైన వ్యక్తులను తన చుట్టూ ఉంచుకొని రక్షణ పొందేవాడు.

ఎప్‌స్టీన్ చుట్టూ భయం ఇంత తీవ్రంగా ఉండడానికి అతనిపై ఉన్న లైంగిక దాడుల ఆరోపణలే అసలు కారణం. మైనర్లను లక్ష్యంగా చేసుకొని, వారిని తన ప్రైవేట్ దీవులకు, లగ్జరీ ఇళ్లకు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు అమెరికాను కుదిపేశాయి. బాధితులు చెప్పిన వాంగ్మూలాల ప్రకారం, ఈ దాడులు పక్కా ప్లాన్ చేసి మరీ ఎప్‌స్టీన్ చేశాడు. చిన్న వయసు అమ్మాయిలను డబ్బు, ప్రలోభాలు, బెదిరింపులతో మౌనంగా ఉంచారు. ఎవరు ఎదురు తిరిగినా, ఎప్‌స్టీన్ చుట్టూ ఉన్న శక్తివంతమైన పేర్లే రక్షణగా నిలిచాయన్న ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలే అమెరికాలో ఒక ప్రశ్నను పుట్టించాయి. ఎప్‌స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయగలిగాడా? లేదా అతన్ని కాపాడడానిక ఒక వ్యవస్థ పనిచేసిందా?

ఎవరు విడుదల చేశారు?

ఇక ఇప్పుడు చర్చలో ఉన్న ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటే కోర్టులో ఉన్న ఆరోపణల జాబితా మాత్రమే కాదు. ఇవి వేల పేజీల డాక్యుమెంట్లు. అందులో కాంటాక్ట్ బుక్స్, ఫ్లైట్ లాగ్స్, ఫొటోలు, వాంగ్మూలాల గురించి చర్చ ఉంది. ఇదంతా కలిసి ఒక పెద్ద నెట్‌వర్క్ ఎలా పనిచేసిందో చూపిస్తున్నాయి. ఈ డాక్యుమెంట్లను అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టీస్‌ విడుదల చేసింది. అంటే ఈ డాక్యుమెంట్లేవి కూడా ఇవి మీడియా లీకులు కాదు. ప్రభుత్వమే అధికారికంగా బయటపెట్టిన రికార్డులు. ఈ ప్రక్రియలో ఎప్‌స్టీన్ బాధితులను ప్రాతినిధ్యం వహించిన న్యాయవాదులు, ఇప్పటివరకు గుర్తించని పేర్లను కూడా సమర్పించాలని న్యాయశాఖ కోరింది. ఆ మొత్తం ప్రక్రియలో 1,200 మందికి పైగా వ్యక్తుల పేర్లను గుర్తించారు. ఇక్కడే అమెరికాలో భయం మొదలైంది. అయితే ఈ జాబితాలో ఉన్న ప్రతి పేరు నేరానికి నేరుగా సంబంధం ఉందని అర్థం కాదు. కానీ పేరు ఉండటం అంటే.. ఎప్‌స్టీన్ చుట్టూ తిరిగిన వలయంలో భాగమయ్యారని అర్థం

కొత్త ఫైల్స్ ఎందుకు కీలకం?

అమెరికా కోర్టు ఆదేశాల మేరకు విడుదలైన ఈ పత్రాల్లో ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఈమెయిల్స్, ఇంటర్నల్ నోట్స్, సాక్షుల వాంగ్మూలాల భాగాలు ఉన్నాయి. ఇవి నేర నిర్ధారణకు సంబంధించిన పత్రాలు కాకపోయినా, ఎప్‌స్టీన్ ఎంత విస్తృతమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నాడో స్పష్టంగా చూపిస్తున్నాయి.

ట్రంప్‌పై ఆరోపణలు:

ఈ ఫైల్స్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రస్తావనకు రావడంతో తీవ్ర చర్చ మొదలైంది. అయితే దీనిపై అమెరికా న్యాయశాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలు ఎక్కువగా అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చినవి, ధ్రువీకరణ లేనివని తెలిపింది. 2020 అధ్యక్ష ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవని న్యాయశాఖ పేర్కొంది. ట్రంప్‌పై ఎలాంటి నేరారోపణలు లేవని అధికారులు స్పష్టం చేశారు.

ప్రిన్స్ ఆండ్రూ పాత్రపై మరోసారి దృష్టి

బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ పేరు కూడా ఈ కొత్త ఫైల్స్‌లో కనిపించింది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు విందుకు రావాలని, ప్రైవేట్ సమయం గడపాలని ఎప్స్టీన్‌ను ఆహ్వానించినట్లు ఈమెయిల్స్ ద్వారా వెల్లడైంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ప్రిన్స్ ఆండ్రూ, గతంలోనే రాజకుటుంబ అధికారిక బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

మస్క్, బ్రాన్సన్ ఈమెయిల్ సంభాషణలు

టెక్, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు ఎలాన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్‌లతో ఎప్స్టీన్ జరిపిన ఈమెయిల్ సంభాషణలు కూడా ఈ ఫైల్స్‌లో ఉన్నాయి. ఎప్స్టీన్‌కు చెందిన కరేబియన్ ప్రైవేట్ ద్వీపంలో జరిగే పార్టీల గురించి సరదాగా జరిగిన ఈ చర్చలు ఇప్పుడు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ పేర్లు ప్రస్తావనకు వచ్చినంత మాత్రాన వీరిపై కూడా ఎలాంటి నేరారోపణలు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పేరు రావడం అంటే నేరం కాదు:

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎప్‌స్టీన్ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి రాజకీయాలు, వ్యాపారం, రాజకుటుంబాల వరకు సంబంధాలు పెంచుకున్నాడు. ఈ ఫైల్స్‌లో పేరు రావడం అనేది నేరానికి ఆధారం కాదని, కేవలం పరిచయాలు లేదా కమ్యూనికేషన్ ఉన్నట్టు మాత్రమే సూచిస్తుందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.

ఎందుకు ఇంకా వెంటాడుతోంది?

జెఫ్రీ ఎప్‌స్టీన్ జైలులో అనుమానాస్పదంగా మరణించడంతో, అతని నెట్‌వర్క్‌కు సంబంధించిన అనేక ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం లేకుండా ఉన్నాయి. ఈ కొత్త ఫైల్స్ విడుదలతో, న్యాయం, శక్తి, డబ్బు మధ్య ఉన్న సంబంధాలపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇక ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసు కేవలం ఒక వ్యక్తి చేసిన నేరాల కథ మాత్రమే కాదు. ఇది శక్తివంతుల ప్రభావం న్యాయవ్యవస్థపై ఎలా పనిచేస్తుందో చూపించే ఉదాహరణగా మారింది. భవిష్యత్తులో మరిన్ని పత్రాలు వెలుగులోకి వస్తాయా, మరింత నిజం బయటపడుతుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

ALSO READ: ట్రంప్‌ తలతిక్క పనులు.. అమెరికాకే ఎసరు..ఈ లెక్కలే సాక్ష్యం!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *