ప్రపంచ రాజకీయాల్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈసారి కేంద్రబిందువు… ఇరాన్. “సమయం మించిపోతోంది” అంటూ అమెరికా ఇరాన్‌కు ఇచ్చిన హెచ్చరిక… అయితే ఇది కేవలం మాటలకే పరిమితమా? లేక ఇది మరో పెద్ద యుద్ధానికి ముందస్తు సంకేతమా? గల్ఫ్ ప్రాంతంలో అమెరికా యుద్ధ విమానాలు, నౌకలు, డ్రోన్లు వరుసగా మోహరిస్తున్న వేళ… అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి.
“శక్తివంతమైన నౌకాదళం ఇరాన్ వైపు వేగంగా కదులుతోంది” అన్న ట్రంప్ మాటలు… కేవలం రాజకీయ ఒత్తిడా? లేక యుద్ధానికి సిద్ధమయ్యే సంకేతమా? ఇరాన్ అణు ఒప్పందంపై చర్చలకు రావాలంటూ ట్రంప్ చేసిన పిలుపు వెనుక అసలు భయం ఏంటి అంటే… ఇరాన్ అణ్వాయుధాల దిశగా అడుగులు వేస్తోందన్న అమెరికా అనుమానం. దీనికి ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గలేదు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ దీనిపై స్పందిస్తూ…“మా సైన్యం ట్రిగ్గర్‌పై వేలుపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఎటునుంచి దాడి వచ్చినా వేగంగా, దీటుగా బదులిస్తాం” అని స్పష్టంగా హెచ్చరించారు.
అంటే… మాటల యుద్ధం ఇప్పుడు సైనిక హెచ్చరికల దాకా వచ్చేసింది. ఇరాన్ పదే పదే చెబుతున్న మాట ఒక్కటే…తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనది. అణ్వాయుధాలు తమ భద్రతా విధానంలోనే లేవని… వాటిని తయారు చేసే ఆలోచన కూడా లేదని ఇరాన్ అంటోంది. కానీ అమెరికా, దాని మిత్రదేశాలు ఈ మాటలను నమ్మడం లేదు. ఈ పరిస్థితికి మరో ప్రమాదకర కోణం కూడా ఉంది.
ఇరాన్‌లో ఇటీవల జరిగిన భారీ నిరసనలు. కరెన్సీ కుప్పకూలడం… ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం… ఇవి ప్రజలను రోడ్డెక్కించాయి. ఆ నిరసనలు కేవలం ఆర్థిక అసంతృప్తితో ఆగలేదు… నేరుగా దేశ మత నాయకత్వాన్నే సవాలు చేసే స్థాయికి వెళ్లాయి. ఆ సమయంలో… “సాయం వస్తోంది” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిరసనకారుల్లో ఆశలు రేపాయి. కానీ ఆ తర్వాత… ఆ మాటల నుంచి ట్రంప్ వెనక్కి తగ్గారు. నిరసనకారుల ఉరిశిక్షలు నిలిచిపోయాయంటూ సమాచారం వచ్చిందని మాత్రమే చెప్పారు. ఇక్కడే మరో భయానక నిజం బయటపడుతోంది. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం…నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 6 వేల మందికి పైగా మరణించారు. ఇంటర్నెట్ నిలిపివేసిన సమయంలో… అసలు ఎన్ని ప్రాణాలు పోయాయో ప్రపంచానికి కూడా పూర్తిగా తెలియదు.
కొన్ని నివేదికలైతే… మరణాల సంఖ్య 25 వేలకు మించవచ్చని హెచ్చరిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో… ఇరాన్ ప్రభుత్వం బలహీనంగా ఉందన్న అంచనాకు అమెరికా వచ్చింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇదే చెప్పారు. “ఇరాన్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉంది… ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొనే స్థితిలో లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో… అమెరికా తన సైనిక శక్తిని స్పష్టంగా ప్రదర్శిస్తోంది. గల్ఫ్ ప్రాంతానికి భారీ స్థాయిలో ఫైటర్ జెట్లు… కార్గో విమానాలు…ఇంధనం నింపే విమానాలు…డ్రోన్లు…గూఢచార విమానాలు తరలిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. అమెరికా నౌకాదళానికి నాయకత్వం వహిస్తున్న విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇప్పటికే మిడిల్ ఈస్ట్‌కు చేరుకుంది. ట్రంప్ దీనిని “ఆర్మాడా”గా వర్ణించారు. అంటే… అవసరమైతే విధ్వంసం సృష్టించడానికైనా వెనుకాడబోమన్న సంకేతం.
ఇరాన్ కూడా ఖాళీగా కూర్చోలేదు. తాజాగా ప్రవేశపెట్టిన డ్రోన్ వాహక నౌక ఐఆర్ఐఎస్ షాహిద్ బఘేరీని తీరప్రాంతంలో మోహరించింది. అంటే… ఇరు దేశాలూ యుద్ధానికి సిద్ధమవుతున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఉద్రిక్తతలకు మూలం… 2015 అణు ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం ఇరాన్ యురేనియంను పరిమిత స్థాయిలో మాత్రమే శుద్ధి చేయాలి. కానీ ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఆ ఒప్పందాన్ని విరమించుకున్నారు.ఆంక్షలు విధించారు. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.
ప్రతిస్పందనగా… ఇరాన్ కూడా ఒప్పంద పరిమితులను పక్కనబెట్టింది.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే… ఇది కేవలం ఒత్తిడి రాజకీయమా? లేదా మరో మిడిల్ ఈస్ట్ యుద్ధానికి ప్రపంచం సిద్ధమవుతోందా? ఒక్క విషయం మాత్రం స్పష్టం… ఈ యుద్ధం జరిగితే… దాని ప్రభావం ఇరాన్, అమెరికా వరకు మాత్రమే కాదు. చమురు ధరలు… ప్రపంచ ఆర్థిక వ్యవస్థ… అంతేకాదు… భారత్ లాంటి దేశాలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకే ప్రశ్న అడుగుతోంది… ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ వెనక్కి తగ్గుతుందా? లేదా… ఈసారి మాటలు కాదు… తూటాలే మాట్లాడతాయా?
ALSO READ: స్మశానంలో మొదలై, చరిత్రగా మారిన ఒక అమ్మ జీవితం.. సింధుతాయ్ సప్కల్ జీవన ప్రయాణం!
