Menu

Penguin: ఎక్కడికి వెళ్తున్నాం మనం? నిహిలిస్ట్ పెంగ్విన్ ప్రశ్న..!

Lakshmi Aruna 2 weeks ago

చలితో గడ్డకట్టిన భూమి… చుట్టూ శూన్యం.. ముందూ వెనుకా ఎవరూ లేరు. ఆ నిశ్శబ్దంలో ఒక పెంగ్విన్ నడుస్తోంది. పరుగెత్తడం లేదు. తొందరపడటం లేదు. వెనక్కి తిరిగి చూడటం లేదు. ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎందుకు వెళ్తుందో తెలియదు. అయినా నడక మాత్రం ఆగడం లేదు. ఇదే దృశ్యం 2026లో ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. ఇంటర్నెట్ దీనికి పెట్టిన పేరు.. “నిహిలిస్ట్ పెంగ్విన్”. జీవితం మీద నమ్మకం కోల్పోయినట్టు, అర్థం లేని దారిలోకి నడిచే జీవి అనే భావనతో ఈ వీడియో ఒక ప్రతీకగా మారిపోయింది.

ఈ వీడియో చూసిన చాలా మందికి ఇది ఒక పెంగ్విన్ కథలా అనిపించలేదు. ఇది మనుషుల జీవితంలా అనిపించింది. రోజూ లేచి, అదే పనికి వెళ్లి, అదే ఒత్తిడిని భరిస్తూ, “నేను ఎందుకు ఇదంతా చేస్తున్నాను?” అనే ప్రశ్నకి సమాధానం లేకుండా ముందుకు నడిచే మనుషుల్లా కనిపించింది. లక్ష్యం ఉందో లేదో కూడా తెలియని ప్రయాణం.. కానీ ఆగిపోవడానికి ధైర్యం లేని నడక. ఈ పెంగ్విన్‌లో చాలామంది తమని తాము చూసుకున్నారు. కానీ ఈ దృశ్యం వెనుక నిజమయితే చాలా పాతది. ఇది 2007లో వచ్చిన Encounters at the End of the World అనే డాక్యుమెంటరీలోని ఒక సన్నివేశం. అప్పట్లో ఎవ్వరూ పెద్దగా గమనించని ఈ క్లిప్, ఇప్పుడు మాత్రం కోట్ల మందిని కలిచివేస్తోంది. ఎందుకంటే అప్పటి ప్రపంచం వేరు.. ఇప్పటి ప్రపంచం వేరు. అప్పట్లో ఇది ఒక వన్యప్రాణి ప్రవర్తనగా కనిపించింది. ఇప్పుడు మాత్రం ఇది మన అంతర్గత శూన్యతకు అద్దంలా మారింది.

శాస్త్రం ఏం చెబుతుంది అంటే..? ఆ పెంగ్విన్‌కు ఎలాంటి తాత్త్విక ఆలోచనలు లేవు. అది జీవితం అర్థం గురించి ఆలోచించలేదు. దారి తప్పడం, గుంపు నుంచి విడిపోవడం, దిక్కుతెలియక నడవడం.. ఇవన్నీ ప్రకృతిలో సహజంగా జరిగే విషయాలు. కానీ మనుషులు ఆ నిజాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే మనం నిజం వెతకడం మానేసిన రోజుల్లో ఉన్నాం. మనకి కావాల్సింది అర్థం. ఆ అర్థం నిజం నుంచి రావాలా, ఊహ నుంచి రావాలా అనే విషయం ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడే ఈ వీడియో ప్రమాదకరంగా మారుతుంది. ఒక జంతువు చేసే సహజ చర్యను మనం ఒక లోతైన తాత్త్విక ప్రతీకగా మార్చేస్తాం. నిజానికి ఈ పెంగ్విన్ మనల్ని ప్రశ్నించలేదు. మనమే ఈ పెంగ్విన్‌ను ఉపయోగించి మన జీవితాన్ని మనమే ప్రశ్నించుకున్నాం. “మనమూ ఇలాగే అర్థం లేకుండా నడుస్తున్నామా?” అనే సందేహం మనలోనే పుట్టింది.

నిహిలిజం అంటే ఏమిటి? జీవితం‌కు అంతర్లీన అర్థం లేదని నమ్మే ఆలోచన. ఈ పెంగ్విన్ వీడియో అదే భావనను బలంగా తాకింది. ఎందుకంటే ఈ తరం చాలా మందికి జీవితం ఒక పోటీగా, ఒక బరువుగా, ఒక అంతులేని బాధ్యతగా మారిపోయింది. గెలిచినా సంతృప్తి లేదు. ఓడినా ఆగే అవకాశం లేదు. మధ్యలో ఉన్నవాళ్లకు అయితే ఇంకా ప్రశాంతత లేదు. ఈ పరిస్థితిలో “ఎక్కడికి వెళ్తున్నాం?” అనే ప్రశ్న సహజంగా పుడుతుంది. ఈ పెంగ్విన్ వెనక్కి తిరిగి చూడదు. ఎందుకంటే దానికి గతం మీద పశ్చాత్తాపం లేదు. ముందెక్కడ ఏముంది అన్న భయం కూడా లేదు. కానీ మనుషుల పరిస్థితి వేరు. మనం వెనక్కి చూసుకుంటూ బాధపడతాం, ముందుకు చూస్తూ భయపడతాం, మధ్యలో మాత్రం ఖాళీగా నడుస్తాం. అందుకే ఈ వీడియో మనల్ని ఇంత లోతుగా తాకింది.

ఇంటర్నెట్ మీమ్స్‌లో ఇది జోక్‌లా కనిపించినా, లోపల మాత్రం చాలా చీకటి ఉంది. నవ్వుతూ షేర్ చేసే వాళ్లలో కూడా ఒక మౌనమైన అలసట ఉంది. ఇది కేవలం ఒక ట్రెండ్ కాదు. ఇది ఒక కాలం యొక్క మనస్తత్వం. మాటలతో చెప్పలేని ఖాళీని, ఒక పెంగ్విన్ నడక చూపించింది. చివరగా చెప్పాల్సిన ఒక నిజం ఏంటంటే.. ఈ కథ పెంగ్విన్ గురించి కాదు. ఇది మన గురించి. మనం ఎటు వెళ్తున్నామో తెలియకపోయినా, ఆగిపోవడానికి భయపడే మనస్థితి గురించి. ఆ పెంగ్విన్ చివరకు ఏమయ్యిందో మనకు తెలియదు. కానీ మన ప్రయాణం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక మిగిలిన ప్రశ్న ఒక్కటే మనం నడుస్తున్నది జీవితం వైపా, లేక శూన్యం వైపా?

ALSO READ: మనిషితత్వం, కుక్కతత్వం మధ్య యుద్ధం..! ఈ సమస్యకు అసలు మూలం ఓ దిక్కుమాలినతత్వం!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *