Menu

నన్ను నాలా బ్రతకనివ్వని ఈ సమాజం నాకెందుకు? నిన్ను నీలాగే ప్రేమించు. నిన్ను నీలాగే గౌరవించు!

Lakshmi Aruna 3 weeks ago

మనలో చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది “నేను నాలా బ్రతకడం ఇంత పెద్ద నేరమా” అని ఈ కథ ఒక అమ్మాయి కథ కాదు ఒక అబ్బాయి కథ కాదు ఇది మనందరి కథ.

మనల్ని మనలాగా ఉండనివ్వని ప్రశ్నలు, మనలోనే ఒక విప్లవాన్ని మొదలుపెడతాయి.

అన్విత…చిన్నప్పటి నుంచే చాలా ప్రశాంతమైన అమ్మాయి. అందరికంటే భిన్నంగా ఆలోచించేది. అమ్మాయిలంటే ఇలా ఉండాలి అబ్బాయిలంటే అలా ఉండాలి అనే మాటలు చిన్నప్పటినుంచే విన్నా.. తన మనసులో ఉన్నదే నిజం అనేది ఆమె నమ్మకం. కానీ, కాలేజీకి వచ్చిన తర్వాత తన జీవితం మారిపోయింది తనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటే చుట్టూ పిచ్చి చూపులు, ఎగతాళి మాటలు, వెకిలి నవ్వులు. తనకు నచ్చిన సబ్జెక్ట్ ఎంచుకుంటే ఇంట్లో ప్రశ్నలు. తనకు నచ్చిన వ్యక్తితో మాట్లాడితే అనుమానాలు. ఇలా రోజురోజుకీ ఆమె జీవితంలో తాను తనలా ఉండడం కష్టం అయిపోయింది.

ప్రపంచం నేర్పిన నియమాలకంటే, మన మనసు చెప్పిన నిజం గొప్పది

ఒక రోజు అద్దంలో తన ముఖాన్ని చూసుకుని అన్విత తనను తానే అడిగింది “నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను నా కోసం కాదు వాళ్ల కోసం కదా” అని. అప్పుడు ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే తన నవ్వు నిజమైనది కాదు.. తన నిశ్శబ్దం శాంతి కాదు.. అది భయం. ఒక రోజు బస్సులో వెళ్తూ ఆమె ఒక అమ్మాయిని చూసింది. ఆ అమ్మాయి తన ఇష్టం వచ్చినట్లు నవ్వుతూ మాట్లాడుతూ స్వేచ్ఛగా కనిపించింది. అప్పుడు అన్విత మనసులో ఒక ప్రశ్న మెదిలింది “అలా ఉండడం తప్పా” అని. అదే రోజు ఇంటికి వచ్చి తల్లి ముందు నిలబడి మొదటిసారి ధైర్యంగా మాట్లాడింది. “అమ్మా నేను తప్పు చేయడం లేదు నేను నాలా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను” తల్లి మొదట అర్థం చేసుకోలేదు కోపంగా మాట్లాడింది బాధపడింది కానీ అన్విత కన్నీళ్లతో ఒక్క మాట మాత్రమే చెప్పింది “నేను మీ కుమార్తెనే కానీ మీ కలల ప్రతిరూపం కాదు” ఆ మాట తల్లిని మౌనంగా ఆలోచించేలా చేసింది.

ఇతరుల స్వేచ్ఛ మనల్ని ప్రశ్నించినప్పుడు, మనలో నిద్రపోతున్న ధైర్యం మేల్కొంటుంది

ఆ రోజు నుంచి అన్విత జీవితం ఒక్కసారిగా మారలేదు కానీ ఆమె మనసు మారింది ఇకపై ఆమె తనను తాను దాచుకోవడం మానేసింది. చిన్న చిన్న నిర్ణయాల్లో తన మనసు మాట వినడం మొదలుపెట్టింది. తనకు నచ్చిన దుస్తులు , తనకు నచ్చిన మాటలు , తనకు నచ్చిన మార్గం. మొదట చుట్టూ ఉన్నవాళ్లు నవ్వారు,విమర్శించారు. కానీ అన్విత ఇప్పుడు ఎవరికి భయపడి వణకలేదు బెనకలేదు. ఎందుకంటే ఆమెకు ఒక నిజం అర్థమైంది. “తనను అర్థం చేసుకోని వాళ్ల కోసం తను తనని మార్చుకోవాల్సిన అవసరం లేదు అని ఆమె గ్రహించింది.

అర్థం చేసుకోని ప్రపంచానికి మనను నిరూపించాల్సిన బాధ్యత మనకు లేదు

ఒక రోజు ఆమె ఒక చిన్న పిల్లవాడిని చూసింది. వాడు ఎవరి మాట వినకుండా నేల మీద కూర్చుని చిత్రాలు గీస్తున్నాడు.. అందరూ తిడుతున్నారు కానీ వాడు మాత్రం నవ్వుతున్నాడు. ఆ పిల్లవాడిలో అన్విత తన చిన్ననాటి రూపాన్ని చూసింది. అప్పుడు ఆమె మనసులో ఒక మాట వచ్చింది “మనందరం ఒకప్పుడు ఇలాగే స్వేచ్ఛగా ఉన్నాం.. కానీ సమాజం మెల్లగా మన రెక్కలు కత్తిరించింది” అన్విత ఇప్పుడు అందరికీ ఒకటే సందేశం ఇస్తోంది.. నువ్వు నీలా ఉండటం తప్పు కాదు నీవు భిన్నంగా ఉండటం నేరం కాదు. నువ్వు నిజంగా బ్రతకడం అంటే సమాజం చెప్పిన మార్గంలో నడవడం కాదు.నీ మనసు చూపిన దారిలో నడవడం

నిన్ను నీవుగా అంగీకరించిన రోజే… నీవు నిజంగా బ్రతకడం మొదలుపెడతావు

ఈ కథ కేవలం అన్వితది మాత్రమే కాదు. ఇది నాది.. నీది.. మనందరిది. ఎందుకంటే మనందరికీ ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్న మదిలో మెదిలే ఉంటుంది. “నన్ను నాలా బ్రతకనివ్వని ఈ సమాజం నాకెందుకు” అని. కానీ నిజం ఏంటంటే ఈ సమాజం మనల్ని మార్చలేదు. మనల్ని మనం మార్చుకుంటే మాత్రమే మన జీవితం మారుతుంది. కాబట్టి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో.. నువ్వు నీలా ఉండాలని.. నిజంగా బ్రతకాలని.. నువ్వు భయాన్ని కాదు.. నీ కలలను వినాలని. ఎందుకంటే ఈ జీవితం మళ్లీ రాదు నీవు కూడా మళ్లీ ఈ వయసులో ఉండవు కాబట్టి నిన్ను నీలాగే ప్రేమించు. నిన్ను నీలాగే గౌరవించు. నిన్ను నీవుగా అంగీకరించు ఇదే నిజమైన స్వేచ్ఛ ఇదే నిజమైన జీవితం.

ALSO READ: పాత చింతకాయ పచ్చడి ప్రసంగాలు మానుకుంటే చాలా మంచిది..! వారి పట్ల ఇంత వివక్ష ఎందుకు?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *