చీర కట్టుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా? ఎవరు తన వైపు చూడరు కదా? ఆమెను తాకాలి అనిపించదు కదా? ఇది కొందరు చేసిన కామెంట్స్.
“చీర కట్టుకుంటే ఎవరూ తాకరు” అనే మాటలో ఉన్నది భద్రత కాదు… ఒక భయం వుంది. ఇది ఒక హెచ్చరిక కాదు, ఒక షరతు. నువ్వు ఇలా ఉంటేనే సురక్షితంగా ఉంటావు అనే రూల్ సమాజం ఆడవాళ్ళ మీద బలవంతంగా రుద్దేసిన రూల్ అది . ఈ షరతు ఎవరిపై పెట్టారు? నేరస్తుడిపై కాదు. బాధితురాలిపై. ఇదే ఈ వాక్యం చేసే మొదటి అన్యాయం.
నిజంగా చీరే గనుక స్త్రీకి రక్షణ అయితే, ఈ భారతదేశం మహిళలకు ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ లక్షలాది మంది మహిళలు రోజూ చీర కట్టుకుంటారు. కానీ అలా ఉందా? చీర కట్టుకున్న మహిళపై దాడి జరిగితే మనం ఏం అంటాం? “అది అపవాదం” అంటాం. అదే జీన్స్ వేసుకున్న మహిళపై జరిగితే “ఆ డ్రెస్సు వేసింది అందుకే అలా జరిగింది” అంటాం. ఇక్కడే అసలు సమస్య ఉంది. నేరాన్ని కాదు, దుస్తులను విశ్లేషించడం.
ఇప్పుడు మీరు ఒక్కసారి మీ ఇంట్లోకి వెళ్లి చూడండి. తల్లి ముందు, తండ్రి ముందు, అన్నల ముందు చిన్నపిల్లలు బట్టలు విప్పుకుని, లేదంటే షార్ట్‌లో లేక స్లీవ్‌లెస్‌లో తిరుగుతారు కదా. అక్కడ ఎవరికైనా చెడ్డ ఆలోచన వస్తుందా? రాదు కదా. ఎందుకంటే అక్కడ చూపు శరీరాన్ని చూడటం లేదు. అక్కడ చూపు సంబంధాన్ని చూస్తుంది. బంధాన్ని చూస్తుంది. అక్కడ “స్త్రీ–పురుషుడు” అనే కోణం లేదు. “మన వాళ్లు” అనే భావన మాత్రమే ఉంది. అదే విధంగా ఒక యువతి తన తండ్రి ముందు షార్ట్ వేసుకుంటుంది. ఆమె కాళ్లు కనిపిస్తాయి. చేతులు కనిపిస్తాయి. కానీ తండ్రి మనసులో ఎలాంటి భావన పుడుతుంది? రక్షణ. బాధ్యత. ప్రేమ అంతే కదాలేక తండ్రి కామంతో కూతుర్ని చూడగలడా? అక్కడ ఎందుకు చెడ్డ ఆలోచన రాదు? ఎందుకంటే తన ఇంట్లో ఆడదాన్ని శరీరంగా చూడటం తండ్రి నేర్చుకోలేదు. ఆమెను మనిషిగా చూడటం అతనికి సహజం కాబట్టి.
ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదే శరీరం, అదే కాళ్లు, అదే చేతులు… పరాయి స్త్రీ అయితే ఎందుకు మనిషిగా కనిపించదు? ఎందుకు మొదట శరీరమే కనిపిస్తుంది? ఇక్కడే సమాజం నేర్పిన వక్ర బుద్ధి బయటపడుతుంది. ఇది సహజం కాదు. ఇది సమాజం మనకు నేర్పిన ఆలోచన. సినిమాలు, సంభాషణలు, జోకులు, మాటలు అన్నీ కలసి ఆడదాన్ని ఒక “విజువల్ ఆబ్జెక్ట్”గా మార్చాయి. “చీర కట్టుకుంటే ఎవరూ తాకరు” అన్న మాట ఈ ఆలోచనకే మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఈ ఆలోచన ఆడది తన శరీరాన్ని దాచుకుంటేనే సురక్షితం అని చెబుతుంది. అంటే శరీరమే సమస్య అన్నమాట. కానీ నిజంగా సమస్య శరీరమా? లేక శరీరాన్ని చూసే చూపా?
ఇప్పుడు ఒక విషయం గమనించండి. ఒక నేరం జరిగినప్పుడు మనం మొదట అడిగే ప్రశ్నలు ఏమిటి? ఆమె ఏం వేసుకుంది? ఆమె అక్కడికి ఎందుకు వెళ్లింది? ఆమె ఒంటరిగా ఎందుకు ఉంది? ఇవన్నీ నేరాన్ని అర్థం చేసుకునే ప్రశ్నలు కావు. ఇవి బాధ్యతను బాధితురాలిపై నెట్టే ప్రయత్నాలు. నేరస్తుడిని ప్రశ్నించాల్సిన చోట, ఆడదాన్ని విచారించడమే ఇది. చీర ఒక వస్త్రమే. దానికి మానసిక నియంత్రణ శక్తి లేదు. అది మగవాడి ఆలోచనను మార్చదు. నిజంగా మగవాడికి గౌరవం ఉంటే, ఆడది ఏం వేసుకున్నా తాకడు. గౌరవం లేకపోతే, ఆమె ఏం కట్టుకున్నా తాకుతాడు. ఈ నిజాన్ని అంగీకరించకపోవడమే సమాజం చేసే పెద్ద మోసం.
ఇక్కడ ఇంకో విషయం స్పష్టంగా చెప్పాలి. “చీర కట్టుకుంటే ఎవరూ తాకరు” అనే మాట ఆడవాళ్లకే చెబుతారు. మగవాళ్లకు ఎప్పుడైనా “నీ చూపు అదుపులో పెట్టుకో” అని చెప్పారా? “నీ ఆలోచనలు శుభ్రంగా ఉంచుకో” అని చెప్పారా? “నువ్వు ఎలా చూస్తున్నావో సరి చూసుకో” అని చెప్పారా? లేదు. బాధ్యత ఒక్క వైపే. మన పెంపకంలోనే లోపం ఉంది. ఆడపిల్లకు చిన్నప్పటి నుంచే భయం నేర్పుతాం. జాగ్రత్త నేర్పుతాం. పరిమితులు నేర్పుతాం. కానీ మగపిల్లలకు నియంత్రణ నేర్పించం. గౌరవం నేర్పించం. సరిహద్దులు చెప్పం. తర్వాత పెద్దయ్యాక అతని చూపును చూసి ఆశ్చర్యపడతాం.
పురాణాలలో చీర సంప్రదాయం లేదు. అసలు బ్లౌజ్ ఉండేది కాదు. వాళ్ళు ఒక కుట్టని సాదా వస్త్రాన్ని కప్పుకునేవారు. మగవారు సాదా వస్త్రాన్ని ధోతి లాగా చుట్టుకునేవారు. ఇంత మాట్లాడే మగవారు.. మీరు ధోతి ఎందుకు ధరించటం లేదు. ప్రతీ విషయంలో ఆడవారిని వేలెత్తి చూపించే మీరు మీ వివక్షతను ఎందుకు కోల్పోతున్నారు. నాగరికతకు తగ్గట్టు ప్రతి ఒక్కరు మారాలి. అప్పట్లో గోచీలు కట్టుకుని స్నానాలు చేసే వారు మరి మీరు అలానే చేస్తున్నారా? చీర కట్టిన స్త్రీలను చూసి మీరు ఏనాడూ కామెంట్స్ చేయలేదా? సొల్లు కార్చలేదా ? ముందు మీ బుద్ధి మార్చుకోండి. తరువాత నీతులు చెప్పండి.
చివరికి చెప్పాల్సిన నిజం ఒక్కటే. ఆడది ఏం కట్టుకుందో భద్రత నిర్ణయించదు. ఆడదాన్ని మనిషిగా చూసే సంస్కారమే భద్రత నిర్ణయిస్తుంది. చీర గౌరవానికి గుర్తు కావచ్చు. కానీ గౌరవానికి కారణం కాదు. గౌరవం మనసులో పుడుతుంది. చూపులో కనిపిస్తుంది. ప్రవర్తనలో బయటపడుతుంది. ఆ రోజు మనం “చీర కట్టుకుంటే ఎవరూ తాకరు” అని కాకుండా “మనసు శుభ్రంగా ఉంటే ఎవ్వరికి పరాయి స్త్రీని తాకాలి అనిపించదు” అని చెప్పడం మొదలుపెట్టిన రోజే నిజమైన మార్పు మొదలవుతుంది.
Women Dress Controversy: సీతాదేవి ఎందుకు అగ్నిపరీక్ష చేయాల్సి వచ్చింది? ద్రౌపది ఎందుకు సభలో నిస్సహాయంగా నిలబడాల్సి వచ్చింది?