“పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి” అని చాలామంది చాలా తేలిగ్గా చెప్పేస్తారు. కానీ అదే పెళ్లిలో ప్రేమ లేకపోతే? బాధ్యత లేకపోతే? అసలు గౌరవమే లేకపోతే అలాంటి బంధం నిజంగా నిలబడుతుందా అనే ప్రశ్నను ఎవరూ బహిరంగంగా అడగరు. బయటకి బాగున్నట్టే కనిపిస్తుంది కానీ లోపల ఇద్దరూ ఒంటరిగా బ్రతుకుతుంటారు. అప్పుడు అది పెళ్లి కాదు, ఇద్దరు మనుషుల మధ్య భరించలేనిదిగా మారే కఠిన శిక్ష.
బాధ్యత లేని పెళ్లి ఎన్ని సంవత్సరాలు సాగినా అది జీవితం కాదు, కేవలం అలవాటు మాత్రమే. ఒకరి కష్టం మరొకరికి కనిపించదు. ఒకరి కన్నీళ్లు మరొకరికి అర్థం కావు. ప్రేమ మాటల్లో మాత్రమే ఉంటుంది, పనుల్లో కనిపించదు. అలాంటి పెళ్లి నిలబడిందని మనం చెప్పుకుంటాం కానీ నిజానికి అది నిలబడటం కాదు, బలవంతంగా ముందుకు లాగించడమే.
కానీ అలా ఉన్నా కూడా పెళ్లిని పెద్దవాళ్లు ఎందుకు సమర్థిస్తారనే ప్రశ్న వస్తుంది. వాళ్ల తరం నేర్చుకున్నది ఒక్కటే. “ఒక స్త్రీ భర్త నుండి విడిపోతే సమాజం ఏమంటుంది?”. సంతోషం కంటే పేరు ముఖ్యమైపోయిన కాలం అది. బాధపడుతున్న పిల్లల కళ్లలో కన్నీళ్లు వాళ్లకు కనిపించవు కానీ బంధువుల మాటలు మాత్రం గట్టిగా వినిపిస్తాయి. అందుకే “అడ్జస్ట్ అవ్వు” అన్న మాట వాళ్లకు సులభంగా వస్తుంది.
ఇక్కడే ఒక పెద్ద అన్యాయం జరుగుతుంది. బాధ పడుతున్నవాడు “మాకు వద్దు” అని చెప్పినా, “కలిసి ఉండాలి” అని ఒత్తిడి పెడతారు. ప్రేమ లేని ఇంట్లో, భయం ఉన్న గదిలో, గౌరవం లేని బంధంలో ఉండమని చెప్పడం నిజంగా మంచికోసమేనా? లేక పెద్దవాళ్ల మనసుకు శాంతికోసం మాత్రమేనా? లేక వాళ్ళ పరువు కాపాడుకోవటానికేనా?
చాలా సార్లు పెళ్లి నిలబెట్టడాన్ని గొప్పగా చూస్తారు కానీ ఆ పెళ్లిలో మనిషి చనిపోతున్నాడా లేదా అన్నది ఎవ్వరూ చూడరు. ప్రతి రోజు తక్కువగా మాట్లాడటం, తనని తాను కోల్పోవడం, తన భావాలను మింగేయడం.. ఇవన్నీ నెమ్మదిగా జరిగే మరణాలే. కానీ ఇవి బయటకి కనిపించవు కాబట్టి సమాజానికి పెద్ద సమస్యగా అనిపించవు.
పెళ్లి అంటే ఒక త్యాగం అని నేర్పారు కానీ ఎవరి కోసం త్యాగం అన్నది మాత్రం ఎవరూ చెప్పలేదు. త్యాగం ఒకరే చేస్తే అది ప్రేమ కాదు, అది దోపిడీ. బాధ్యత ఇద్దరిదీ అయితేనే పెళ్లి నిలబడుతుంది. ఒక్కరి ఓపిక మీద, ఒక్కరి మౌనంపై నిలబడే పెళ్లి ఎప్పటికైనా కూలిపోతుంది.
ఇంకో కఠినమైన నిజం ఏంటంటే, పెద్దవాళ్లు తమ కాలంలో భరించిన బాధలను సత్యంగా భావిస్తారు. “మేమూ భరించాం కదా” అనే ఆలోచన వాళ్లకు గర్వంగా మారింది. కానీ భరించడం గొప్పతనం కాదు, అది అప్పటి అశక్తత. అదే అశక్తతను కొత్త తరం మీద రుద్దడం అన్యాయం.
“పిల్లలు ఉంటే విడిపోవద్దు” అంటారు. కానీ ప్రేమ లేని ఇంట్లో పెరిగే పిల్లలు ప్రేమ నేర్చుకుంటారా? రోజూ గొడవలు, మౌనం, భయం చూస్తూ పెరిగే పిల్లలు సంతోషంగా ఎదుగుతారా? పెళ్లి నిలబెట్టడం కంటే ఆరోగ్యమైన వాతావరణం ఇవ్వడం ముఖ్యమని ఎప్పుడు అర్థం చేసుకుంటాం?
భార్య భర్తలు విడిపోవడం ఓటమి కాదు. ప్రేమ, గౌరవం, భద్రత లేని చోట నుంచి బయటకు రావడం ధైర్యం. కానీ మన సమాజం ధైర్యాన్ని కాదు, భయాన్ని సమర్థిస్తుంది. అందుకే కేవలం బాధలో ఉన్నవాళ్లను ప్రశ్నిస్తుంది, అవమానపరుస్తుంది, గాయం కలిగేలా చేస్తుంది…చివరికి ప్రాణాలే పోయేలా చేస్తుంది.
చివరికి ఒకే ప్రశ్న మిగులుతుంది. బాధ్యత లేని పెళ్లి నిలబడితే దాన్ని విజయం అంటామా? లేక మనిషి తన జీవితాన్ని కోల్పోయినా పెళ్లి పేరు కాపాడుకున్నామనే తప్పుడు సంతృప్తిని విజయం అంటామా? పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడిందో లేదో తెలియదు. కానీ స్వర్గం లేదా నరకం మాత్రం ఇక్కడే తయారవుతుంది. అది మన చేతుల్లోనే ఉంటుంది. పెళ్లి నిలబడాలి అనే దానికంటే, మనిషి నిలబడాలి అనే ఆలోచన ఎప్పుడు మొదలవుతుందో…అప్పుడు మాత్రమే నిజమైన మార్పు వస్తుంది.
ALSO READ: వివాహాలు కావు.. వ్యాపారాలు..! ఇక్కడ అమ్మకానికి పెళ్లికొడుకులు!

రక్త సంబంధం గొప్పదా? లేదా అవసరానికి అండగా ఉండే స్నేహం గొప్పదా? ఆమె జీవితం చెప్పిన సమాధానం
Relationship Tips: మీ లైఫ్ పార్ట్నర్తో చెప్పకూడని నాలుగు విషయాలు.. ఇది సిక్రెసీ కాదు ప్రైవసీ!
Emotional Intelligence: ప్రపంచాన్ని నడిపించే ఒక్కే ఒక్క శక్తి ఎంపతి.. బండరాళ్ల లాంటి మనసులను కూడా కరిగించగలదు!
Relationships: బాధలో కలిసి కన్నీరు కార్చేదే నిజమైన ప్రేమ.. నీ మౌనాన్ని వినగలిగే ఆ ఒక్క మనసు ఎక్కడ దొరుకుతుంది?
Relationship: నిజమైన ప్రేమంటే ఏంటో మర్చిపోయిన తరానికి ఓ జ్ఞాపకం! ఇంతకీ ప్రేమంటే బాధ్యతా… లేదా భారమా?
Relationships: కన్నీటి చుక్కలో దాగిన శాంతి.. ఈ సమాజంపై ఓ మహిళ ఒంటరిగా గెలవగలదా?