Menu

Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!

Lakshmi Aruna 2 months ago
lakshmi aruna writer middle class news

ఉదయం ఆరు గంటలు. అలారం మోగగానే రఘు లేచాడు. మొదట చూసింది తన మొబైల్‌ను కాదు.. గోడపై వేలాడుతున్న ఒక పాత ఫొటోను. కాలేజీ రోజుల్లో స్నేహితులతో కలిసి తీసుకున్న ఫొటో అది. అప్పుడు అతని చేతిలో జాబ్‌ అప్లికేషన్‌ కాదు, ఒక కథల పుస్తకం ఉండేది. సినిమాలు తీయాలనే కల అప్పట్లో అతని కళ్లలో స్పష్టంగా కనిపించేది. ఈ రోజు అదే రఘు అద్దం ముందు నిలబడి షర్ట్ బటన్లు వేసుకుంటున్నాడు. చేతిలో టిఫిన్ బాక్స్. భుజాన ఆఫీస్ బ్యాగ్. ఇదే రోజూ రిపీట్ అవుతూ వస్తుంది. కానీ ఆ ఫొటో చూసినప్పుడల్లా ఒకే ప్రశ్న.. నేను నిజంగా ఏం కావాలనుకున్నాను? ఇదేనా నేను కలలు కన్నా జీవితం అని అద్దంలో చూసుకుంటూ తనలో తానే ప్రశ్నించుకుంటున్నాడు.

ఆ అద్దం అతనికి నిజాన్ని మాత్రమే చూపించదు. జవాబు లేని ప్రశ్నల్ని కూడా చూపిస్తుంది. అప్పటి రఘు కళ్లలో ఉన్న వెలుగు ఇప్పటికీ పూర్తిగా ఆరిపోలేదని అతనికి తెలుసు. కానీ ఆ వెలుగు మీద బాధ్యతల దుమ్ము పేరుకుంది. కలలు మాయమవ్వలేదు. కాలంతో కప్పబడ్డాయి. ప్రతి ఉదయం ఆ అద్దం ముందు నిలబడటం అంటే, తనను తాను గుర్తుచేసుకోవడమే. నేను ఇంకా నేనేనా అని.

అమ్మ వంటింట్లో నుంచి పిలుస్తుంది. “రఘు ఆఫీస్ కి లేట్ అవుతుంది, టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ పెట్టాను త్వరగా తిను.” అని. కలల్లోంచి బయటకొచ్చాడు రఘు. అమ్మ మాటలో ప్రేమ ఉంది, భయం ఉంది, ఆశ ఉంది. నాన్న మందుల డబ్బా టేబుల్ మీద పెట్టి నిశ్శబ్దంగా కూర్చుంటాడు. చెల్లెలి ఫీజు రసీదు అల్మారాలో ఉంది. ఈ ఇంట్లో ప్రతి వస్తువూ ఒక బాధ్యతను గుర్తు చేస్తుంది. రఘు కలలు ఒక్కరోజులో చచ్చిపోలేదు. ఒక్కొక్క రోజూ కాస్త కాస్తగా మసకబారాయి. “ఈ నెల కాదు, వచ్చే నెల చూద్దాం.” “ఇప్పుడు కాదు, ఇంకాస్త స్థిరపడాక.” ఇలా అనుకుంటూ కలలు జీవితంలో ఒక మూలకు నెట్టబడ్డాయి.

ఈ ఇంట్లో నిశ్శబ్దం కూడా మాటలతో నిండిపోయి ఉంటుంది. ఎవరు ఏమీ చెప్పకపోయినా, బాధ్యతలు గట్టిగా వినిపిస్తాయి. అమ్మ చూపులోని నమ్మకం, నాన్న మౌనంలోని త్యాగం, చెల్లెలి భవిష్యత్తు అన్నీ రఘు భుజాల మీద మెల్లగా కూర్చుంటాయి. అందుకే అతని కలలు తిరుగుబాటు చేయవు. ఓపికగా వెనక్కి అడుగేస్తాయి. కుటుంబం ముందు తన కోరికలు చిన్నవిగా అనిపించే ఆ క్షణంలోనే మిడిల్ క్లాస్ మనిషి పెద్దవాడవుతాడు.

అసహనంగానే టిఫిన్ చేసి, బయటకు అడుగు పెట్టేటప్పుడు రఘు తలుపు వద్ద ఒక్క క్షణం ఆగుతాడు. ఆ ఫొటో వైపు మరోసారి చూస్తాడు. కానీ ఆలోచనలను లోపలే దాచుకుని, గట్టిగా ఊపిరి వదిలి ఆఫీస్‌కి బయల్దేరుతాడు. ఎందుకంటే అతను కలల కోసం కాదు.. బాధ్యతల కోసం బయల్దేరుతున్నాడు. ఇది రఘు కథ కాదు. ఇది ప్రతి మిడిల్ క్లాస్ మనిషి కథ. ఇలాంటి కథలు మిడిల్ క్లాస్ లో చాలా ఉన్నాయి.

ప్రతి ఇంటి తలుపు దగ్గర కూడా ఇలాంటి ఒక క్షణం ఉంటుంది. వెళ్లాలనిపించని చోటికి వెళ్లాల్సిన క్షణం. చేయాలనిపించని పనిని చేయాల్సిన క్షణం. బయటకు నడుస్తూ లోపల మిగిలిపోయిన కలల్ని చూసి ఒక చిన్న నిట్టూర్పు. ఈ నిశ్శబ్ద నిర్ణయాలే మిడిల్ క్లాస్ జీవితాన్ని నడిపిస్తాయి. ఎవరూ చూడని ఈ పోరాటమే నిజమైన ధైర్యం.

మిడిల్ క్లాస్ అనేది కలలు లేనివాళ్ల వర్గం కాదు. కానీ ఆ కలలను వెంటనే అనుసరించే స్వేచ్ఛ లేని వర్గం. చిన్నప్పటి నుంచే ముందుగా జీవితం సర్దుకోవాలి, ఆ తర్వాత ఇష్టాల గురించి ఆలోచించాలి అనే భావన మనలో బలంగా నాటుకుపోతుంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు మొదలవుతాయి. ఈ క్రమంలో మనకు నచ్చిన దారి కాకుండా అవసరమైన దారినే ఎంచుకోవాల్సి వస్తుంది. ఇది ఓటమి కాదు. ఇది పరిస్థితులతో చేసిన ఒప్పందం. మనకు నచ్చిన దారిని వదిలి, అవసరమైన దారిలో నడవడం. ఈ నిర్ణయం బాధాకరంగా ఉంటుంది. కానీ తప్పనిసరి. మిడిల్ క్లాస్ మనిషి తన కలల్ని కాదు, తన కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ ఎంపిక వెనుక ఉన్న త్యాగాన్ని ఎవరూ లెక్కించరు. కానీ అదే సమాజాన్ని నిలబెడుతుంది.

మిడిల్ క్లాస్ జీవితంలో సంపాదన ఒక హద్దులోనే ఉంటుంది. నెలకు ఒకసారి జీతం వస్తుంది. కానీ ఖర్చులు మాత్రం ప్రతి రోజూ ఎదురవుతూనే ఉంటాయి. ఇంటి అద్దె, పిల్లల చదువు, రోజువారీ ఖర్చులు, బిల్లులు, వైద్య ఖర్చులు, అప్పుల చెల్లింపులు ఇవన్నీ తప్పనిసరి. ఇవన్నీ తీరాక కలల కోసం మిగిలేది చాలా తక్కువ. అందుకే చాలామంది తమ కలలను వాయిదా వేస్తారు. రిస్క్ తీసుకోవడం మిడిల్ క్లాస్ మనిషికి సులభం కాదు. ఒక నిర్ణయం తప్పు అయితే దాని ప్రభావం ఒక్క వ్యక్తిపై కాదు, మొత్తం కుటుంబంపై పడుతుంది. తల్లిదండ్రుల పొదుపు పోవచ్చు, ఇంటి భవిష్యత్తు అనిశ్చితంగా మారవచ్చు. అందుకే ఇష్టం కన్నా భద్రతకే ప్రాముఖ్యం. స్థిరమైన ఉద్యోగం అనే మాట మిడిల్ క్లాస్ జీవితంలో చాలా పెద్ద విషయం.

ఈ భద్రత కోసం ఎన్నో రాత్రులు నిద్రలేక గడుస్తాయి. కలల గురించి ఆలోచించాలనిపించినా, లెక్కలే ముందు నిలబడతాయి. ఒక తప్పు అడుగు వెయ్యలేం అనే భయం ప్రతిదీ నియంత్రిస్తుంది. అందుకే మిడిల్ క్లాస్ మనిషి కలలు నెమ్మదిగా నడుస్తాయి. కానీ ఆ నడకలో బాధ్యత ఉంటుంది, విలువ ఉంటుంది. సమాజపు ఒత్తిడి కూడా మిడిల్ క్లాస్ కలలను నెమ్మదిగా వెనక్కి నెడుతుంది. ఉద్యోగం ఉందా, జీతం ఎంత, పెళ్లి ఎప్పుడు, ఇల్లు ఎప్పుడు కొంటావ్ అనే ప్రశ్నలు ప్రతి దశలో వినిపిస్తూనే ఉంటాయి. నీకు ఏమి కావాలి అనే ప్రశ్న కన్నా, నువ్వు ఏమి చేయాలి అనే సూచనలే ఎక్కువగా వస్తాయి.

ఈ ఒత్తిడి చాలామంది కలలను మౌనంగా మార్చేస్తుంది. మిడిల్ క్లాస్ జీవితంలో భావోద్వేగ బాధ్యత చాలా ఎక్కువ. తల్లిదండ్రుల త్యాగాలు గుర్తొచ్చినప్పుడు మన కలలు స్వార్థంగా అనిపిస్తాయి. నా కోసమే కాదు, వాళ్ల కోసం అయినా స్థిరపడాలి అనే ఆలోచన మనసులో బలంగా నిలుస్తుంది. ఇదే ఆలోచన చాలామందిని తమ కలల నుంచి దూరం చేస్తుంది. ఈ ఒత్తిడిలోనే మనిషి తనను తాను మర్చిపోతాడు. తన కోరికలు చిన్నవిగా అనిపిస్తాయి. కానీ ఆ త్యాగమే అతన్ని మనిషిగా నిలబెడుతుంది. మిడిల్ క్లాస్ మనిషి ప్రేమించే విధానం కూడా త్యాగమే. కలల్ని కాదు, వాళ్లను ముందుకు పెట్టే ప్రేమ.

ఇన్ని కష్టాల మధ్య కూడా మిడిల్ క్లాస్ కలలు పూర్తిగా చచ్చిపోవు. అవి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. కొందరు ఖాళీ సమయాల్లో, కొందరు రాత్రిళ్లు, మరికొందరు సెలవుల్లో తమ కలల కోసం చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ ప్రయత్నాలే ఒక రోజు పెద్ద మార్పుకు దారి తీస్తాయి. మిడిల్ క్లాస్ కలలు కష్టం. కానీ అవి విలువలేనివి కాదు. ఆలస్యంగా మొదలయ్యే ప్రయాణం. అయినా సరే, గమ్యం చేరినప్పుడు ఆ విజయం వెనుక ఉన్న కష్టం, ఓపిక, త్యాగం అన్నీ అర్థమవుతాయి. అందుకే మిడిల్ క్లాస్ కలలు కష్టం… కానీ సాధ్యం.

ALSO READ: సికింద్రాబాద్‌లో మొదలైన జార్జ్ నిశ్శబ్ద విప్లవం.. ఆకలిని గౌరవంగా ఎదుర్కొన్న ఒక ఆలోచన!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *