Menu

Relationship Tips: మీ లైఫ్‌ పార్ట్‌నర్‌తో చెప్పకూడని నాలుగు విషయాలు.. ఇది సిక్రెసీ కాదు ప్రైవసీ!

Lakshmi Aruna 2 months ago

రవి, అనిత అనే జంట కొత్తగా పెళ్లై సరదాగా గడిపే రోజుల్లో ఉన్నారు. అనితకి ఏ చిన్న విషయం జరిగినా రవితో చెప్పాలి అనిపించేది. ఆఫీస్ సమస్యలు, ఇంట్లో మాటలు, స్నేహితుల విషయాలు, అలాగే గతంలో తన జీవితంలో జరిగిన కొన్ని రిలేషన్‌షిప్స్‌ గురించి కూడా రవితో పంచుకునేది. మొదట్లో రవికి అది నమ్మకంగా అనిపించింది. కానీ రోజులు గడిచేకొద్దీ, అనిత చెప్పే కుటుంబ గొడవలు, పాత విషయాలు, ఇతరుల లోపాలు రవి మనసులో భారంగా మారాయి. చిన్న చిన్న విభేదాలప్పుడు కూడా ఆ మాటలే గుర్తొచ్చి, వారి మధ్య దూరం పెరిగింది. అనిత మాటలనే రవి గుర్తుచేసి దెప్పిపొడిచేవాడు. అప్పుడు అనితకి అర్థమైంది.. ప్రతీ విషయాన్ని షేర్‌ చేసుకోవడంవల్ల సంబంధం బలపడదు, కొన్ని విషయాలను జాగ్రత్తగా దాచుకోవడం కూడా ప్రేమలో భాగమే అని.

ఈ కథను బట్టి చూస్తే…ఒక సంబంధంలో నిజాయితీ అనేది చాలా ముఖ్యం. అలాగే ప్రతి విషయం పంచుకోవాలనే కాదు. ప్రేమ ఉందంటే అన్నీ చెప్పేయాలనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే, కొన్ని విషయాలను మనలోనే ఉంచుకోవడం సంబంధాన్ని బలహీనపరచదు.. మరింత బలపరుస్తుంది. రహస్యాలు దాచడం వేరు, వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడం వేరు. ఈ తేడా అర్థమైతేనే ఒక సంబంధం ప్రశాంతంగా, ఆరోగ్యంగా కొనసాగుతుంది. ఎప్పటికీ భాగస్వామితో పంచుకోకూడని విషయాలు కూడా కొన్ని ఉంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం..!

1. కుటుంబ లోపలి గొడవలు, విభేదాలు

ప్రతి కుటుంబంలోనూ గొడవలు, అపార్థాలు, చిన్నపాటి విభేదాలు ఉంటాయి. అవి ఎక్కువగా భావోద్వేగంతో నడిచేవి, తాత్కాలికమైనవి. అలాంటి కుటుంబ గొడవల్ని వివరంగా మన పార్ట్‌నర్‌తో పంచుకుంటే, వాళ్ల మనసులో మన కుటుంబంపై తప్పుడి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మీ మధ్య గొడవ వచ్చినప్పుడు, అప్పటి మాటలు తిరిగి ఆయుధాల్లా మారొచ్చు. కాబట్టి సమస్య ఉందని చెప్పొచ్చు కానీ ప్రతి మాట, ప్రతి తప్పు ఎవరి వల్ల జరిగిందో చెప్పడం అవసరం లేదు. కుటుంబ విషయాలు గౌరవంగా, జాగ్రత్తగా చూడాలి.

2. గత సంబంధాలు.. ఎక్కువ వివరాలు లేకుండా

మన గతం మన జీవితంలో ఒక భాగమే కానీ అది ప్రస్తుత సంబంధాన్ని నిర్వచించాల్సిన అవసరం లేదు. పాస్ట్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయని చెప్పడం ఒక విషయం. కానీ వాటి లోతైన భావోద్వేగాలు, పోలికలు, వ్యక్తిగత అనుభవాలు చెప్పడం మరో విషయం. అలా చేస్తే అసూయ, అనుమానం, అనవసరమైన భయం పుట్టొచ్చు. నిజాయితీ అంటే పాత గాయాలను మళ్లీ తెరవడం కాదు. గతం ఒక పాఠంగా ఉండాలి కానీ చర్చకు విషయం కాకూడదు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీ పార్ట్‌నర్‌ని ఎలా చూసుకుంటున్నారు అన్నది అన్నిటికంటే ముఖ్యమైన విషయం.

3. మీ లోతైన బలహీనతలు

మన లోతైన బలహీనతలు, భయాలు, లోపాలను వెంటనే, పూర్తిగా చెప్పేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు. నమ్మకం అనేది కాలంతో పెరుగుతుంది. తొందరగా అన్నీ తెరవడం కొన్ని సందర్భాల్లో మనకే నష్టంగా మారొచ్చు. గొడవల సమయంలో, మనం చెప్పిన బలహీనతలే.. తెలియకుండానే మన మీదే రివర్స్ అయ్యే ఉంటుంది. అంటే ఎప్పుడూ మనసు విప్పి చెప్పకూడదని కాదు కానీ, సరైన సమయం, సరైన స్థాయి, భావోద్వేగ భద్రత ఉన్నప్పుడు మాత్రమే పంచుకోవాలి.

4. ఇతరుల రహస్యాలు, బలహీనతలు

ఇంకొకరి రహస్యాలు, సమస్యలు మనవి కావు. ఒక స్నేహితుడి విడాకులు, ఒక సహోద్యోగి ఆర్థిక కష్టాలు, ఇంకొకరి బలహీనతలు లాంటివి చెప్పడం ఇతరులు మనపై పెట్టుకున్న నమ్మకానికి విరుద్ధం. ఇవి పంచుకోవడం వల్ల మన మీద ఉన్న గౌరవం తగ్గుతుంది. అంతేకాదు, మన సంబంధంలో సమస్యలు వచ్చినప్పుడు ఈ విషయాలే తిరిగి మన మీద ప్రభావం చూపుతాయి. ఇతరుల గోప్యతను గౌరవించడం మన వ్యక్తిత్వాన్ని, మన విలువలను చూపిస్తుంది.

చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి… గోప్యత అనేది రహస్యం కాదు. కొన్ని విషయాలను మనలోనే ఉంచుకోవడం అంటే అబద్ధం చెప్పడం కాదు. అది సరిహద్దులు తెలుసుకోవడం, పరిపక్వత, భావోద్వేగ తెలివితేటలకు గుర్తు. బలమైన సంబంధానికి ప్రతి విషయం బయటపెట్టాల్సిన అవసరం లేదు. పరస్పర గౌరవం, అర్థం చేసుకునే మనసు, ఆలోచించి మాట్లాడే జ్ఞానం ఉంటే చాలు. అన్నీ చెప్పడం వల్లే బంధం బలపడదు.. కొన్ని విషయాలను కాపాడుకోవడమే సంబంధాన్ని కాపాడుతుంది.

ALSO READ: ఆఫీస్‌ తర్వాత మరో డ్యూటీ..! మౌనంగా భరిస్తూ.. అంతులేని బాధ్యతల మధ్య అలసిపోతున్న మహిళల మనసులు!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *