Menu

Pulse Polio: రెండే రెండు చుక్కలు.. మిస్‌ చేసుకోవద్దు..! చిన్న తప్పు… పెద్ద నష్టం..! ఇది కేవలం వార్త కాదు.. హెచ్చరిక..!

Lakshmi Aruna 2 months ago
pulse polio drive telugu news

రవి, రాజు బెస్ట్ ఫ్రెండ్స్. రాజుకి రవితో ఆడుకోవటమంటే చాలా ఇష్టం. రవికి కూడా ప్రతి ఉదయం స్కూల్‌కు వెళ్లే సమయంలో తన స్నేహితులతో కలిసి పరిగెత్తాలని ప్రయత్నిస్తాడు. కానీ… ఒక అడుగు ముందుకు వేయగానే ఆగిపోతాడు. అతని వయసు నాలుగేళ్లు. ఉరుకులు పరుగులు పెట్టే వయసు. కానీ అతని కాళ్లు అతనితో పాటు పరుగెత్తలేవు. కారణం… పోలియో. ఒక చిన్న నిర్లక్ష్యం.. ఒక రోజు మిస్ అయిన పోలియో డ్రాప్స్.. రవి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది.

డిసెంబర్ 21…! ఇది సాధారణ తేదీ కాదు. ఒక చిన్న చుక్క పిల్లల భవిష్యత్తును కాపాడే రోజు. పల్స్ పోలియో డేట్ ఇది..! ఒకప్పుడు వేలాది మంది పిల్లలను శాశ్వత వైకల్యానికి గురిచేసిన ప్రమాదకర వైరస్ వ్యాధి పోలియో. ఆడుకోవాల్సిన వయసులో, నడవలేని పరిస్థితికి నెట్టిన వ్యాధి ఇది. కానీ, అదృష్టం కొద్దీ ఈరోజు మన దగ్గర రక్షణ ఉంది. అదే.. పోలియో డ్రాప్స్.

ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా పోలియో డ్రైవ్ నిర్వహిస్తుంది. లక్ష్యం ఒక్కటే.. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఒక్క బిడ్డ కూడా ఈ డ్రైవ్‌ను మిస్సవ్వకూడదు. పోలియో వైరస్ అనేది నీరు, ఆహారం ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. లక్షణాలు కనిపించేలోపే నష్టం జరిగిపోతుంది. ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. ‘మా పిల్లాడికి ఇప్పటికే డ్రాప్స్ వేసాం… మళ్లీ ఎందుకు?’ అని అనుకుంటారు. కానీ డాక్టర్లు చెప్పే జవాబు స్పష్టంగా ఉంది. ప్రతి పోలియో డ్రైవ్‌లో డ్రాప్స్ వేయించినప్పుడే పూర్తి రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది.

ఒక్కసారి ఆలోచించండి.. మీ బిడ్డ నడక, వాళ్ల ఆటలు, వాళ్ల కలలు ఈ రెండు చుక్కల మీదే ఆధారపడి ఉంటే? ఈ రోజు బూత్‌లలో, ఆసుపత్రుల్లో, బస్స్టాండ్‌లలో, రైల్వే స్టేషన్లలో పోలియో డ్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య సిబ్బంది ఒక్క బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇది మన అందరి బాధ్యత. డిసెంబర్ 21న మీ పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించండి. పక్కింటి పిల్లలకు గుర్తు చేయండి. రెండంటే రెండే చుక్కలు.. ఒక చిన్నారి జీవితాన్ని కాపాడతాయి. గుర్తుంచుకోండి ఒక్క బిడ్డ కూడా దాన్ని మిస్సవ్వకూడదు. ఇది కేవలం ఒక వార్త కాదు.. ఇది మనందరి బాధ్యత.

ALSO READ: ఆఫీస్‌ తర్వాత మరో డ్యూటీ..! మౌనంగా భరిస్తూ.. అంతులేని బాధ్యతల మధ్య అలసిపోతున్న మహిళల మనసులు!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *