Menu

Women’s Life: ఆఫీస్‌ తర్వాత మరో డ్యూటీ..! మౌనంగా భరిస్తూ.. అంతులేని బాధ్యతల మధ్య అలసిపోతున్న మహిళల మనసులు!

Lakshmi Aruna 2 months ago

సాయంత్రం ఆఫీస్ టైమ్ అయిపోతుంది…
కంప్యూటర్ షట్‌డౌన్ చేసి…బ్యాగ్ జిప్ క్లోజ్ చేసి…లిఫ్ట్ దిగి కిందకి వస్తారు…అందరూ ఇంటికి వెళ్లాలని తొందరపడుతుంటే…చాలా మంది జాబ్ చేసే మహిళల మనసులో మాత్రం
ఒక మాట వినిపిస్తుంది…”ఇప్పుడే అసలైన పని మొదలవ్వబోతుంది…

అవును…పని మాత్రమే అయిపోయింది…కానీ బాధ్యతలు కాదు.

బయటికి చూస్తే.. ఇది చాలా చిన్న విషయం లా అనిపించవచ్చు. “ఇంటికి వెళ్లడానికి చిరాకు ఎందుకు?” అని ఎవరికైనా అనిపించవచ్చు.

కానీ…ఆ చిరాకు వెనుక చాలా మౌనమైన కథలు ఉంటాయి.

ఆఫీస్‌లో పని స్పష్టంగా ఉంటుంది. ఒక టైమ్ ఉంటుంది…టార్గెట్ ఉంటుంది.. ఎప్పుడు మొదలవ్వాలో, ఎప్పుడు ముగించాలో ఒక అంచనా ఉంటుంది.

కానీ ఇంటికి వెళ్లగానే…టైమింగ్ ఉండదు. ముగింపు ఉండదు. అది డ్యూటీ కాదు…అంచనా వేయటానికి. అది బాధ్యత.

ఇది కూడా చేయాలి…”
అది కూడా చూసుకోవాలి…”
ఇప్పుడే కదా వచ్చావు…ఇంత అలసిపోయావా?” “రోజంతా కూర్చునీ చేసే పని కదా?” దానికే ఇంత అలసటా? ఇలాంటి మాటలు వినిపిస్తాయి. ఎవరూ గట్టిగా అనరు…కానీ ప్రతి చూపు ఒక ప్రశ్నలా ఉంటుంది.

ఆఫీస్‌లో..ఆమెకు పేరు ఉంటుంది..ఆమె స్కిల్‌కు విలువ ఉంటుంది. కానీ, ఇంట్లో…పేరు మెల్లగా కరిగిపోతుంది. కేవలం పాత్ర మాత్రమే మిగులుతుంది.

కూతురు…
భార్య…
అమ్మ…
అక్క…

కానీ..
“నేను” అనే వ్యక్తి మాత్రం
ఎక్కడో నిశ్శబ్దంగా కూర్చుంటుంది.

అదే అసలైన మనసు మోసే బరువు.

ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలి అనిపిస్తుంది. ఒక టీ… ఒక నిశ్శబ్దం…లేదా కేవలం ఏమీ చేయకుండా ఉండే చిన్న అవకాశం.

కానీ ఇంటికి వెళ్లగానే, ఆ ఆలోచన కూడా తప్పులా అనిపిస్తుంది.

ఎందుకంటే.. ఆమె అలసిపోవడానికి హక్కు లేదు. ఆమె మౌనంగా పని చేయాలి. మౌనంగా భరించాలి.

చిరాకు రావడం అంటే..ఇంటిని ద్వేషించడం కాదు. బాధ్యతల్ని తప్పించుకోవడం కూడా కాదు.
నన్ను కూడా ఒక మనిషిగా చూడండి” అనే మనసు చేసే చిన్న అరుపు మాత్రమే.

చాలా సార్లు ఆ చిరాకు వస్తుంది..అది కోపం కాదు. అది అలసట. అది గుర్తింపు కోల్పోయిన బాధ. అది అర్థం చేసుకునే వాళ్లు లేని ఒంటరితనం.

ఆమె పైకి నవ్వుతుంది…కానీ లోపల శూన్యం..నిశ్శబ్దం.నాకంటూ రెస్ట్ లేదా? ఎక్కడికైనా ఒంటరిగా కొన్నాళ్ళు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ఇంట్లో ఆమె పని చేస్తుంది…కానీ ప్రశంస వినిపించదు. అందుకే ఇంటికి వెళ్లే దారిలో
ఎందుకో మనసు భారంగా మారుతుంది.

ఇక చెప్పాల్సిన విషయం ఒక్కటే…

మీరు ఇలా ఫీల్ అవుతున్నారంటే.. మీరు చెడ్డవారు అని కాదు. మీరు బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయట్లేదు. మీరు కేవలం ఎక్కువ మీ కుటుంబానికి ఇస్తూ.. తక్కువ ఆనందం పొందుతున్న ఒక అలసిపోయిన మనసు మాత్రమే.

ఇంటికి వెళ్లడం భారంగా అనిపిస్తే, అది ఇంటిని తిరస్కరించటం కాదు…అర్థం చేసుకోని వాతావరణాన్ని మీ మనసు తిరస్కరిస్తోంది.

కొంచెం స్పేస్…
కొంచెం గౌరవం…
కొంచెం “నువ్వు కూడా అలసిపోతావు
అనే అంగీకారం…
ఇవి దొరికితే
ఇల్లు మళ్లీ ఇల్లే అవుతుంది.

చిరాకు కాదు.. శాంతి ఉంటుంది.

ఈ మాటలు మీ మనసుకు తగిలితే
మీరు ఒంటరివారు కాదు. ఇది చాలా మంది మౌనంగా మోస్తున్న ఒక నిజం.

ALSO READ: మణికొండ కాదు అనకొండ, దోమల కొండ.. అధికారులు నిద్రపోతున్నారా? ఈ వాటర్ లీకేజీకి పరిష్కారం లేదా సార్?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *