
Hyderabad-Manikonda Pipe Line Leakage: మీరు ఇప్పుడు పైన చూసిన ఫొటోలో ఉన్నది డ్రైనేజ్ నీరు కాదు.. వర్షపు నీరు అంతకన్నా కాదు. ఇది అందరూ గొప్పగా చెప్పుకునే మణికొండ ప్రాంతంలో నెలలుగా లీక్ అవుతున్న పైప్‌లైన్ నీరు. ఈ నీరు రోజులు, వారాలు పాటు నిల్వ ఉండిపోవడంతో ఈ ప్రాంతం మొత్తం దోమలతో నిండిపోయింది. రాత్రి అయితే కిటికీలు తెరవలేని పరిస్థితి. పిల్లలు బయట ఆడలేరు. వృద్ధులు భయంతో బతుకుతున్నారు. అయినా కూడా అధికారులకు ఇది కనిపించట్లేదు.
ఇది చిన్న సమస్య అనుకుంటే పొరపాటే. ఇలాంటి నిల్వ నీటి వల్లే డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇప్పటికే చాలామంది జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్య నిన్న మొదలైంది కాదు. చాలా రోజులుగా ప్రజలు వాటర్ బోర్డుకు, GHMCకి ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్నిసార్లు వచ్చి చూసి వెళ్లిపోతారు… కానీ శాశ్వత పరిష్కారం మాత్రం చేయడం లేదు. తాత్కాలికంగా మట్టి వేసి, మళ్లీ వదిలేస్తున్నారు. ఫలితం ఏంటి? మళ్లీ అదే లీకేజీ… మళ్లీ అదే దోమలు.
అంతే కాదు ఈ పైప్ లైన్ పరిసర ప్రాంతాల్లో చెత్త విపరీతంగా వేసేస్తున్నారు.. కనీసం ఆ చెత్తను కూడా GHMCపట్టించుకోక పోవటం వల్ల ఆ నీరు చెత్తలో పేరుకుపోయి దోమలు కుప్పలు కుప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఇక చెత్త కనిపించకపోతే సమస్య లేదన్నట్టు వ్యవహరించడం పాలనా పద్ధతి అయిపోయింది. GHMCకి శుభ్రత అంటే పోస్టర్లలో, ప్రకటనల్లో మాత్రమేనేమో!
ఇదేమీ చిన్న పల్లెటూరు కాదు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ నివసించే ప్రాంతం. అలాగే ఈ పైపులైన్ దగ్గరే.. స్కూల్, కాలేజీలు కూడా ఎక్కువగా ఉంటాయి.కానీ దీని గురించి ఆ స్కూల్ కాలేజీ యాజమాన్యాలు కంప్లైంట్ ఇచ్చారా లేదా అనేది సందేహమే… ఎందుకంటే పాఠశాలలకు వచ్చే విద్యార్థులు సాయంత్రం వరకు ఉండరు కదా.. దోమలు కుట్టినా సాయంత్రం వారంతా ఇంటికి వెళ్లిన తర్వాతే కదా కుట్టేదని వదిలేస్తున్నారా? విద్య అంటే మార్కులకే పరిమితమా? ఆరోగ్యం అవసరం లేదా? పిల్లలకు ఏం అయినా సరే.. తమ పేరు, ఫీజులు తమ చేతికి వస్తే చాలని భావించడమేనా యాజమాన్యాల బాధ్యత?
ప్రతి నెల ట్యాక్స్ కడుతున్న ప్రజలకు ఇదేనా సేవ? ప్రజల ఆరోగ్యంతో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనా పాలన అంటే? ఇప్పుడు ఒక ప్రశ్న తప్పకుండా అడగాలి. ఈ సమస్యకు బాధ్యత ఎవరిది? వాటర్ బోర్డా? GHMCనా? లేక స్థానిక ప్రజాప్రతినిధులా? ఎవరిదైనా సరే… కానీ బాధ్యత తీసుకునేవాళ్లు మాత్రం ఎవరూ కనిపించడం లేదు.
నీరు వృథా అవుతోంది. రోడ్లు పాడవుతున్నాయి. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. అయినా కూడా చర్యలు లేవు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు… ఇది ప్రజల జీవితం మీద జరుగుతున్న అన్యాయం.
ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. పైప్‌లైన్‌కు శాశ్వత మరమ్మత్తు చేయాలి. నిల్వ నీటిని వెంటనే తొలగించాలి. ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు చేపట్టాలి. సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షణ ఉండాలి.దీని గురించి చదువుతున్న మీరు కూడా ఒక పని చేయండి. మీ ప్రాంతంలో ఇలాంటి సమస్య ఉంటే మౌనంగా ఉండకండి. ప్రశ్నించండి. ఫోటోలు, వీడియోలు తీసి బయట పెట్టండి. ఎందుకంటే ప్రశ్నించని ప్రజలే ఇలాంటి నిర్లక్ష్యానికి కారణం అవుతారు.
ఇది ఒక్క మణికొండ సమస్య కాదు. ఈరోజు మణికొండ… రేపు మీ కాలనీ కూడా కావచ్చు. ప్రజల సమస్యలపై గొంతెత్తుతూ మేము మీ ముందుంటాం. ప్రశ్నించే గొంతులు పెరిగితేనే పాలకులకు చెమటలు పడతాయి. మౌనం అనేది అధికారులకి ఇచ్చే పెద్ద లంచం. ఈరోజు మనం మాట్లాడకపోతే.. రేపు బాధపడే హక్కు కూడా మనకు ఉండదు. మీరే ఆలోచించుకోండి.
ALSO READ: రూ.75వేల శాలరీ.. ఇండియన్ ఆర్మీకి సర్వీస్ చేసే ఛాన్స్.. పూర్తి డీటెయిల్స్ ఇవే!

Humanity: సికింద్రాబాద్‌లో మొదలైన జార్జ్ నిశ్శబ్ద విప్లవం.. ఆకలిని గౌరవంగా ఎదుర్కొన్న ఒక ఆలోచన!
Piracy vs OTT: ఓటీటీ లు సినిమాను సమాధి చేస్తున్నాయా? పైసా పై అత్యాశే పైరసీ ని పెంచుతుందా ?
Basheer Bagh Incident: 25ఏళ్ల నెత్తుటి మరక.. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం దాష్టీకం.. అసలు విద్యుత్ పోరాటానికి కారణమేంటి?
HCU Land Issue: సుప్రీం చేతిలో రేవంత్‌కు చివాట్లు! అసలు లొల్లి పర్యావరణం కోసమా? ఈ వివాదం వెనక పూర్తి చరిత్ర ఏంటి?
Mycoplasma pneumoniae: హైదరాబాద్‌లో పడగవిప్పిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్.. పిల్లలూ.. బీ అలెర్ట్!
Dengue: బొప్పాయి ఆకు ప్లేట్లేట్స్ను పెంచుతుందా? దీని వెనుక ఉన్న అపోహలు- నిజాలేంటి?