Menu

LGBTQ: పాత చింతకాయ పచ్చడి ప్రసంగాలు మానుకుంటే చాలా మంచిది..! వారి పట్ల ఇంత వివక్ష ఎందుకు?

Lakshmi Aruna 2 months ago
LGBTQIA children and adolescents face severe discrimination and bullying primarily within homes, schools, and neighborhoods, peaking at ages 12 to 15. Despite legal advances in India, such as decriminalization of homosexuality and transgender rights laws, exclusion persists in education, healthcare, and employment. Activists call for coordinated societal, educational, and institutional efforts—including inclusive policies, sensitization programs, and constitutional recognition—to ensure safety, dignity, and equal opportunities, combating deep-rooted biases and fostering acceptance from early childhood onward.

ప్రతి ఉదయం స్కూల్‌కి వెళ్లే పిల్లలు…బ్యాగ్ కంటే ఎక్కువగా భయం మోసుకెళ్తున్నారు. క్లాస్‌రూమ్‌లో అడుగుపెట్టగానే నవ్వులు, వెక్కిరింపులు, నొప్పించే మాటలు మాటలు.. ‘నువ్వు అందరిలా లేవు.. తేడాగా ఉన్నావు’ అనే మాటలు వాళ్ల మనసును లోలోపల చీల్చేస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ఇంట్లోనే కాదు.. స్కూల్‌లోనూ ‘ఆ’ కమ్యూనిటి పట్ల వివక్ష ఉందని చెబుతున్న పిల్లల గొంతులు ఎన్నో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం.. LGBTQIA+ వర్గానికి చెందిన పిల్లలు, ముఖ్యంగా 12 నుంచి 15 ఏళ్ల వయస్సులో ఉన్నవారు.. తమ టీనేజ్ జీవితాన్ని భయంతో గడుపుతున్నారట.

మీ ఆలోచనలు మారవా?

మన సమాజం ఎంత అభివృద్ధి చెందిందని మనం గొప్పగా చెప్పుకుంటున్నా.. LGBTQIA+ మనుషుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం సమాజపు ఆలోచనలు ఇంకా రాతియుగంలోనే ఉన్నాయి. సైన్స్‌ ఇప్పటికే లింగ వైవిధ్యాన్ని గుర్తించినా.. మనసు-కోరిక అనే విషయాలు పుట్టుకతోనే వస్తాయని పరిశోధనలు రుజువు చేసినా.. ‘మనకు అర్థం కాని ప్రతీది తప్పే’ అనే అహంకారం మాత్రం ఇంకా బతికే ఉంది. ఈ అహంకారమే.. స్కూల్ బ్యాగ్‌లతో పాటు భయాన్ని మోసుకెళ్లే పిల్లలను సృష్టిస్తోంది. ఇది అబద్ధం కాదు.. ఇది అతిశయోక్తి అంతకన్నా కాదు. ఇది మన నిర్లక్ష్యానికి, మన మూఢనమ్మకాలకు ప్రతిబింబం.

ఇది కేవలం ఒక సర్వే కాదు. ఇది మన సమాజం అద్దంలో చూసుకోవాల్సిన నిజం. ఈ సర్వే చెబుతున్నదేమిటంటే.. చాలా మంది LGBTQ పిల్లలు స్కూల్‌లోనే మానసిక వేధింపులకు గురవుతున్నారు. కొందరు ఫిజికల్ బుల్లీయింగ్ కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. అలాంటి వారికి ఇంట్లోవాళ్ల నుంచి కూడా మద్దతు దొరకడం లేదు. బయట ప్రపంచం కఠినంగా ఉండొచ్చు కానీ.. ఇంట్లో కూడా అంగీకారం లేకపోతే ఆ పిల్లవాడు ఎక్కడికి వెళ్లాలి? ఇల్లు ఆశ్రయం కాకుండా శిక్షాగారంగా మారితే ఆ బాధను ఎవరితో చెప్పుకోవాలి.

ఇంటి నుంచే మొదలయ్యే వివక్ష:

ఇల్లు అనేది.. ప్రతి పిల్లవాడికి అత్యంత సురక్షితమైన స్థలం కావాలి. కానీ ఇక్కడే భయం మొదలవుతుందంటే ఆ బాధ ఎంత లోతుగా ఉంటుందో ఊహించండి. “ఇలాంటివి తప్పు”, “మన ఇంట్లో ఇవి ఉండవు” “ఆ విధంగా ఆలోచిస్తే చంపేస్తాం” అనే మాటలు పిల్లల్ని సరిదిద్దడం కాదు….. వాళ్ల మనసును ముక్కలుముక్కలు చేయడమే అవుతుంది. జెండర్ ఐడెంటిటీని “సరిదిద్దాల్సిన లోపం”గా భావించడం అజ్ఞానం మాత్రమే కాదు.. అమానుషం. ఇది అభిప్రాయం కాదు, ఇది శాస్త్రీయ సత్యం.

అప్పుడే వాళ్లలో ఒక ప్రశ్న మెదులుతుంది. తాను ఆలా పుట్టడం తప్పా? తాము తమలా ఉండటం పాపమా? తమ భావాలను వ్యక్తపరచడం నేరమా? ఈ పిల్లలు అడుగుతున్నది ప్రత్యేక హక్కులు కాదు.. సాధారణంగా బతికే హక్కు మాత్రమే. కానీ ఆ భావాలను పంచుకునే సన్నిహితులు వాళ్ళకి ఎందుకు ఉండరు? కన్నవాళ్లు కూడా అర్ధం చేసుకోలేకపోతే వాళ్ళు ఏమవ్వాలి? కుటుంబీకులే అర్ధం చేసుకోలేకపోతే… సమాజం తనను అంగీకరిస్తుందా? ఇలాంటి అనేక సందేహాలతో వాళ్లలో ఒక భయం, ఒంటరితనం తిష్ట వేసుకుంటున్నాయి. ఈ ప్రశ్నలకు పిల్లలు బాధ్యులు కాదు. ఈ ప్రశ్నలు పుట్టించేది మన సంకుచిత ఆలోచనలే. మనకు అర్థం కానిది తప్పు అనడం, మన అసమర్థతకు ఇచ్చుకునే సాకే తప్ప సత్యానికి నిర్వచనం కాదు.

నిర్లక్ష్యం చేయొద్దు:

ఆ భయం, ఒంటరితనం పెరిగితే చదువుపై ఆసక్తి తగ్గుతుంది. స్కూల్ డ్రాపౌట్స్ పెరుగుతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక పిల్లవాడి భవిష్యత్తును మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..12 నుంచి 15 ఏళ్ల వయసు అంటే.. పిల్లలు తమను తాము అర్థం చేసుకునే దశ. ఈ దశలో అంగీకారం దొరికితే ధైర్యం పెరుగుతుంది. నిరాకరణ దొరికితే జీవితాంతం వారికి గాయాలే మిగులుతాయి. అందుకే పిల్లల మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే సమాజం ఎంత అభివృద్ధి సాధించినా దండగే అని చెప్పుకోవాలి.

అయితే గర్వించదగ్గ విషయమ ఏంటంటే.. ఇప్పుడిప్పుడే కొన్ని స్కూల్‌లు ముందడుగు వేస్తున్నాయి. సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్, కౌన్సిలింగ్ సపోర్ట్, ప్రతి పిల్లవాడిని సమానంగా చూసే విధానం లాంటి చిన్న చిన్న ఆసరాలు వారికీ దొరుకుతున్నాయి. ఇవి చిన్న అడుగులే కావచ్చు కానీ పిల్లల జీవితాల్లో పెద్ద మార్పులు తీసుకురాగలవు. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఒక్కటే..మన ఐదు వెళ్లే సమానంగా వుండవు.. అలాగే పుట్టిన అందరు ఒకేలా ఆలోచించరు. ఒకేలా ఉండరు. జెండర్ జడ్జిమెంట్ మానుకోండి.

మార్పు రావాల్సింది తల్లిదండ్రుల్లోనే:

ఇదంతా ఒక వర్గం గురించి కాదు. ఇది మన సమాజం గురించి. పిల్లలు మారాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలు మారాలి. ఇల్లు భయానికి కాదు. భరోసాకు స్థలం కావాలి. స్కూల్ వేధింపులకు కాదు. భవిష్యత్తుకు బాట వేయాలి. టెక్నాలజీ వేగంగా దూసుకుపోతున్న ఈ యుగంలో కూడా నాగరికత లేకుండా ఆలోచించేవాళ్ల సంఖ్య భారీగా ఉండడం బాధాకరం. మార్పు పిల్లల్లో కాదు తల్లిదండ్రుల్లో రావాలి. మా పెద్దవాళ్ళు ఇలానే ఉండమని చెప్పారు. మీరు ఇలానే ఉండాలి అనే పాత చింతకాయ పచ్చడి ప్రసంగాలు మానుకోండి. ఒక పిల్లవాడు భయం లేకుండా బతికితేనే.. ఈ సమాజం నిజంగా ముందుకు వెళ్తుంది. ఇది కేవలం ఒక వార్త కాదు. ఇది హెచ్చరిక. ఇది విమర్శ కాదు. ఇది మనందరి బాధ్యత.

ALSO READ: అణచివేతల చీకట్లో నిలబడ్డ వెలుగులు.. ప్రేమకు పరిధులుంటాయా? ఇది వినిపించని గొంతుల గర్జన!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *