Menu

Scrub Typhus: ఏపీని భయపెడుతున్న స్క్రబ్ టైఫస్‌.. కంటికి చిక్కని ఈ వ్యాధి లక్షణాలేంటి?

Praja Dhwani Desk 2 months ago
what is scrub typhus telugu

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో అడవి, పొలాల మధ్య ఎక్కువగా కనిపించే చిగర్ అనే సూక్ష్మ పురుగు గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ పురుగు కాటు వల్ల వచ్చే స్క్రబ్ టైఫస్(Scrub Typhus) అనే వ్యాధి ఇటీవల రాష్ట్రాన్ని కలవరపరుస్తోంది. సాధారణ జ్వరం అనుకుని నిర్లక్ష్యం చేయడం కారణంగా ప్రాణాలు పోయే ప్రమాదముంది. విజయనగరం జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే మహిళ ఈ పురుగు కాటుకు గురైన తర్వాత అస్వస్థతకు లోనయ్యారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ చనిపోవడంతో ఈ వ్యాధి పేరు ఒక్క రోజులో రాష్ట్రమంతా చర్చగా మారింది. ఆరోగ్య శాఖ తాజాగా చెప్పిన సంఖ్యలు చూస్తే దాదాపు ప్రతి జిల్లాలో ఈ ఇన్ఫెక్షన్ కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది.

కొత్త జ్వరం, తెలియని పురుగు వ్యాధి అంటూ పలు ఊళ్లలో భయం పెరిగినా, వైద్యుల ప్రకారం ఈ వ్యాధి గుర్తించిన వెంటనే ఇచ్చే సాధారణ యాంటీబయాటిక్స్ చికిత్సతో పూర్తిగా నయం చేయగలిగేదే. సమస్య ఎక్కడంటే ప్రారంభ లక్షణాలను గమనించకుండా ఆలస్యం చేయడం వల్ల పరిస్థితి దిగజారుతుంది. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో అసలు స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? ఏ లక్షణాలు కనిపిస్తాయి లాంటి ప్రశ్నలు అందరిలోనూ మొదలవుతుండటంతో ఈ వ్యాధి గురించి స్పష్టమైన అవగాహన అవసరం.

ఈ వ్యాధి ఎక్కడ నుంచి వచ్చింది?

స్క్రబ్ టైఫస్ అనే పేరు చాలా మందికి కొత్తగా అనిపించినా ఇది అసలు కొత్త వ్యాధి కాదు. దక్షిణ ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ప్రధానంగా చిగర్ అనే చిన్న కీటకం కాటు వల్ల వస్తుంది. ఈ చిగర్లు సాధారణంగా అడవుల్లో, పచ్చిక పొదల్లో, పొలాల్లో, గోతుల దగ్గర, వర్షాకాలంలో మట్టి తడిగా ఉండే ప్రదేశాల్లో పెరుగుతుంటాయి. మొదట ఇవి ఎలుకల లాంటి చిన్న జంతువులపై జీవిస్తాయి. అక్కడి నుంచి మానవులకు చేరుతాయి. మనం పొలాల్లో పని చేసే సమయంలో లేదా అడవి పక్కన తిరిగే సమయంలో ఈ చిన్న పురుగులు చర్మంపై పడితే అవి కుట్టిన చోట చిన్న గాయం ఏర్పడుతుంది. ఆ చిన్న గాయం నుంచి రికెట్ట్సియా అనే బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడినుంచే స్క్రబ్ టైఫస్ ప్రారంభమవుతుంది.

కంటికి చిక్కదు:

ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా కంటికి కనిపించదు. పురుగు కూడా చాలా చిన్నగా ఉండటంతో చాలామంది అది కుట్టిందనే విషయాన్ని గమనించరు. మొదటి 2-3రోజులు సాధారణ జలుబు లేదా వైరల్ జ్వరం వచ్చినట్టే అనిపిస్తుంది. కానీ రాత్రికి రాత్రే జ్వరం పెరగడం, శరీరమంతా అలసట , తలనొప్పి, చేతులు కాళ్ల నొప్పులు తీవ్రంగా రావడం ప్రారంభిస్తాయి. చాలామందిలో పురుగు కుట్టిన చోట చిన్న గుండ్రంగా నల్లటి మచ్చ ఏర్పడుతుంది. ఈ మచ్చ గాయం లాగా కనిపించి చుట్టూ ఎర్రగా మారుతుంది. కొంతమందిలో చిన్న దద్దుర్లు కూడా రావచ్చు. జ్వరం తగ్గకపోతే శ్వాస ఇబ్బంది, వాంతులు, కిడ్నీలు మరియు ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం రావడం వంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే స్క్రబ్ టైఫస్‌ను తొందరగా గుర్తించడం చాలా ముఖ్యం.

ALSO READ: నీరు లేని దేశంగా మారుతున్న ముస్లిం అగ్రరాజ్యం.. ఈ దీన దుస్థితికి కారణాలేంటి?

ఈ వ్యాధిని నిర్ధారించడం కోసం వైద్యులు రక్తపరీక్షలు చేస్తారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో స్క్రబ్ టైఫస్ పరీక్షలు కూడా చేస్తారు. మంచి విషయం ఏంటంటే ఈ వ్యాధికి చికిత్స ఉంది. డాక్టర్లు సూచించే సాధారణ యాంటీబయాటిక్స్‌తో చికిత్సను వెంటనే ప్రారంభిస్తే కొన్ని రోజుల్లోనే జ్వరం తగ్గుతుంది, రోగి కూడా పూర్తిగా కోలుకుంటాడు. అయితే చాలా మంది 2-3 రోజుల పాటు జ్వరం ఉన్నా పట్టించుకోకుండా ఇంట్లోనే మందులు వేసుకుంటూ ఇన్ఫెక్షన్ తీవ్రం అయ్యేంతవరకు ఉంటారు. అప్పుడు పరిస్థితి క్లిష్టమవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఈ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం, కడప, నెల్లూరు లాంటి జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
చిత్తూరులో 379, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, వైఎస్సార్ కడపలో 94, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తాజా లెక్కలు చెబుతున్నాయ్. ఇటు విజయనగరంలో రాజేశ్వరి మృతి తర్వాత ప్రజల్లో మరింత భయం పెరిగింది. గ్రామాల్లో పొలాల్లో పని చేసే మహిళలు, వ్యవసాయ కార్మికులు, అడవి తట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లు వైద్యశాఖ చెబుతోంది. వర్షాకాలం నుంచి శీతాకాలం మధ్య ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని గత రికార్డులు కూడా సూచిస్తున్నాయి.

ప్రజలు ఈ వ్యాధి నుంచి రక్షించుకోవడానికి కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. పొలాల్లో లేదా గడ్డి మధ్య పనిచేసే సమయంలో పూర్తిగా చేతులు-కాళ్లు కప్పే దుస్తులు వేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేసి బట్టలు కడిగి ఎండలో ఆరబెట్టాలి. పిల్లలను పొదలు, గడ్డిచెట్ల మధ్య ఆడనివ్వకూడదు. జ్వరం వచ్చిన వెంటనే దీన్ని సాధారణ వైరల్ జ్వరం అనుకుని వదిలేయకుండా దగ్గర్లోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలి. వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకుని చికిత్స ప్రారంభిస్తే పెద్ద సమస్య ఏమీ రాదు.

నిజానికి స్క్రబ్ టైఫస్ అనే పేరు కొత్తగా వినిపించడం వల్ల ప్రజలు భయపడుతున్నారు. కానీ ఇది భయపడాల్సిన అవసరం ఉన్న వ్యాధి కాదు. అవగాహనతో ఉంటే ముందు నుంచే నివారించవచ్చు. ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుంది. ఆరోగ్యశాఖ సూచనలు పాటించడం ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం.

ALSO READ: బాధలో కలిసి కన్నీరు కార్చేదే నిజమైన ప్రేమ.. నీ మౌనాన్ని వినగలిగే ఆ ఒక్క మనసు ఎక్కడ దొరుకుతుంది?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *